వ్యధార్త జీవుల యదార్ధ చిత్రం !

Sharing is Caring...

Pudota Showreelu ………………………..

 ”పడమటి కనుమలు” ( మేర్కు తొడర్చిమలై  ) తమిళ సినిమా  ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది పడమటి కనుమలలోని మున్నార్ అడవులు,కొండలపై జరిగిన కత.ఆ పెద్దపెద్ద కొండలకు దిగువన తమిళనాడులోని ఒక చిన్న పల్లెలో కత ప్రారంభమవుతుంది.

ఆ పల్లె నుండి మున్నార్ కొండలపై వుండే ఏలక్కాయ తోటల్లో,ఆ పల్లె ప్రజలు కూలీలుగా పనిచేస్తుంటారు.ఇక్కడ ఎత్తయిన పడమటి కనుమల కొండల, అడవుల సౌందర్యాన్ని సినిమాటోగ్రఫర్ తేని ఈశ్వర్ అద్భుతంగా చూపించారు.ఏలకుల పంట,ఏలకులను తెంచడం, వాటిని బస్తాలలో నింపి కొండలపై నుండి కిందికి దింపటం,ఈ పనులన్నిటిలో రంగస్వామి అనే కూలీ పాత్ర వుంటుంది.

రంగస్వామి పొద్దున్నే పల్లెలో బయలుదేరి,కొండల మీది తోటల్లోకి చేరుకుంటూ,అటు పల్లె కు,ఇటు కొండలమీద వున్న వారికి అవసరమైన పనులు చేసిపెడుతూ మంచి మనిషి అనే పేరు తెచ్చుకుంటాడు. ఏలకుల బస్తాలు మోసుకుంటూ  కిందికి దిగే కూలీలు దారిలో ఒక చెట్టు దగ్గర ఆగి…  వారితో తెచ్చుకున్న ఒక చిన్నరాయిని ఆ చెట్టు కింద వున్న దేవతకు సమర్పిస్తూ వుంటారు.

ఈ విధంగా చేయటం వలన వాళ్ళు అతి భారంగా మోసే ఆ బరువులో నుండి కొంత భాగాన్ని ఆ దేవత తీసుకుంటుందని వాళ్ళ నమ్మకం. ఏలకుల తోటల్లో ఆకు కత్తిరించటం,కాయ కోయటం,ఏలకుల బస్తాలు కిందకు మోయటం ఇవన్నీ నిత్యం అక్కడ పనిచేసే కూలీలే ఈ సినిమాలో నటించినట్లు అనిపిస్తుంది.అంత సహజంగా వుంది ఆ పనిపాట్ల చిత్రీకరణ.

ఒక కూలీ ఆనారోగ్యంతో బరువు మోయలేక,కింద పడ్డపుడు  మిగిలిన కూలీలు అతని బరువుని పంచుకుని మోసే దృశ్యం చూస్తుంటే,ఆ బడుగు జీవుల మద్య వుండే ప్రేమ,ఐకమత్యం,ఆపదలో తోటివారిని ఆడుకోవటం ఇవన్నీఆ పేదవారి సంస్కారాన్ని తెలియ జేస్తాయి.చాకో తల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కొడుకు.కమ్యునిస్ట్ పార్టీలో చేరి ఈ కూలీల కోసం యూనియన్ పెట్టి,వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటాడు.

ముసలి తల్లిదండ్రులకు అతడు పార్టీ పనులు మానుకుని,పెళ్ళి చేసుకుని,కుటుంబ జీవనం గడపాలని కోరిక.కానీ అతడు మాత్రం తిండితిప్పలు మానుకుని ఆ కొండల్లో పడి తిరుగుతూ కూలీల కోసం పనిచేస్తుంటాడు.కొండల మీదికి రోడ్లు వేయటం,మిషనరీ రావటం వలన కూలీలు ఉపాధి కోల్పోతారని  దాన్ని వ్యతిరేకిస్తాడు చాకో. సీనియర్ కామ్రేడ్ బడా కాంట్రాక్టర్ లతో కుమ్ముక్కు అయ్యాడని అతన్ని చంపి జైలు కి వెళతాడు.దీనిలో పాలు పంచుకున్న రంగస్వామి కూడా జైలు కి వెళ్ళి వస్తాడు.

రంగస్వామి,అతని తల్లి,ఆ కొండల్లో ఒక చారడంత అయినా పొలం కొనుక్కోవాలని కష్టపడి కొంత డబ్బు కూడబెట్టి,కొద్దిగా అప్పు చేసి పొలం కొంటారు.రంగస్వామి కి ఈశ్వరి[గాయత్రి]తో  స్థానిక  దేవర ఎదుట పెళ్ళి అవుతుంది.ఈ పెళ్ళిలో పాల్గొన్న కొద్దిమంది బంధువులు వారి  మద్య సరస సల్లాపాలు… విందు చూస్తుంటే అసలు పేదల పెళ్ళి లోనే పెళ్ళి కళ ఉంటుందేమో అనిపిస్తుంది. రంగస్వామి అప్పు చేసి ఏలకు విత్తనాలు కొంటాడు.

కొండల మీదికి ఏలకుల బస్తాని మోసుకుంటూ,కొడుకుని,భార్యని వెంట పెట్టుకుని వెళతాడు.చెట్టు కింద బస్తా దించి వాళ్లకి దూరాన వున్న తమ పొలం చూపిస్తూ ఉంటాడు.ఈ లోగా గాలికి ఏలకుల బస్తా ఆ కొండల మీది నుండి లోయలోకి పడిపోతుంది. ఇక్కడ ఛాయాగ్రాహకుని ప్రతిభ  అపూర్వంగా ఉంది. రంగస్వామి కుటుంబం వేదన,బస్తా లోయలలోకి పడిపోతున్న దృశ్యం  గుండెల్ని పిండేస్తుంది.

చివరకు అప్పులు,అధిక వడ్డీలు రంగస్వామి పొలాన్ని ఆ బడా కాంట్రాక్టర్ కే అమ్మివేసే పరిస్తితులు వస్తాయి. ఈ క్రమంలోనే తన పొలంలో కాంట్రాక్టర్ వేసిన గాలిమరలకు[windmill] కాపలా దారుడు గా చేరతాడు. ఈ స్వతంత్ర భారతంలో ఒక సామాన్య కూలీ చేరడంత భూమికి హక్కుదారుడు కాలేడా అనిపిస్తుంది.కోల్పోతున్న జీవనోపాధి .. పెట్టుబడిదారులు ….అభివృద్ధి అంశాలపై తీసిన సినిమా ఇది.

ఇళయరాజా సంగీతం,ఈశ్వర్ కెమెరా పనితనం సినిమా కు ప్లస్ అయ్యాయి. కమర్షియల్ విలువలకు అతీతంగా విజయసేతుపతి నిర్మించిన ఈ చిత్రానికి  లెనిన్ భారతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎలాంటి గ్లామర్ కానీ,గ్లామరస్ దృశ్యాలు లేవు.ఉన్నగ్లామర్ అంతా పడమటి కనుమల అందానిదే..మున్నార్ కొండల,అడవుల,ఏలకు తోటల సౌందర్యం అంతా తెచ్చి ఈ సినిమాలో రాశి పోశారా అనిపిస్తుంది.

మీకు నచ్చుతుంది.చూడండి.netflix,యు ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది.

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!