Drug mafia …………………………………..
డ్రగ్ మాఫియా దేశాన్ని ఎలా నాశనం చేస్తున్నది. పోలీసులు వాళ్ళతో ఎలా చేతులు కలుపుతున్నారు ?ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అన్న అంశాల ఆధారంగా ఈ సినిమా కథ అల్లుకున్నారు. కథ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. నిడివి తగ్గిస్తే బాగుండేది. లోకేష్ కనకరాజన్ కథను తెరకెక్కించిన విధానం బాగుంది.
కథలో సస్పెన్సు బాగా మైంటైన్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యాక్షన్ డోస్ కొంచెం ఎక్కువైంది. కథలో బోలెడు ట్విస్టులు పెట్టారు. ముసుగు మనుష్యులు ఎవరనేది సస్పెన్స్ లో పెట్టి కథ నడిపారు. కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథలో కమల్, ఫహద్ ఫాజిల్ పాత్రలకే ప్రాధాన్యత దక్కింది.
ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ బాగుంది.ఆ పాత్రలో ఫాజిల్ ఒదిగిపోయాడు. పాత్ర పరంగా భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించాడు. పిల్లవాడి గుండె నొక్కి బతికించే సీన్,పెళ్ళికి లేటుగా వెళ్లి ప్రియురాలికి సంజాయిషీ ఇవ్వలేకపోయిన సీన్ లో ఫాజిల్ నటన ఆకట్టుకుంటుంది.
డ్రగ్ మాఫియా డాన్ గా విజయ్ సేతుపతి ఆకట్టుకుంటాడు. విజయ్ ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులకు నచ్చుతాయి. క్లైమాక్స్ లో కమల్ సేతుపతి మధ్య ఫైట్స్ బాగా తీశారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. ఆ తరహా సినిమాలు చూసేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ముగింపులో రోలెక్స్గా సూర్య ఎంట్రీ అభిమానులను అలరిస్తుంది. సూర్య విభిన్నంగా నటించి అందరిని మెప్పించాడు. తెరపై ఉన్నది కొద్ది క్షణాలే అయినా.. తన సత్తా ఏమిటో చాటాడు. ఇక కథలో ప్రత్యేకంగా హీరోయిన్లు ఎవరూ లేరు. డ్యూయెట్స్ కూడా లేవు.
అనిరుధ్ నేపధ్యసంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. గిరీష్ గంగాధరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. డ్రగ్ మాఫియా నేపధ్యం లో చాలా సినిమాలే వచ్చాయి. ఈ కథను కొంత డిఫరెంట్ గా తీశారు. అగ్రనటులు ఉన్న కారణంగా మూవీ చూసేందుకు ప్రేక్షకులు ముందుకొస్తారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సారి చూడవచ్చు.