ఆఇద్దరికి సినిమా నిర్మాణం అచ్చిరాలేదా?

Sharing is Caring...

They made movies and burned their hands…… 

గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించిన ఎస్పీ బాలు సినీ నిర్మాణంలో  పెద్ద విజయాలు సాధించలేకపోయారు. ఆయన కుమారుడు చరణ్ కూడా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. తండ్రి కొడుకులకు సినిమా నిర్మాణంలో చేదు అనుభవాలున్నాయి. బాలు మొదటి సారిగా బాల్య స్నేహితులతో కలసి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా  “కెప్టెన్ కృష్ణ ” సినిమా తీశారు. కేఎస్ ఆర్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

శారద,శ్రీప్రియలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1979 లో విడుదల అయింది. బాలు పాడిన ‘కలకాలం ఇదే సాగనీ ‘ సూపర్ హిట్ సాంగ్ ఈ సినిమాలోదే. ఈ సినిమాకు  బాలు నే సంగీతం అందించారు. సినిమా ఆశించిన స్థాయి లో ఆడలేదు అనడం కంటే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని చెప్పుకోవాలి. అప్పట్లోనే బాలు ఏడులక్షల నష్టం భరించారు.  ఆ నష్టం తాలూకు అప్పులు తీర్చుకోవడానికి మూడేళ్లు కష్టపడ్డారు.

ఆ తర్వాత మళ్ళీ అదే మిత్రులతో కలసి “చరిత్ర హీనులు” అనే సినిమా తీశారు. ఇది మరీ దారుణంగా ఆడింది. అప్పులు మరింత పెరిగాయి. ఆ తర్వాత 1985 లో బాలు రామోజీ రావు నిర్మించిన “మయూరి” సినిమాను  తమిళం లో డబ్ చేశారు. “మయూరి”  వల్ల కొంత ఆర్ధిక ఉపశమనం పొందారు. “మయూరి”  నర్తకి సుధాచంద్రన్ నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీశారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

బాలు సంగీతం అందించారు. 1991 లో “ఆదిత్య 369” సినిమా నిర్మాణంలో బాలు పెట్టుబడి పెట్టారు. ఇందులో బాలకృష్ణ హీరో. ఈసినిమాకు కూడా  సింగీతం దర్శకుడు .   “బాక్ టు ఫ్యూచర్ ” అనే ఆంగ్ల చిత్రం  స్పూర్తితో తీసిన సినిమా ఇది. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ సంపాదించింది. అప్పట్లోనే 1కోటి 60 లక్షలు ఖర్చు పెట్టి భారీగా సినిమా తీశారు.

ఇక కమల్ హాసన్ హీరోగా “శుభసంకల్పం”  1995 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తీశారు. ఇందులో ఆమని, కె. విశ్వనాథ్, ప్రియ రామన్ ముఖ్యపాత్రల్లో నటించారు. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలు హిట్ అయ్యాయి.  కోదండపాణి ఫిల్మ్ సర్స్క్యూట్ బ్యానర్  పై నిర్మించిన ఈ సినిమాకు కమల్ సహ నిర్మాత. ‘సీతమ్మ అందాలు’ అనే పాటకు శైలజకు నంది పురస్కారం లభించింది. ఇది బాగానే ఆడింది.

తర్వాత “భామనే సత్య భామనే”  చిత్రం తెలుగులో డబ్ చేశారు. 1996 లో కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో ” అవ్వాయ్ షణ్ముగి”  పేరుతో  తమిళం లో ఈ సినిమా వచ్చింది.  ఇందులో కమల్ హాసన్, మీనా నటించారు. సినిమా బాగా ఆడింది. 2000 సంవత్సరంలో కమల్ నటించిన”తెనాలి సోమన్” తమిళ్ సినిమా డబ్బింగ్ హక్కులను  బాలు తీసుకున్నారు. తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయి 30 కోట్లు కలెక్ట్ చేసిన  ‘తెనాలి’ తెలుగులో కూడా బాగా ఆడింది. బాలు కి బాగానే డబ్బులు వచ్చాయి. బాలు కుమారుడు చరణ్ గాయకుడిగా తెలుగులో అంతగా రాణించలేకపోయారు. బాలు కూడా ప్రమోట్ చేయలేదు.

చరణ్ ఒక దశలో నిర్మాతగా మారాడు . మొత్తం 5 సినిమాలు తమిళంలో తీశారు. ఒకటి రెండు ఒక మాదిరిగా ఆడినా మిగిలిన సినిమాలు ప్రజాదరణ పొందలేదు. మొత్తం 11 కోట్లు నష్టమని బాలు  కొన్ని ఇంటర్వ్యూలలో స్వయంగా చెప్పారు.  మొత్తం మీద చూస్తే బాలు , చరణ్ లకు సినిమా నిర్మాణం అంతగా అచ్చిరాలేదు.

—– KNMURTHY

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!