Bharadwaja Rangavajhala ……………………….
ఓ టైమ్ లో తెలుగు సినిమా కుటుంబాల మీద దృష్టి సారించింది. ఉమ్మడి కుటుంబం అని అన్నగారు సినిమా తీస్తే … దానికి పూర్తి విరుద్దమైన అభిప్రాయాలతో ఆదర్శ కుటుంబం అని ప్రత్యగాత్మ తీశారు.
ప్రత్యగాత్మ కమ్యూనిస్ట్ కదా .. ఆయన ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడడం ఫ్యూడల్ ఆలోచనా విధానంగా భావించి చాలా సీరియస్ గా వేరింటి కాపురాలే బెటరు అంటూ .. ఎప్పుడేనా ఓ కామన్ సెలవు రోజున అలా వచ్చేసి అందరూ కల్సి ఉండి .. రేత్రికి తుండూ తుపాకీ సర్దుకుని పోవచ్చనేది కాన్సెప్టు.
ఇక కె.ఎస్ ప్రకాశరావు విచిత్ర కుటుంబం అంటూ కొన్ని విన్యాసాలు చేశారు. ఇంకా ఆ కుటుంబం ఈ కుటుంబం ఇలా చాలానే కుటుంబాలొచ్చాయి… ఏ కుటుంబం వచ్చినా ఉమ్మడి కుటుంబానికే మనోళ్లు ఓటేశారు.
ప్రభాకరరెడ్డిగారు పండంటి కాపురం సినిమా ప్రారంభిస్తూ కృష్ణను భాగస్వామిగా కలవమన్నప్పుడు ఆయన ఎన్టీఆర్ సలహా అడిగారు. ఎన్టీఆర్ లైన్ విని ఉమ్మడి కుటుంబ ఔన్నత్యాన్ని చెప్పే కథలు మనోళ్లు ఎప్పుడు తీసినా చూస్తారు … అని చెప్తూ ఓ అద్భుమైన మాట అన్నారుట..ప్రభాకర రెడ్డి గారు రాసి పుణ్యం కట్టుకున్నారు కనుక మనకి తెల్సింది.
ఒకటి బ్రదర్ మన జీవితాల్లో ఉన్న డొల్లతనం సిన్మాగా చూపిస్తే బాధ వేస్తుంది… మనం అలా బతక్కపోయినా బతకాలి అనే కోరిక లోపల ఉంటుంది..వాళ్ళు బతకాల అనుకుని బతకలేక పోతున్న బతుకు సిన్మాలో చూపిస్తే మళ్ళీ మళ్ళీ చూసి గొప్ప విలువలు ప్రతిపాదించారు మీరు అని పొగుడుతారు.
ఇది ప్రజల వీక్నెస్ అనుకో ఏమైనా అనుకో… జనం ఉమ్మడి కుటుంబ కథలు చూస్తారు…
అది పాడి ఆవు లాంటి సబ్జెక్ట్… అయితే డొల్ల తనం చూపించడం కళాకారులుగా మన బాధ్యత… అందుకే మేం తోడు దొంగలు లాంటి సిన్మా తీసాం… బాధ్యతగా తీసిన ఆ సిన్మా జనం చూడలేదు…అది పక్కన పెడితే…. ఈ పండంటి కాపురానికి డబ్బులు పెట్టు ఏం పర్లేదని… సలహా చెప్పడంతో కృష్ణ దిగాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
అందుకే ఆ సినిమా శతదినోత్సవానికి ఎన్టీఆర్ నే ఛీఫ్ గెస్ట్ గా పిల్చారు. ఆ తర్వాత కూడా విజయ బాపినీడు కూడా బొమ్మరిల్లు నుంచీ గ్యాంగ్ లీడర్ వరకు ఉమ్మడి కుటుంబాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ విజయాలు అందుకుంటూ కొనసాగారు.
నాకు అర్ధం కానిదేమంటే ….. వేరింటి కాపురాలు అరవై ఐదు నాటికే ఊపందుకున్నప్పటికిన్నీ మనోళ్లు ఎందుకు ఇప్పటికీ ఉమ్మడి కుటుంబకథలకు జై కొడతారు అని …అంటే డ్యూయల్ కారక్టరనేగా అర్ధం …
అంచేత ప్రేక్షకులు పరమ అని అర్దమైంది కదా …ఎన్టీఆర్ ఆరోజుల్లో రెడ్డిగారికి కృష్ణ గారికి చెప్పింది కూడా ఇదే…అదీ సంగతి …