Taadi Prakash……………….……………
The Story of an Extraordinary Editor………………………………….
అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ అంటే ఆయన ఎవరో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ABK అంటే మాత్రం తెలుగు వార్తాపత్రికలు చదివే లక్షలాదిమంది తేలిగ్గా గుర్తుపడతారు. వార్తలు, విశ్లేషణలు, వ్యాసాలు, సంపాదకీయాలు… నాన్ స్టాప్ గా రాస్తూనే వున్నారు ABK గత 66 సంవత్సరాలుగా! రాస్తూ వుండటంలోనే ఆయనకు విశ్రాంతి.. సంతృప్తి.. అదే ఆనందం! తెలుగులో మరొక జర్నలిస్టెవరూ ఇన్నేళ్లు రాయలేదు.
ఎబికె అన్ని పుస్తకాలు కూడా పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు 87 ఏళ్ల వయసులో కూడా ఎబికె నెలకి రెండో, మూడో వ్యాసాలు రాస్తూనే వున్నారు. 30-40 ఏళ్ళ క్రితం ఆయన ఎంత అర్థవంతంగా, శక్తిమంతంగా రాశారో ఇప్పుడూ అంతే ఫోర్స్ తో, అంతే తెగువతో, అదే నైపుణ్యంతో, అందమైన వాక్యాల పొందికతో రాయగలుగుతున్నారు.
ఉత్తమ జర్నలిస్టుగా ఉత్తమ సంపాదకుడిగా ఇప్పటికే ఆయనకి ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ మధ్యనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎబికె కి రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది . 2023 ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఆ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకుంటున్న సందర్భంగా ఓసారి ఎబికె అనే అక్షర రాక్షసుడిని తలుచుకోవడం కోసమే ఈ నాలుగు మాటలు!
‘సాక్షి’ కార్టూనిస్టు, కేరికేచరిస్టు పామర్తి శంకర్ కూడా ఈ రోజున ఇదే అవార్డు అందుకుంటున్నారు. ‘Excellence in Journalism’ కి ఎబికె ఈ అవార్డు గెలుచుకున్నారు. ఎబికె సొంత ఊరు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాలోని ఉప్పులూరు. 1935 ఆగస్టు ఒకటో తేదీన ఆయన ఉయ్యూరులో పుట్టారు. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న జన్మించారు చెరుకూరి రామోజీరావు.
ఎబికె కంటే ఒక్క సంవత్సరం చిన్న. భవిష్యత్ లో ఎపుడో 40 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరే తెలుగు జర్నలిజం చరిత్రని తిరగరాస్తారని ఆనాడు వాళ్లకీ, మనకీ, ఎవరికీ తెలీదు. అటు ప్రతి చిన్న వ్యాపార అవకాశాన్నీ నోట్ల కట్టలుగా మార్చే క్షుద్రవిద్యలో ఆరితేరి, ప్రమాదకరమైన పెట్టుబడిదారునిగా ఎదిగిన శక్తిసంపన్నుడు రామోజీరావు.
ఇటు – పగలూ రాత్రీ సాహిత్యమూ, కవిత్వమూ చదివి, ఈ దేశ ప్రజల కోసం ఏ త్యాగం చేయడానికైనా వెనకాడని కమ్యూనిస్టు ఆదర్శంతో ఎబికె ప్రసాద్. వీళ్ళిద్దరూ కలిసి 1974లో విశాఖపట్నంలో ‘ఈనాడు’ అనే చిన్న బ్లాక్ అండ్ వైట్ దినపత్రిక ప్రారంభించారు. అప్పుడు దాని సర్కులేషన్ మూడు వేలు. ఎబికె అక్కడ రెండేళ్లు మాత్రమే పని చేయగలిగారు.
ఒక హృదయం లేని వ్యాపారస్తుడూ, ఈ దేశ విముక్తి కోసం విప్లవమే మార్గమని నమ్మిన మరో స్వాప్నికుడూ కలిసి పనిచేస్తే ఏం జరుగుతుందో అక్కడ అదే జరిగింది. ఎబికె – రామోజీరావు… వాళ్ళిద్దరిలో నంబర్ టూ గా ఉండడానికి ఏ ఒక్కరి DNA ఒప్పుకోకపోవడమే వాళ్లు విడిపోడానికి కారణం కావచ్చు. రామోజీ – ఎబికె – A Study in Contrast అని సమర్థంగా, కన్విన్సింగా రాయగలిగే వాళ్ళు ఇద్దరున్నారు. ఒకరు – హరిపురుషోత్తమరావు గారు, రెండోవారు జంపాల ఉమామహేశ్వరరావు గారు (సహవాసి). నాకు బాగా తెలిసిన వాళ్ళిద్దరూ ఇపుడు లేకపోవడం ఒక పెద్ద విషాదం!
ఉదయం – ఒక పునరుజ్జీవనం!
ఒకనాడు బాధ్యతాయుతమైన దినపత్రికలుగా, ప్రజల పక్షాన నిలిచి పోరాడిన గొప్ప సంస్థలుగా పేరొందిన విశాలాంధ్ర, ఆంధ్రపత్రిక, జ్యోతి, ప్రభ సంప్రదాయ జర్నలిజం చూరుపట్టుకు వేలాడుతున్న సమయంలో కళ్ళు మిరుమిట్లుగొలిపే కొత్త కాంతితో దూసుకొచ్చింది ‘ఈనాడు’! అక్కడ రెండేళ్లు మాత్రమే వుండగలిగిన ఎబికె హైదరాబాదులో ఆంధ్రప్రభ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు.
ఈనాడు దెబ్బకి ప్రభ సర్కులేషన్ తగ్గి, బాగా నీరసించి వుంది. పాత దుమ్మంతా దులిపి ప్రభని నంబర్ వన్ చేయడం ఎవరి వల్లా అయ్యేపని కాదు. సరిగ్గా అప్పుడే దినపత్రిక పెట్టాలని వువ్విళ్ళూరుతున్న దాసరి నారాయణరావు కి కలిసివచ్చిన కాలానికి నడిచివచ్చిన జర్నలిస్టుగా ఎబికె దొరికారు.దర్శకుడిగా దాసరికి జనంలో వున్న క్రేజు, సంపాదకునిగా ఎబికె కి వున్న ప్రతిష్టతో ‘ఉదయం’ రావడానికి ముందే గొప్ప ఇమేజి సంపాదించుకుంది.
అటు ఎన్టీరామారావుని ముఖ్యమంత్రిని చేయాలన్న తాపత్రయంతో ‘ఈనాడు’ తెలుగుదేశం పార్టీ ప్రచార కరపత్రంగా మారింది. అప్పటిదాకా జర్నలిజం – విలువలు, ప్రజలూ, ప్రజాస్వామ్యం, ఔన్నత్యం అంటూ సంపాదకీయాలు రాసి సొల్లుకబుర్లు చెప్పిన ‘ఈనాడు’ హఠాత్తుగా ఒక రాజకీయ పార్టీకి ప్రాపగాండా మౌత్ పీస్ గా మారిపోయింది.
తెలుగుదేశానికే వోటేయండి – అవినీతి కాంగ్రెస్ ని వోడించండి అంటూ పన్నెండు పేజీలనూ ఎన్టీఆర్ పాదాల కింద పరిచింది ‘ఈనాడు’. వ్యాపారమూ, కులమూ, రాజకీయాలూ అనే రుచికరమైన పిడత కింద పప్పులో ప్రజాస్వామ్య పరిరక్షణ అనే నిమ్మరసం పిండి, ‘ఈనాడు’లో చుట్టి రాష్ట్రమంతా పంచాడు రామోజీరావు. అయినా రామోజీరావు విజయానందం ఆట్టే నిలవలేదు. రామోజీ ముందు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతులుకట్టుకు నించోలేదు. పైగా, ‘పోరా కుయ్యాం’ అన్నట్టే బిహేవ్ చేశారు.
1983… పులిమీద పుట్రలాగా ‘ఉదయం’ సమాయత్తం అవుతున్న కాలం అది. అటు దాసరి నారాయణరావు, కొండపల్లి రామకృష్ణ ప్రసాద్, ఎబికె ప్రసాద్, ఇటు రచయిత కే ఎన్ వై పతంజలి, ఆర్టిస్ట్ మోహన్, కవి దేవీప్రియ కలిసి నడుస్తున్నారు. ఒక సుపీరియర్ టెక్నాలజీతో రంగంలోకి దిగుదాం అని ఎబికె సూచించారు. తొలిసారి తెలుగు వార్త కంప్యూటర్ మీద కంపోజ్ అయింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వాసుదేవరావు సహాయంతో పెద్దఎత్తున రిక్రూట్మెంట్ మొదలుపెట్టారు ఎబికె.
నేను తిరుపతి ‘ఈనాడు’ని వదిలి, వచ్చి ఈ ముఠాలో చేరిపోయాను. హైదరాబాద్, విజయవాడ రెండు ఎడిషన్లతో ‘ఉదయం’ ప్రారంభించాలి. రాష్ట్రమంతా రిపోర్టర్లు, సీనియర్ కరస్పాండెంట్లు, న్యూస్ పేపర్ ఏజెంట్ల నియామకం ఒక ఉత్సవంలా జరిగింది. అందరం ఎబికె వైపే చూస్తున్నాం. తెల్లటి లాల్చీ పైజామాతో, కళ్ళజోడుతో, అందమైన నవ్వుతో ఒక ఇంటలెక్చువల్ లుక్ తో మిలమిలా మెరుస్తూ ‘ఉదయం’ కాంపౌండ్ లో ఎబికె కారు దిగుతుంటే.. అచ్చంగా అమితాబ్ బచ్చన్ వచ్చినట్టే!
అందరం ఆయన చుట్టూ చేరేవాళ్ళం. ఏం చేయాలి? పేపర్ ఎంత బాగా తేవాలి? జనాన్ని ఆకర్షించే కొత్త శీర్షికలు ఏముండాలి? వీటిపైనే ఎబికె దృష్టి. ఎవరితోనైనా ఈజీగా, హాయిగా స్నేహపూర్వకంగా మాట్లాడడం ఎబికె పద్ధతి. పాత కమ్యూనిస్టులకుండే అలవాటే అది. ఎబికె ఏం మాట్లాడినా ఎంతో సౌమ్యంగా, కన్విన్సింగా, కన్స్ట్రక్టివ్ గా వుండేది. మా అభిప్రాయం అడిగేవాడు.
మేము ఏం మాట్లాడినా శ్రద్ధగా వినేవాడు. సాయుధ పోరాటమే మార్గమని నమ్మినా, వ్యక్తిగతంగా ఆయన లిబరల్ డెమొక్రాట్. కొత్త ఐడియా ఎవరు యిచ్చినా భుజంతట్టి మెచ్చుకునేవాడు. అప్పుడే జాయిన్ అయిన చిన్న సబెడిటర్ తో అయినా, పతంజలి గారితో అయినా ఆయన ఒకేలా మాట్లాడేవాడు. ‘ఏరా అబ్బాయ్’ అంటూ మమ్మల్ని ఆప్యాయంగా పిలిచేవారు.
ABKs greatest contribution కొత్తతరం జర్నలిస్టులు! యువరక్తం ఉరకలెత్తే ప్రతిభాసంపన్నులైన నవతరం జర్నలిస్టుల్ని ఎబికె రిక్రూట్ చేశారు. మెరికల్లాంటి కుర్రాళ్ళు. రచయితలు. కవులు. “అర్బన్ నక్సలైట్లు”!
తెలుగు జర్నలిజానికో గట్టి కమ్యూనిస్టు సంప్రదాయం వుంది. మద్దుకూరి చంద్రం, వేములపల్లి శ్రీకృష్ణ, ఏటుకూరి బలరామ్మూర్తి నుంచి రాఘవాచారి దాకా అనేకమంది జర్నలిస్టుల్ని ఉత్పత్తి చేసిన కార్ఖానా ‘విశాలాంధ్ర’.
ఎబికె, మోహన్, నేను కూడా ఆ కుదురు నుంచి వచ్చినవాళ్ళమే! 1975-76లో ‘ఈనాడు’లో చేరిన రాంభట్ల కృష్ణమూర్తి, గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, మోటూరి వెంకటేశ్వరరావు, బూదరాజు రాధాకృష్ణ… అందరూ సిపిఐ వాళ్లే. పీపుల్స్ వార్ మాత్రమే విముక్తి మార్గం అని నమ్మిన ఎబికె, జర్నలిజంలో విప్లవకారుల్ని ప్రవేశపెట్టారు. నక్సలైట్ ఉద్యమానికి సానుభూతిపరులైన కొమ్మినేని వాసుదేవరావు, దేవీప్రియ ఎబికెతో వున్నారు.
సృజన, అరుణతార వంటి సాహిత్య పత్రికల్లో వ్యాసాలు, కవితలు రాసేవాళ్ళు ‘ఉదయం’లో ట్రైనీ సబ్ ఎడిటర్లుగా, రిపోర్టర్లుగా చేరారు. గుడిహాళం రఘునాథం, ఎన్. వేణుగోపాల్, కె . శ్రీనివాస్, మెరుగుమాల నాంచారయ్య, ఎం అయోధ్యారెడ్డి, సి వి ఎస్. రమణారావు, ప్రతాప్ రాంప్రసాద్, బాలగోపాల్ చెల్లెలు మృణాళిని, కే ఎన్ చారి, పాశం యాదగిరి, దేవులపల్లి అమర్, అంజన్ బాబు, ఇంకా అనేకమంది “అర్బన్ నక్సలైట్లు” ‘ఉదయం’ జర్నలిస్టులుగా కొత్త జీవితాలు ప్రారంభించారు.
దాదాపు 70మంది యువకుల ట్రెయినింగ్ బాధ్యత నాకు అప్పజెప్పారు వాసుదేవరావు గారు. కొత్త మెషినరీ సెలక్షన్ నుంచి ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ బ్యూరోలకి రిపోర్టర్ల రిక్రూట్మెంట్ దాకా ఎబికె బిజీబిజీగా వుండటం వల్ల పతంజలినీ, నన్నూ అమితంగా ఇష్టపడే కొమ్మినేని వాసు గారు నాకు ఆ పెద్ద పని యిచ్చారు. ‘ఈనాడు’ అనే స్వర్ణ దేవాలయమ్మీద దాడి చేయడానికి సన్నద్ధమవుతున్న సిక్కు టెర్రరిస్టుల్లా మేమంతా బోరవిరుచుకుని ‘ఉదయం’ కాంపౌండ్ లో టీలు తాగుతూ, సిగిరెట్లు కాలుస్తూ, జోకులేసుకుంటూ తిరిగేవాళ్లం!
తర్వాతరోజుల్లో సంపాదకునిగా ఓ వెలుగు వెలిగిన కే రామచంద్రమూర్తిని ‘ఉదయం’లో ప్రవేశపెట్టింది ఎబికె గారే! అయితే రామచంద్రమూర్తి అర్బన్ నక్సలైట్ కాదు. ఆయన్ని సరదాగా సబర్బన్ లెఫ్టిస్ట్ అనుకోవచ్చు. తిరుపతిలో స్నేహితుడైన నామిని సుబ్రమణ్యం నాయుణ్ణి, రచయిత దాట్ల నారాయణమూర్తిని పతంజలి తీసుకొచ్చారు. తుమ్మలపల్లి రఘురాములు, టీఎన్వీ రమణమూర్తి, మరొకరిద్దరు సిపిఐ కార్యకర్తల్ని మోహన్ ప్రవేశపెట్టాడు.
తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వేమన వసంతలక్ష్మి వచ్చి చేరారు. నిమ్మకాయల శ్రీ రంగనాథ్, భోగాది వెంకటరాయుడు, యుగంధర్ అనే చురుకైన రిపోర్టర్లూ మాతో కలిశారు. వీళ్లందరితో ఆరోజుల్లో ‘ఉదయం’ కార్యాలయం విప్లవ రచయితల సంఘం ఆఫీసులా వుండేది. వర్థెల్లి మురళి, యార్లగడ్డ రాఘవేంద్రరావు రానే వచ్చారు. ఇలా ఎంతమంది వచ్చి చేరినా గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న మా అందరినీ కలిపి వుంచిన అక్షరం పేరు ఎబికె ప్రసాద్. మా అందరికీ ఆదర్శంగా నిలిచి వెలిగినవాడు ఎబికె ప్రసాద్.
ఎబికె మాకు ఏం ఇచ్చాడు? వెరీ సింపుల్…. స్వేచ్ఛ. హద్దులు లేని, ఆంక్షలు లేని, నిఘా లేని స్వేచ్ఛ.
నిర్భయంగా వార్తలు రాయడానికీ, దురుసుగా శీర్షికలు పెట్టడానికీ, పరిశోధనాత్మక సంచలన కథనాలు ఫస్ట్ పేజీలో flash చేయడానికీ యిచ్చిన అపురూపమైన, అరుదైన స్వేచ్ఛ అది. అదేంటీ జర్నలిస్టులకు ఆమాత్రం స్వేచ్ఛ వుండదా? ‘ఈనాడు’లో పనిచేసిన వాళ్లకే అది తెలుస్తుంది, ‘ఈనాడు’లో ఒక డేగ నీడ లాంటి నిఘా, కటకటాలు కనిపించని నిర్బంధం, అప్రకటిత ఎమర్జెన్సీ మా వెన్నంటి వుండేవి!
స్వేచ్ఛ విలువ తెలిసిన సంపాదకుడు ఎబికె…
ఎబికె సంపాదకీయాలతో, పతంజలి, నామిని కాలమ్స్ తో, మోహన్ కార్టూన్లు, ఇలస్ట్రేషన్లతో, దేవీప్రియ రన్నింగ్ కామెంట్రీతో, అద్భుతమైన క్వాలిటీ ప్రింటింగ్ తో తొలిరోజు నుంచే తుఫానై వీచింది ‘ఉదయం’! బిజీ దర్శకుడైన దాసరి నారాయణరావు ఈరోజు కలకత్తాలో వుంటే, రేపు కాశ్మీర్లో వుండేవాడు. కనక మొత్తం బాధ్యతా అంతా ఎబికె గారిదే.
రోజుకి పన్నెండు గంటలు, 16 గంటలు ఎబికె గారు నాన్ స్టాప్ గా పనిచేయడం నేను చూశాను. చాలసార్లు మధ్యాహ్నం లేటుగా రెండు వడలూ, ఒక కమలాపండు తిని, రాసుకుంటూ, ఫోన్లు మాట్లాడుతూ, సూచనలు యిస్తూ పూర్తిగా పనిలో నిమగ్నమై వుండేవారు. ఆయన కమిట్మెంట్ డెడికేషన్ మమ్మల్ని inspire చేశాయి .
ఢిల్లీలో ఈరోజు ప్రతిష్టాత్మకమైన రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు అందుకోబోతున్న సంచలన సంపాదకుడు ఎబికె గారికీ, ఆర్టిస్ట్ శంకర్ గారికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.