Power of Giripradakshina ………………………
పొర్ణమి రోజు చంద్రుడు అద్భుత మైన తేజస్సుతో ప్రకాశిస్తాడు. పదహారు కళలతో ప్రకాశించడం వల్ల చంద్రుడిని పూర్ణ చంద్రుడు అంటారు.ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పౌర్ణమి రోజుల్లో రాత్రి వేళల్లో అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి ఫలితాలు చేకూరుతాయంటారు. పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన శరత్ పూర్ణిమ రోజున లేదంటే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయని అంటారు.
కాబట్టి ఆ వెన్నెలలో అరుణాచలం లో గిరిప్రదక్షిణ అద్భుతంగా ఉంటుంది. శివ నామ స్మరణ చేస్తూ పౌర్ణమి వేళ కొండ చుట్టు ప్రదక్షిణ చేయడం అరుదైన,అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇందువల్ల పాప పరిహారం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక గిరి ప్రదక్షిణతో కొత్త జీవితం మొదలైనట్టు చెబుతుంటారు.
ఈ ప్రదక్షిణ మొత్తం 7 కి.మీ ఉంటుంది. కాళ్లకు చెప్పులు లేకుండా నడవాలి. ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వారు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణ చేయాలని రమణ మహర్షులు అంటారు. 43 కోణాలున్న శ్రీచక్రాకారం ఉన్నది కాబట్టి అరుణాచలాన్ని సుదర్శన గిరి అని కూడా అంటారు. ఈ కొండ చుట్టూ తపోవనాలు ,అనేక దివ్య ఔషధ వృక్షాలు ఉన్నాయి. వెన్నెల వేళలో ఈ వనాలు , వృక్షాల మీదుగా వీచే గాలులు గిరి ప్రదక్షిణ చేసేవారికి శారీరిక ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాయని చెబుతారు. అది మనకు తెలీకుండానే జరుగుతుందని… శరీరం తేలిక అవుతుందని అంటారు.
గిరి ప్రదక్షిణ రమణాశ్రమం నుంచి మొదలెట్టి పాళీ తీర్ధం, గణేశ ఆలయం, అగస్త్య తీర్ధం, ద్రౌపది గుడి, స్కందాలయం, యమలింగ, సిద్ధాశ్రమం, శోణ తీర్ధం, నైరుతి లింగ,హనుమాన్ గుడి, ఉణ్ణామలై తీర్ధం,రామలింగేశ్వరాలయం, రాఘవేంద్ర మఠం, ప్రతిధ్వని మండపం, గోశాల, రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్య లింగం, వరుణ లింగం, ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం,అక్షర మండపం, ఈశాన్య లింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం, గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శోద్రిస్వామి ఆశ్రమం, దక్షిణామూర్తి ఆలయం వరకు చేయాలి.
అరుణాచలం ఎందరో సిద్ధ పురుషులకు ఆలవాలం. దేవతలు కూడా ఎప్పుడూ ప్రదక్షిణ చేస్తుంటారు. పర్వతం మొత్తం శివ స్వరూపం కాబట్టి శివుడి ఛుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అవుతుంది. పౌర్ణమి రోజుల్లో ప్రదక్షిణ చేస్తే మంచిదని అంటారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఆరోజుల్లో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. కొందరు దీన్నినమ్మి ఆచరిస్తుంటారు. మరికొందరు వేలం వెర్రి అనుకుంటారు. అయితే ఎవరి నమ్మకం వారిది.
—– KNM