వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు.
1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో బుర్రకథ పితామహుడు నాజర్ బృందంతో అల్లూరి సీతారామరాజు కథను అంతర్నాటకంగా తీశారు. నాటి నుంచి ఎన్టీఆర్ కి సీతారామరాజు పాత్ర చేయాలనే కోరిక బలపడింది.
ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు కథను నాటకంగా మలిచిన పడాల రామారావును పిలిపించి ఆయనతో చర్చించారు. జూనియర్ సముద్రాలతో కలిసి స్క్రిప్టు వర్క్ కూడా మొదలు బెట్టారు. కళా దర్శకుడు మాధవపెద్ది గోఖలే తీర్చిదిద్దిన కళారూపాన్ని అనుసరించి తొలి మేకప్ స్టిల్ కూడా తీశారు.
1957 జనవరిలో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా తొలి పాటను వాహినీ స్టూడియోలో టి.వి.రాజు సంగీత పర్యవేక్షణలో రికార్డు చేశారు. ఆ పాటను ఘంటసాల, ఎమ్మెస్ రామారావు, మాధవపెద్ది, పిఠాపురంతో కలిసి పన్నెండు మంది గాయకులు ఆలపించారు.
ఇదంతా జరుగుతుండగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలనేది నిర్ణయం కాలేదు. సీతారామరాజు మన్య ప్రాంతంలో చేపట్టిన ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటిస్తారు. అంతటితో సినిమా ముగించాలని రచయితలు సూచించారు. కానీ ఆముగింపు ఎన్టీఆర్ కి నచ్చలేదు. తర్వాత స్క్రిప్ట్ లో మార్పులు కోసం ఆగిపోయారు. ఆ తర్వాత ప్రముఖ రచయిత మహారథి రంగంలోకి దిగారు. ఆయన కూడా అదే తరహా ముగింపుతో ఎన్టీఆర్ కి కథ వినిపించారు. ఆ కథ ఎన్టీఆర్ కి నచ్చలేదు.
అదే కథ ను మహారథి కృష్ణ కు వినిపించారు. ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కథలో మార్పులు చేసి .. డైలాగులు కూడా రాయాలన్నారు. దర్శకుడు వి రామచంద్ర రావు, కొంగర జగ్గయ్య, ఆరుద్ర తదితరులు కూర్చొని కథను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. సీత పాత్రను తీసుకొచ్చిపెట్టారు. మొత్తం మీద కథ ఎలా నడవాలి ? క్లైమాక్స్ సన్నివేశాలు ఎలా ఉండాలో పక్కాగా ప్లాన్ చేశారు.అసలు కథ వేరే ..సినిమా ముగింపు వేరే.
ఆ సినిమాకు స్క్రిప్ట్ రాసినందుకు .. షూటింగ్ జరిగేటప్పుడు అందుబాటులో ఉన్నందుకు మహారథి కి డబుల్ పారితోషకం ఇచ్చారు. మన్య ప్రాంతంలో సినిమా మొత్తం తీశారు. ఈ సినిమా తీస్తుండగానే కొందరు మధ్యవర్తులు కృష్ణను కల్సి ఆ పాత్ర పై ఎన్టీఆర్ ఆసక్తి గా ఉన్నారని సినిమా ఆపండని అడిగి నట్టు కూడా చెబుతారు. కానీ కృష్ణ ఎవరి మాటలు వినబడకుండా సినిమా పూర్తి చేసి విడుదల చేశారు. ఆ సినిమా కృష్ణ ఇమేజ్ ను పెంచిన సంగతి తెలిసిందే.
అలా మొత్తం మీద ఎన్టీఆర్ అనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత రెండు సినిమాల్లో అంతర్నాటకం లో అదే పాత్రను ఎన్టీఆర్ చేశారు. ఎన్టీఆర్ ఒకసారి పరుచూరి బ్రదర్స్ తో చర్చించి ఈ ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకున్నారు. అయితే పరుచూరి సోదరులు కృష్ణ సినిమాను ఒకసారి చూడమని ఎన్టీఆర్‌ను కోరారు.
అన్నగారి కోరిక మీద కృష్ణ తను నిర్మించిన సినిమాను మద్రాసులో స్పెషల్ షో వేశారు. ఆ సినిమా చూశాక ఎన్టీఆర్.. సూపర్ స్టార్ కృష్ణను అభినందించి ‘అల్లూరు సీతారామరాజు’ చిత్రాన్ని చేయాలన్న కోరికను పర్మినెంట్ గా విరమించుకున్నారు.అంతకుముందు వినోద సంస్థ అధినేత డీఎల్ నారాయణ హీరో శోభన్ బాబుతో ‘అల్లూరి సీతారామరాజు’ నిర్మిస్తానని ప్రకటించారు. అది కూడా వర్కవుట్ కాలేదు.
—–KNM