అతడ్నిచూసి అగ్రహీరోలు అసూయ పడేవారట!

Sharing is Caring...

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు ల తర్వాత మంచి గుర్తింపు సాధించిన హీరో హరనాథ్. అప్పట్లో హరనాథ్ కు మహిళా ప్రేక్షకుల ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. సినిమాల్లోకి రాకముందు హరనాథ్  నాటకాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఒక సారి పని మీద మద్రాస్ వచ్చి పాండీ బజారు షాపులో చెప్పులు కొంటుండగా దర్శకుడు గుత్తా రామినీడు హరనాథ్ ను చూసి ఇంప్రెస్ అయ్యాడు. తన గురించి పరిచయం చేసుకుని హీరో ఛాన్స్ ఆఫర్ చేశారు.

ఆ సినిమానే మాఇంటి మహాలక్ష్మి. హైదరాబాద్ లో నిర్మించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా గొప్ప విజయం సాధించక పోయినా హరనాథ్ పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో  హీరోయిన్ గా జమున నటించారు. 

ఆ తర్వాత ఎన్టీఆర్ సీతారామకల్యాణం సినిమా తీస్తూ రాముడి పాత్ర వేసే నటుడి కోసం అన్వేషిస్తుండగా హరనాథ్ ను నటుడు ముక్కామల సిఫారసు చేశారు. వెంటనే అతగాడిని పిలిపించి మేకప్ టెస్ట్ చేయించి .. రాముడి పాత్రకు ఎన్టీఆర్ కంఫర్మ్ చేశారు.

హరనాథ్ మంచి పొడుగు .. దానికి తగినట్టు రూపసి కావడంతో రాముని పాత్రకు బాగా సూట్ అయ్యాడు. పాత్ర చిన్నదైనా మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ తర్వాత హరనాథ్ రాముడు, కృష్ణుడు పాత్రలకు బాగుంటాడు అనే టాక్ వచ్చింది.

ఆ విధంగానే నిర్మాతల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. అలాగే సాంఘిక చిత్రాల్లో హీరో గా కూడా పేరు తెచ్చుకున్నాడు. లేత మనసులు పెద్ద హిట్ కావడంతో పాటు  హరనాథ్ మెల్లగా రొమాంటిక్ హీరోగా మారాడు.

“అందాల ఓ చిలుక … అందుకో నా లేఖ” పాట అతగాడి ఇమేజ్ పెంచేసింది. లేత మనసులు లో కూడా హరనాథ్ జమున జంటగా నటించారు. అక్కడి నుంచి ఆ ఇద్దరు హిట్ పెయిర్ గా మారారు. చాలా సినిమాల్లో చేశారు. భేషజాలకు పోకుండా కొన్ని సైడ్ హీరోలు పాత్రలు కూడా హరనాథ్ చేశారు.

మెల్లగా స్థిర పడుతున్న దశలో మద్యపానం ఆయన కెరీర్ ను బాగా దెబ్బతీసింది. క్రమశిక్షణ లోపించడం .. టైమ్ ప్రకారం షూటింగ్ కి హాజరు కాకపోవడం మూలాన వచ్చిన పేరు ..గుర్తింపు కూడా పోయింది.

తదనంతర కాలంలో కేవలం చిన్నపాత్రలకే పరిమితమైపోయారు.దాంతో నిర్మాతలు కొత్త హీరోలైన కృష్ణ, శోభన్, రామకృష్ణలతో సినిమాలు తీసేవారు. ఒక దశలో అప్పటి అగ్ర హీరోలు హరనాథ్ ను చూసి అసూయ పడేవారని  ఆ తరం జర్నలిస్టులు చెబుతుంటారు. ఒక సినిమా షూటింగ్ లో అప్పటి సహా దర్శకుడిగా ఉన్న దాసరి నారాయణ రావుతో గొడవ పడ్డారని అంటారు.

తమిళం, హిందీ , కన్నడ చిత్రాల్లో కూడా హరనాథ్ నటించారు. 1989 లో హరనాథ్ గుండె పోటు తో మరణించారు. హరనాథ్ కుమారుడు  శ్రీనివాసరాజు తొలి ప్రేమ, చిరుజల్లు వంటి చిత్రాలకు నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. కుమార్తె పద్మజ నిర్మాత జీవీజీ రాజు భార్య. హరనాథ్ సతీమణి భానుమతి 2015 లో కన్నుమూసారు.

———KNM  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!