ఆ ముసిముసి నవ్వుల వెనుక !!

Sharing is Caring...

She shined as an actress and dancer……………………..

నటిగా, నర్తకిగా రాజసులోచన ఓ వెలుగు వెలిగారు.తొలితరం తెలుగు సినిమా కథానాయికల్లో రాజసులోచన ఒకరు.. ” ఈ ముసి ముసి నవ్వుల.. విరిసిన పువ్వుల గుసగుసలేమిటి ?” “రాధ నేనే … కృష్ణుడు నీవే” వంటి పాటలు విన్నపుడు ఎవరికైనా రాజసులోచన టక్కుమని గుర్తుకొస్తారు.

రాజసులోచన నవ్వే తీరు గమ్మత్తుగా ఉంటుంది. దగ్గరనుంచి చూసారు కాబోలు రచయిత ఆరుద్ర ‘ఇద్దరు మిత్రులు ‘ సినిమా కోసం ‘ఈ ముసిముసి నవ్వుల’ పాట రాశారు. ఆ నవ్వు చూసే ఆమెకు చాలామంది అభిమానులయ్యారు.

నాటి మేటి కధానాయకులైన ANR,NTR,MGR ల సరసన కధానాయిక పాత్రలను పోషించిన ఈ అందాల తార సొంతవూరు విజయవాడ. ఆమె తండ్రి భక్తవత్సలం రైల్వే ఉద్యోగి గా చేశారు. ఆయనకు మద్రాస్ కి బదిలీ కావడంతో అక్కడే రాజసులోచన చదువుకున్నారు.

ఆమె అసలు పేరు ‘రాజీవ లోచన’ అయితే ‘రాజసులోచన’గా పాఠశాల రికార్డ్స్ లో తప్పుగా రాశారట. అప్పటినుంచి ఆపేరు తోనే ఆమెను పిలిచేవారు.ఆచార వ్యవహారాలు ఖచ్చితంగా పాటించే ఇంట పెరిగిన రాజసులోచన ఫిడేలు వాయించడం కూడా నేర్చుకున్నారు. అయితే నృత్యమంటేనే ఆమెకు మక్కువ ..ఎక్కువ.

తన పదవ ఏట నుంచే డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టారు. అలా తాను నేర్చుకున్నది చుట్టుపక్కల ఆడపిల్లలకు నేర్పేవారు. ఎక్కడ అవకాశం లభించినా నాట్య ప్రదర్శన లిచ్చేవారు. ప్రసిద్ధ కూచిపూడి నాట్యగురువులు వెంపటి పెద సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి,… చినసత్యం,తదితరుల వద్ద ఆమె శిక్షణ పొందారు.

భరత నాట్యం, కూచిపూడి, కధక్, కధాకేళి వంటి నృత్య రీతుల్లో శిక్షణ పొందారు. దేశ విదేశాలలో ఎన్నోనృత్య ప్రదర్శనలను ఇచ్చారు. అమెరికా, చైనా, జపాన్, శ్రీలంక , రష్యా, సింగపూర్ వంటి దేశాలలో ప్రదర్శనలిచ్చి ప్రశంసలు అందుకున్నారు.

రాజసులోచన ఇచ్చిన నాట్య ప్రదర్శనలతోనే ఆమెకు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. కన్నడ సినిమా ‘గుణసాగరి’లో తొలి సారిగా తెరపై కనిపించారు. తమిళ సినిమా ’సత్యశోధనై’ ఆమె రెండవ చిత్రం. తెలుగులో ‘కన్నతల్లి’ మొదటి సినిమా .. అందులో చిన్న పాత్రలో రాజసులోచన నటించారు.

ఎన్టీఆర్ హీరోగా నటించిన ’సొంతవూరు’ సినిమాతో కధానాయిక పాత్రలు వేయడం మొదలు పెట్టారు. ఈ సినిమాను సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల నిర్మించారు. ఆ తర్వాత ఆమె ఎన్నో చిత్రాలలో కధానాయికగా నటించారు. రాజసులోచన నటించిన ఎన్నో చిత్రాలు వందరోజులు ఆడాయి. నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి.

ఆమె నటించిన చిత్రాలలో ‘రాజమకుటం’ లోని సడిసేయకోగాలి… సడిసేయబోకే .. పాటను నేటికీ సంగీతప్రియులు విని ఆనందిస్తుంటారు. జానపద ఇతివృత్తంగల ఆ సినిమా ఆర్ధికంగా పెద్దగా విజయం సాధించక పోయినా ఎన్టీఆర్ రాజసులోచన నటన, బియన్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఆ చిత్రాన్ని వెండితెరపై చిర స్థాయిగా నిలిచేలా చేసింది.

తమిళ , కన్నడ, మళయాళం, ఇతర భాషల సినిమాలలో కూడా రాజసులోచన నటించారు. ‘సితారోంసే ఆగే’, ‘చోరీ చోరీ’, ‘నయా ఆద్మీ’ మొదలైన హిందీ సినిమాలలో కూడా నటించారు. తెలుగులో ఆమె నటించిన కన్నతల్లి, సొంతవూరు,పెంకి పెళ్ళాం, పాత తోడి కోడళ్ళు, పాండవ వనవాసం, సారంగధర వంటి చిత్రాలు ప్రజాదరణ పొందాయి.

పెళ్ళినాటి ప్రమాణాలు, మాంగల్యబలం, రాజమకుటం, శాంతినివాసం, టైగర్ రాముడు, జయభేరి, వాల్మీకి, వెలుగునీడలు, తిరుపతమ్మకధ, బభ్రువాహన, తాతామనవడు వంటి వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.  

సినిమాల్లోకి ప్రవేశించే తరుణంలోనే రాజసులోచన కు ‘పరమ శివమ్’ అనేవ్యక్తి తో వివాహమైంది. ఇది లవ్ మ్యారేజ్. తల్లితండ్రులకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు. ఒక కుమారుడు పుట్టాక ..పరమ శివమ్ వేధింపులు ఎక్కువై రాజసులోచన విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత ప్రముఖ సినీ దర్శకులు సియస్.రావు ను 1963లో వివాహం చేసుకున్నారు.సి.ఎస్.రావు కు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు. ప్రముఖ నటి కన్నాంబ కూతురు రాజేశ్వరి ఆయన భార్య.ఈ వివాహం విషయంలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. 

రాజసులోచన ఆయన దర్శకత్వంలో కూడా చాలా సినిమాలలో నటించారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. ఆ ఇద్దరూ పెద్దయ్యాక సీఎస్ రావు తో కూడా అభిప్రాయబేధాలు ఏర్పడి విడిపోయారు. మొత్తం మీద రాజసులోచన వైవాహిక జీవితం అంత సజావుగా సాగలేదని అంటారు.

ఎవరు ఏ పాత్ర చేయమని అడిగినా ఆమె కాదనేవారు కాదు.. కొన్ని వ్యాంప్ పాత్రల్లో ..కొన్ని సినిమాల్లో కేవలం ఐటమ్ సాంగ్స్ లోనూ తళుక్కుమన్నారు.దాదాపు 300 చిత్రాలలో నటించిన ఆమె చివరగా నటించిన సినిమా కొత్త ‘తోడి కోడళ్ళు’. కరుణానిధి,యం.జి.ఆర్, జయలలిత, యన్.టి.రామారావులు ముఖ్యమంత్రులగా ఉన్న సమయంలో ‘నృత్యరూపకాలను’ రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రముఖ నటి సావిత్రి నిర్మించిన ‘చిన్నారిపాపలు’ సినిమాకు నృత్య దర్శకత్వం వహించారు. తొలి మహిళా డాన్స్ డైరెక్టర్ ఆమే. ‘పుష్పాంజలి’అనే నృత్య కళా కేంద్రాన్నిస్థాపించి ఆమె అనేకమందికి నాట్యంలో శిక్షణను ఇచ్చారు. తన ఆస్తిలో కొంత తాను నెలకొల్పిన నృత్య కళాశాలకు రాసిచ్చేసి, తన కళాభిమానాన్నిచాటుకున్నారు.2013 లో రాజసులోచన కన్నుమూశారు.  

——–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!