‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా !!

Sharing is Caring...

సరదాగా ‘కాసేపు’ మాత్రమే నవ్వించే సినిమా ఇది. 2010 లో విడుదలైన ఈ సినిమా లో డైరెక్టర్ వంశీ మార్క్ పెద్దగా కనిపించదు. పాటలు మాత్రం తనదైన శైలిలో చిత్రీకరించారు. రేలంగి నర్సింహారావు ఇచ్చిన కథలో ట్విస్టులు లేవు. చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథ ఇది. వంశీ తీసిన సినిమాలా అనిపించదు. కథ,కథనం లో లోపాలున్నాయి. ఈ సినిమాలో వంశీ పాటలు కూడా పాడారు.

కథ క్లుప్తంగా …. అమెరికా నుంచి వచ్చిన శ్రీను(అవసరాల శ్రీనివాస్)కి మణిమాల(మధురిమ)తో పెళ్ళిచూపులు. అయితే శ్రీను తానెవరో తెలియకుండా తను కట్టుకోబోయే అమ్మాయి ఇంట్లో ఓ పదిరోజులు ఉండి ఆమెను దగ్గర నుంచి పరిశీలించి పెళ్ళిచేసుకోవాలని కోరిక. ఇందుకోసం తన కారు డ్రైవర్ రంగబాబు(అల్లరి నరేష్) ని పెళ్ళి కొడుకు గెటప్ లో… తానేమో డ్రైవర్ లాగా మారి పెళ్ళిచూపులకు బయలు దేరుతారు.

ఈ విషయం శ్రీను తల్లి తండ్రులు…పెళ్ళి కూతురు కుటుంబానికి తెలియజేస్తారు. అయితే దారి మధ్యలోనే శ్రీను బుద్ధి మారుతుంది. ఒరిజినల్ గానే పెళ్లి చూపులకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. ఈ విషయం తెలియని హీరోయిన్ మణిమాల ఇంట్లో వాళ్ళు అసలు పెళ్ళి కొడుకు శ్రీనుని డ్రైవర్ అనుకుని, డ్రైవర్ ..రంగబాబుని పెళ్ళి కొడుకు అనుకుని రివర్స్ లో ట్రీట్ చేస్తారు.

అక్కడ మణిమాల కూడా పనిమనిషిగా నటిస్తూ డ్రైవర్ రంగబాబుతో ప్రేమలో పడుతుంది. ఒక దశలో ఆమె పెళ్లికూతురని తెలుస్తుంది. ఇలా గందరగోళంగా కథ సాగుతుంది. చివరికి మణిమాల ఎవరిని పెళ్లి చేసుకుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

కథని క్లైమాక్స్ దాకా సాగదీసినట్టు అనిపిస్తుంది. సినిమా రెండో భాగంలో కృష్ణ భగవాన్, ఎమ్మెస్ .నారాయణ మధ్య పెద్ద కామిడీ ట్రాక్ క్రియేట్ చేసి ప్రధాన కథకు లింక్ చేశారు. కృష్ణ భగవాన్ పంచ్ డైలాగులు అక్కడక్కడా పేలాయి. ఎమ్మెస్ కామెడీ సరేసరి. డైలాగుల్లో కామెడీ ని పండించడానికి వంశీ గట్టి ప్రయత్నం చేశారు అనిపిస్తుంది.

పడాల శివ సుబ్రహ్మణ్యం వంశీ మార్క్ సినిమా తరహా డైలాగులు బాగానే రాశారు. సంగీతం ఫర్వాలేదు. చక్రి వంశీ అభిరుచికి సరిపడేలా మ్యూజిక్‌ అందించారు. పాటల చిత్రీకరణలో వంశీ మార్క్ కనిపిస్తుంది. రిచ్ గా తీశారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ నేరేషన్ తో సాగి .. సెకండాఫ్ కామెడీ ట్రాక్ కొంత సరదా గా సాగుతుంది.

ఆహుతిప్రసాద్ .. ఎమ్మెస్,కృష్ణ భగవాన్ తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.అల్లరి నరేష్ ఇక చెప్పనక్కర్లేదు .. అవసరాల శ్రీనివాస్ పాత్ర పరిథి తక్కువే.క్లైమాక్స్ లో నరేష్ బృందం మారువేషాలతో రావడం మరీ చీప్ గా.. ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.హీరోయిన్ మధురిమ మళ్ళీ వేరే సినిమాలో కనిపించిన సమాచారం లేదు.హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వాళ్ళు చూడొచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!