Relieved tension ..........................
తిరుగుబాటు ప్రకటన తో రష్యా నాయకత్వాన్ని వణికించిన వాగ్నర్ గ్రూపు ప్రస్తుతం సైలెంట్ అయింది. బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో జోక్యంతో వెనక్కి తగ్గిన వాగ్నర్ గ్రూపు స్వాదీనం చేసుకున్న రొస్తోవ్‌ను విడిచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం వాగ్నర్ గ్రూపు నాయకుడు ప్రిగోజిన్ కూడా ఎక్కడ ఉన్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే ఒకప్పటి తన నమ్మిన బంటు ప్రిగోజిన్ తిరుగుబాటు చేయబోతున్నారనే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఒక రోజు ముందు గూఢచారులు చేరవేశారు. బెలారస్ మధ్యవర్తిత్వం పై పుతిన్ ఎటువంటి ప్రకటనా ఇప్పటి వరకు చేయలేదు. పుతిన్ శనివారం మధ్యాహ్నమే ప్రత్యేక విమానంలో మాస్కోను వీడి రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారని చెబుతున్నారు.
వాస్తవానికి రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటుకు ప్రిగోజిన్ కొద్దిరోజుల నుంచే ప్లాన్ చేస్తున్నట్టు అమెరికా గూఢచారి వర్గాలు గుర్తించాయి. గంటల వ్యవధిలోనే శుక్రవారం వాగ్నర్ దళాలు ఒక్కసారిగా ఉక్రెయిన్ సరిహద్దులను వీడి రష్యాలోని రొస్తోవ్ నగరం వైపుగా దూసుకెళ్లాయి. వేగంగా అక్కడికి చేరిన వెంటనే రొస్తోవ్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈవిషయం వెంటనే పుతిన్ కి తెలిసిపోయింది.
అక్కడనుంచి వాగ్నర్ దళాలు మాస్కో దిశగా కదిలాయి. ఈక్రమంలో ఎవరైనా ఆవేశంలో అణ్వాయుధాల ప్రయోగానికి పూనుకుంటారేమో అని అమెరికా నిఘా సంస్థల్లో ఆందోళన మొదలైంది. ఎవరు ఏ వ్యూహం అనుసరిస్తున్నారో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ కూడా మాస్కో లో ఉండకుండా ముందు జాగ్రత్తగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే బెలారస్ నేత జోక్యంతో ఉద్రిక్తత కొంత తగ్గింది. యెవ్జెనీ ప్రిగోజిన్ పై పెట్టిన కేసులు కూడా ఎత్తేసారు.
కాగా ఉక్రెయిన్ పై సైనిక చర్యలో భాగంగా ఇన్నాళ్లు రష్యా బలగాలకు అండగా ఉన్న వాగ్నర్ గ్రూప్ అకస్మాత్తుగా తిరుగుబాటు ప్రకటించడం పుతిన్ ను కలవరపరిచింది. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వాగ్నర్ కిరాయి సైన్యం చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ (Yevgeny Prigozhin) హెచ్చరించినట్లు సమాచారం.
ఉక్రెయిన్‌లో తమ బలగాలకు ఎదురవుతున్న సవాళ్ల విషయంలో రష్యా రక్షణ శాఖ పై బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రిగోజిన్ తిరుగుబాటు నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఆర్ధిక లావాదేవీలే కారణమని అంటున్నప్పటికీ తెర వెనుక అసలు కారణం ఏదో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
వాగ్నర్ గ్రూప్ పుతిన్ ప్రైవేటు సైన్యం.. వాగ్నర్ ప్రైవేటు మిలటరీ కంపెనీ .. ఈ గ్రూపులో మొత్తం కిరాయి సైనికులే ఉంటారు. వీరు రష్యాకు, పుతిన్ కు విదేశాల్లో అవసరమైన లక్ష్యాలను సాధించడానికి రహస్యంగా పనిచేస్తారు.
ఉక్రెయిన్ పై సైనిక చర్య మొదలైన క్రమంలో అక్కడి కీలక ‘బఖమ్ముత్’ నగరాన్ని కైవసం చేసుకోవడంలో వీరే కీలక పాత్రపోషించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని అంతం చేయడానికి వాగ్నర్ దళాలు ప్రయత్నించినప్పటికీ అతగాడు వీరికి చిక్కకుండా తప్పించుకున్నాడని అంటారు.