బీదర్ కోటలో ఆ రాత్రి ……………………..

Sharing is Caring...

Sheik Sadiq Ali …………………………………. 

ఇది తొమ్మిదేళ్ల నాటి అనుభవం … బీదర్ కోట చూసేందుకు నేను మిత్రులు వాసిరెడ్డి వేణుగోపాల్ , కె ఎన్. మూర్తి  వెళ్ళాం. ఆనాడు జరిగిన విషయాలను  యధాతధంగా  మీముందు ఉంచుతున్నా. ముందుగా  కోట స్వరూప స్వభావాల గురించి చెప్తాను.ఈ కోట రెండు భాగాలుగా వుంటుంది.ముందు వైపు కొత్త కోట వుంటుంది.దాని వెనుక ఫర్లాంగ్ దూరంలో పాతకోట మొదలవుతుంది.ఈ కోట విస్తీర్ణం చాలా పెద్దది.

కోట లోపలి భాగంలో రకరకాల కట్టడాలు వుంటాయి.కోట గోడను ఆనుకొని లోపలి వైపుకు చుట్టుతా మరికొన్ని భవనాలు వుంటాయి. అయితే ఈ భవనాలన్నీ శిధిలమై ,మొండిగోడలు ,కూలిన శకలాలు చెల్లా చెదురుగా పడివుంటాయి. ఆ దృశ్యం చూస్తే పగలు మాములుగానే వున్నా రాత్రిళ్ళు మాత్రం జుట్టు విరబోసుకున్న దయ్యాలు నిశీధి సంచారానికి సిద్ధమవుతున్నట్లుగా వుంటాయి.

కొత్తకోట పక్కన ఒక చెక్ పోస్ట్ వుంటుంది.అక్కడ సెక్యూరిటీ గార్డులు వుంటారు.ఆ చెక్ పోస్ట్ నుంచి కోట లోపలిగుండా ఒక మట్టి రోడ్డు మెలికలు తిరిగి పడుకున్న కొండ చిలువలా వుంటుంది.ఆ రోడ్డు గుండా దాదాపు మూడు కిలోమీటర్లు పాతకోటలో ప్రయాణం చేస్తే అవతల పక్క ఒక లోతైన కందకం నోరు తెరుచుకున్న అనకొండ లా వుంటుంది. ఆ కందకం అంచునే మరో కిలోమీటర్ ప్రయాణిస్తే ఒక గ్రామం వుంటుంది.

ఆ గ్రామ ప్రజలు బీదర్ రావాలంటే ఆ మార్గం గుండానే రావాలి. సాధారణంగా ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల పైనే ప్రయాణం చేస్తుంటారు. వారి వాహనాలకు తప్ప ఇతరుల వాహనాలకి పాతకోట లోకి అనుమతించరు. పగలు రద్దీ కాస్త ఎక్కువగానే వున్నా,రాత్రిపూట మాత్రం చాలా తక్కువగా వుంటుంది.

ఇకపోతే కోట లోపలి భవనాల సంగతి చూద్దాం.రాజ దర్బార్,నాట్యమందిరం ,రాణీమహల్, చెరసాల.చిత్రహింసల గదులు, మంత్రులు,సైనికుల నివాసాలు వున్న్తాయి.అన్నిటికి మించి ఒక చిత్రమైన దిగుడు బావి వుంది.బావిచుట్టు రాతికట్టడం వుంటుంది.బావిని ఆనుకొని ఒక నలుచదరపు టవర్ లాంటి కట్టడం,దాని గోడమీద 40 అడుగుల ఎత్తువరకు అస్పష్టమైన ఆకారం తెల్లగా కన్పించీ కన్పించనట్టు ముద్రించి వుంటుంది.

మేము చెక్ పోస్ట్ దాటి లోపలికి ప్రవేశించి ,కొన్ని శిధిల భవనాలను చూస్తూ ముందుకు సాగాం.అలా 20 నిమిషాలు ఆ కొండచిలువలాంటి మట్టి రోడ్డు మీద నడుస్తుండగా హటాత్తుగా ఒక పెద్ద పాము మెలికలు తిరుగుతూ మా ముందుకు వచ్చింది.దాన్ని ముందుగా చూసిన వేణు గారు ఒక్కసారి గట్టిగా అరిచి మమ్మల్ని హెచ్చరించారు.కంగారుపడ్డ మేము రోడ్డు మీదనుంచి ఒక్క ఉదుటున పక్కనున్న ఖాళీ ప్రదేశంలోకి దూకాం.

సరిగ్గా అప్పుడే …. …..గాఢ సుషుప్తిలో వున్నపాము ఒక్కసారిగా వెన్నులో కదలాడిన అనుభూతి.మూలాధారం నుంచి బ్రహ్మరంధ్రం దాకా తెలియని ఒక జలదరింపు.దూదికన్నా మెత్తగా,మంచుకన్నా చల్లగా వున్న ఒక ఆకృతి ఒళ్ళంతా తడిమిన ఫీలింగ్,అప్పుడే దూరంగా మోర పైకెత్తి అరిచిన కుక్క తెలియని ప్రమాదం ముంచుకొస్తుందని హెచ్చరించింది,కొంచెం దూరంలో ఆ చీకటిలో ఆ తుప్పల పక్కన ఒక ఆకారం,మెల్లగా కదిలింది.

పరీక్షగా చూస్తే….ఎవరో ఒక స్త్రీ, కాళ్ళు రెండు చాచి కూర్చొని వుంది.తెల్లచీర కాదు ,ముతకరంగు చీర కట్టుకొని వుంది,రెండు చేతులకు నిండా గాజులు,మసక వెన్నెల్లో మెరుస్తున్నాయి,కళ్ళు చిత్రంగా చింతనిప్పుల్లా వున్నాయి,జుట్టు ముడివీడిపోయి దట్టమైన వెంట్రుకలు రెండు వైపులా పాయల్లా వేలాడుతున్నాయి.

మా అందరిలోకి పెద్దవాడు,ధైర్యవంతుడు అయిన  మూర్తి కొంచెం ధైర్యం చేసి,ఎవరు?ఎవరది? అని అరిచారు.అటువైపునుంచి ఎలాంటి సమాధానం రాలేదు.పైగా ఆ ఆకారం కొంచెం కదిలి గాల్లో ఎగిరి మావైపు వచ్చినట్లు అన్పించింది .ఎందుకొచ్చిన గొడవరా బాబు అనుకొని మెల్లగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అటు వైపు తిరిగికూడా చూడకుండా వడివడిగా అడుగులేస్తూ కోట అంతర్భాగం లోకి వెళ్లాం. లోపలికి వెళ్తున్న కొద్దీ మమ్మల్ని ఎవరో అనుసరిస్తున్న భావన,కొన్ని అదృశ్య శక్తులు మా వెనుకే నడుస్తున్న శబ్దం.

వెనక్కి తిరిగిచూస్తే ఎవరూ లేరు. ఆకాశంలో దశమి చంద్రుడి వెన్నెల హటాత్తుగా మాయమైంది,చిమ్మచీకటి ఆవరించింది. తల పైకేత్తిచూస్తే నల్లటి మేఘాలు చంద్రుడిని కమ్మేసి వున్నాయి. ఒక్కసారిగా నీరవ నిశ్శబ్దం ,ఏ విధమైన శబ్దము లేదు,ఇంతలో గుసగుసగా ఎవరో పిలిచినట్లు,అదీ ఉర్దూలో మాట్లాడినట్లు విన్పించింది. గుండె కవాటాల్లోంచి గుప్పెడు రక్తం చిమ్మినట్లు అన్పించింది. వొళ్ళు జలదరిస్తున్నా ,శ్వాస ఆగిపోతున్నట్లు అన్పించినా ఆ శబ్దాన్ని జాగ్రత్తగా విన్నాం, ఆజా…..ఇదర్ ఆజా ….కుచ్ బోల్నా హై,కుచ్ దిఖానా హై అని స్త్రీ స్వరం అంటోంది.

చుట్టూ చూస్తే ఎవరూ కన్పించలేదు .ఇక లాభం లేదనుకొని భయంభయం గానే వెనక్కి తిరిగాం.సరిగ్గా తొలిసారి ఆ ఆకారాన్ని ఎక్కడైతే చూసామో ,ఆ స్పాట్ కి వచ్చేసరికి ,ఆ ఆకారం రోడ్డుకు అడ్డంగా కూర్చొని వుంది. గాఢమైన చీకటి కారణంగా ఆకారం స్పష్టంగా కన్పించడం లేదు ,పోలికలు తెలియడం లేదు.మేము చూస్తుండగానే మెల్లిగా కదిలి రోడ్డుకు పది అడుగుల దూరంలో వెళ్లి కూర్చుంది.ఇంతలో దూరంగా బీదర్ నుంచి పల్లెకు వెళ్తున్న ఒక బైక్ కన్పించిది..

కొంచెం ధైర్యం వచ్చింది.మేము చెయ్యి అడ్డం పెట్టి ఆ బండిని ఆపాం.విషయం వివరించి చెప్పాం.లైట్ అటువైపు ఫోకస్ చెయ్యమని అడిగాం. వాళ్ళు ఆ ఆకారాన్ని చూసారు ,గట్టిగా కన్నడలో పిలిచారు,ఆకారం పలకలేదు.వెంటనే వాళ్ళు ఆ వైపు లైట్ ఫోకస్ చేశారు.సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది.ఫోకస్ పడుతుండగానే ఆకారం అదృశ్యం అయ్యింది.మాతోపాటే వాళ్ళు షాక్ కు గురయ్యారు.లైట్ ఎటు ఫోకస్ చేసినా ఎవరూ కన్పించలేదు.దాంతో వాళ్ళు లైట్ ఆపేశారు.వెంటనే మళ్ళీ ఆకారం ప్రత్యక్షమైంది.

మా వైపుకు రావటం మొదలెట్టింది.వాళ్ళు వెంటనే లైట్ ఆన్ చేశారు.చిత్రంగా ఆకారం మళ్ళీ మాయమైంది.అలా రెండు మూడు సార్లు జరిగింది.చివరికి అది దాదాపు మాకు ఒక అడుగు దగ్గరికి వచ్చింది.ఎర్రటి ఆ కళ్ళలో ఎదో విషాదం,తెలియని కసి కన్పించాయి.భయంతో ఒక్కసారిగా మళ్ళి లైట్ వేశాం. ఆకారం అదృశ్యమైంది.

బైక్ వాళ్లకు,మాకు విషయం అర్ధమైంది.ఇక లాభం లేదనుకున్నాం,అప్పటికే అంత చలిలోనూ చెమటతో మా బట్టలు తడిసాయి.వాళ్ళను బతిమాలుకున్నాం.వాళ్ళు లైట్ ఆన్ చేసి బండి నడిపించుకుంటూ మాతోపాటు సెక్యూరిటీ పోస్ట్ వరకూ వచ్చారు.మళ్ళీ ఆ ఆకారం కన్పించలేదు కానీ వెనుకనుంచి పిలుపు మాత్రం గుసగుసగా విన్పిస్త్తోనే ఉండింది.

ఎలాగోలా బతుకు జీవుడా అని బయటపడ్డాం. జరిగినదంతా అక్కడున్న వాళ్లకు చెప్పాము. అంతా విని వాళ్ళు ఇది తమకేమి కొత్తకాదనీ,గతం లోను కొందరికి అలా జరిగిందని చెప్పారు,కానీ ఆ దయ్యాలు ఎవరికీ ఏ హానీ చెయ్యలేదని చెప్పారు.దయ్యంతో మా ముఖాముఖి అలా జరిగింది.మీకూ ఆ అనుభవం కావాలంటే బీదర్ వెళ్ళండి.చీకటి పడ్డాక పాతకోట లోకి ప్రవేశించండి.ఇక అంతా జింతాత జితాజితా జిన్తాతతా …. (అయిపొయింది.,,శీఘ్రమేవ దయ్యం దర్శన ప్రాప్తిరస్తు.)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!