Brave Woman ……………………………………….. “నీ గుండెల్లో నేతాజీ ఉన్నట్లయితే ….పెకిలించి తీసి .. బంధిస్తా” నంటూ జైలర్ కోపంతో ఊగిపోయాడు. “ఈమె గుండెలను చీల్చేయండి ” అని అక్కడ రక్షక భటులకు ఆదేశమిచ్చాడు. రక్షక భటులు ఇనుప సాధనాలు తీసుకువచ్చి ఆమె వక్షస్థలాన్నికోసారు. రక్తం చివ్వున చిమ్ముతూ ఉండగా ఆ తల్లి విలవిలలాడి పోయింది. అయినా నోరు విప్పి నేతాజీ గురించి ఏమీ చెప్పలేదు. ఆ దృశ్యం చూసి బ్రిటిష్ ముష్కరులు రాక్షసానందం పొందారు. (ఈ సంఘటన అండమాన్ నికోబార్ దీవుల లోని కాలాపాని జైలులో జరిగింది.)
ఆంగ్లేయులను ధైర్యంగా ఎదిరించి … వారి అకృత్యాలను భరించిన ఆ వీర మహిళ పేరు నీరా ఆర్య. ఆజాద్ హింద్ ఫౌజ్ లోని ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా రెజిమెంట్ లో శిక్షకురాలు. ఆంగ్లేయులు ఆమెను అండమాన్ కాలాపాని జైలు లో చిత్రహింసలు పెట్టారు. తనను కట్టుకున్నవాడే ఆంగ్లేయుల పంచన చేరి దేశద్రోహి గా మారి సమరయోధులను హత్య చేయడాన్ని కళ్ళారా చూసి అతడు ఇక భూమిపై ఉండకూడదని నిర్ణయం తీసుకొని భర్తను పొడిచి చంపేసింది ఆమె. నేతాజీ తో పాటు మరెందరో దేశభక్తులను రక్షించిన వీరాంగణ ఈ నీరా ఆర్య.
భారతదేశ చరిత్రలో మొదటి గూఢచారిణి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ మహిళా విభాగం ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన “నీరా ఆర్య” 1902 మార్చి 5 న ఇప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం “భాగ్ పత్ జిల్లా”లోని ‘ఖేకడా’ అనే నగరంలో జన్మించారు.తండ్రి “శేట్ చజ్ మల్” అప్పటికే దేశంలో గొప్ప పేరున్న వ్యాపారవేత్త, నీరా ఐదవ ఏట తండ్రి కలకత్తా కు వలస వెళ్ళాడు. నీరా ఆర్య విద్యాభ్యాసం మొత్తం కలకత్తాలోనే పూర్తయింది, తాను తండ్రితో కలిసి పలు ప్రాంతాల్లో తిరగడం మూలానా పలు భాషలు కూడా నేర్చుకుంది.
నీరా చిన్ననాటి నుంచే చదువు, ఆటపాటలలోను చురుగ్గా ఉండేది. దేశభక్తితో పాటు స్వతంత్ర్య భావాలను కలిగి ఉండేది. బ్రిటిష్ వారిని తరిమికొట్టాలనే ఆలోచనలు కలిగి ఉండడాన్ని తండ్రి గమనించాడు. యుక్త వయసు రాగానే నాటి బ్రిటిష్ ఇండియా సిఐడి పోలీస్ ఇన్ స్పెక్టర్ “శ్రీకాంత్ జొయరంజన్ దాస్” తో వివాహం జరిపించాడు.తన భర్త బ్రిటిష్ వారి కోసం పనిచేస్తుండగా, తను నేతాజీ నేతృత్వాన దేశం కోసం పని చేసేది. ఇద్దరివీ పరస్పర విరుద్ధ భావాలు అయినప్పటికీ … అతనిలో మార్పు తీసుకువచ్చి దేశభక్తుడిగా మార్చాలని ప్రయత్నం చేస్తూనే భర్తతో కలిసి చాలాకాలం జీవనం కొనసాగించింది.
బ్రిటిష్ ప్రభుత్వం నీరాఆర్య భర్తను నేతాజీ కదలికలను గుర్తించి …వీలైతే వెంటనే హతమార్చే పనిలో నియమించింది. ఒక సందర్భంలో నీరాఆర్య భర్త నేతాజీనీ తుపాకీతో కాల్చగా గురి తప్పి డ్రైవర్ కు గాయం అయింది. ఈ క్రమంలో నేతాజీని కాపాడటానికి తన వెంటే ఉన్న కత్తితో భర్తను పొడిచి వేసింది. జోయా రంజన్ దాస్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత నీరా ఆర్య నాగిని అనే మారుపేరుతో స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను నిర్వహించింది. నీరాఆర్య తమ్ముడు బసంత్ కుమార్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ లో పని చేసేవాడు. మహిళల కోసం ఏర్పాటు చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ కెప్టెన్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మహిళా సైనికులకు శిక్షణ ఇచ్చేవారు. నూతన సైనికులను సమకూర్చేవారు.
భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రవాస ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ కేంద్రంగా సైనికులను సమకూర్చుకుని ఆంగ్లేయులను పారద్రోలుటకు భారత్ వైపు బయలు దేరాడు. చారిత్రాత్మకమైన ‘ఛలో ఢిల్లీ ‘ నినాదం ఇచ్చి ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకుని ప్రజలందరూ స్వాగతాలు పలుకుతుండగా ఢిల్లీ వైపు సాగే క్రమంలో వాతావరణం అనుకూలించలేదు. వర్షాలు వరదలు తుఫాను తాకిడికి సైన్యం చెల్లాచెదురై పోయింది. మరోవైపు సహాయం కోసం విదేశాలకు వెళ్లిన నేతాజీ అదృశ్యమై పోయారు.
ఆ తర్వాత ఆజాద్ హిందు ఫౌజు సైన్యం లొంగిపోయింది. ఎర్రకోటలో విచారించి అజాద్ హింద్ ఫౌజ్ సైనికులందరికి శిక్షలు వేశారు. నీరాఆర్య ను మాత్రం ఖైదు చేసి అండమాన్ “కాలాపాని” జైలుకు పంపారు. జైల్లో ప్రతిరోజు అతి కిరాతకంగా ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. అక్కడే ఆమె రొమ్ములను కోశారు. నీరా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉర్దూ కవయిత్రి “ఫర్హానా తాజ్” తో జైలులో జరిగిన ఘటనలను పంచుకోగా, ఆమె వాటిని తన రచనల్లో పొందు పరిచింది.
నీరా ఆర్య చివరి రోజుల్లో హైదరాబాద్ ఫలక్ నుమా ప్రాంతంలో గుడిసెలోనే నివసిస్తూ రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటూ జీవనం కొనసాగించింది. అప్పుడప్పుడు చుట్టుపక్కల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చదువుకునే పుస్తకాలు, ఆడుకునే వస్తువులు ఇచ్చేవారని అంటారు. అలా అజ్ఞాతంలో ఉంటూనే 26 జూలై 1998 న 96 ఏళ్ళ వయసులో అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరి మరణించారామె. ఒక పత్రికా విలేఖరి తన మిత్రుల సహాయంతో ఆమె అంతిమ సంస్కారాలు జరిపించారు.
—————-– ఆకారపు కేశవరాజు