Bharadwaja Rangavajhala ………………………………..
గొడవ పడడం వేరు ప్రేమించడం వేరు … గొడవ పడుతూనే ప్రేమించడం ప్రేమిస్తూనే గొడవ పడడం కాస్త కన్ఫూజనుగా అనిపించినా అలా జరిగిన అనేక ఘటనలు మనకు మన చుట్టుపక్కలే కనిపిస్తాయి.అన్నట్టు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తెల్సు కదా .
ఆదుర్తి అంటే హాయిగా నవ్వడం. నవ్వించడం…నవ్వుకోవడం…వెక్కిరించడం….ఆదుర్తి అంటే వయసొచ్చిన బాల్యం. ఆదుర్తితో పనిచేయడం వండర్ ఫుల్ గ్లోరియస్ ఎక్స్ పీరియన్స్. ఈ మాటలన్నది ఎవరో కాదు…ఆదుర్తి సినిమాలకు నేను పనిచేయను అని తెగేసి చెప్పిన ముళ్లపూడి వెంకటరమణ.
ఆదుర్తి సినిమాలకు నో అనడమే కాదు…అసలు సినిమాలే చేయను అని బెజవాడ రైలెక్కి జ్యోతి మంత్లీలోకి దూకేశారు రమణ. ప్రేమ ఉన్న చోటే ఇంకేదో ఉంటుందంటారు. అలా వీళ్లిద్దరి ప్రేమ వికసించిన మూగమనసులు నాటి రోజులకు ఓ సారి డైవ్ చేద్దాం.
1954లో ఆదుర్తి సుబ్బారావు తొలి చిత్రం అమరసందేశం విడుదలైంది. సినిమా పెద్దగా ఆడకపోయినా దర్శకుడు విజనున్నవాడని పేరొచ్చింది. సాక్షాత్తు కె.వి.రెడ్డిగారే ఆ మాటనేశారు. ఆ మాట పట్టుకుని దుక్కిపాటి మధుసూధనరావు తన రెండో సినిమా దర్శకత్వ బాధ్యతలు ఆదుర్తికి అప్పగించారు.
ఆ సినిమా తోడికోడళ్లు. బెంగాలీ నవల నిష్కృతి ఆధారంగా రాసుకున్న కథను తోడికోడళ్లుగా తెరకెక్కించి అదరగొట్టారు ఆదుర్తి. అందులోనే ఆత్రేయ శ్రీశ్రీ మార్కు గీతం రాసి ఆడియన్స్ ను కన్ ఫ్యూజ్ చేశారు.తోడికోడళ్లు హిట్ కొట్టడంతో ఆదుర్తి వెనక్కి తిరిగి చూడలేదు. అక్కినేని ఆదుర్తి ఆత్రేయ ఇదీ హిట్టుకు తారక మంత్రం అని టాలీవుడ్ పెద్దలు ఖాయం చేసేశారు.
ఆదుర్తిని డైరక్టర్ ని చేసిందీ…ముళ్లపూడి వెంకటరమణను సినీ రచయితను చేసిందీ ఒక్కరే. ఆయనే డి.భావనారాయణ. డిబిఎన్ గా సినీ జనం పిల్చుకునే ఈ పెద్దమనిషి భాగస్వామ్యంలో సాహిణీ సంస్ధ ఏర్పాటు చేసి అమరసందేశం తీశారు. ఆ తర్వాత కూడా ఆదుర్తి కోసం తపస్సు చేసి మరీ దాగుడుమూతలు తీశారు.
ఆంధ్రపత్రికలో ఉద్యోగం వదిలేసి ఫ్రీలాన్స్ రైటర్ గా చెలరేగిపోతున్న ముళ్లపూడి వెంకటరమణలో ఉన్న ఫైర్ కనిపెట్టి ఆదుర్తితో తను చేయబోయే సినిమాకు కథ రాయమన్నారు డిబిఎన్. గారీ కూపర్ నటించిన మిష్టర్ డీడ్స్ గోస్ టూ టౌన్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా దాగుడుమూతలు వినిపించారు ముళ్లపూడి.ఆదుర్తికి నచ్చింది కానీ తన కమిట్ మెంట్స్ అయ్యాక గానీ ఆ సినిమా చేయలేదు. ఈ లోగా మూగమనసులు అనే కథను ముళ్లపూడి భుజాన పడేశారు.
అనగనగా ఓ జమిందారు కూతురు…ఓ పడవ నడిపే కుర్రాడు…వాళ్లిద్దరూ తమ మనసులకే తెలియకుండా ఒకరి మీద ఒకరు మనసు పడ్డారు. అది పూర్వ జన్మ బంధమా? జన్మజన్మల అనుబంధమా? వాళ్లు పెళ్లాడేశారా? లేదా? విడిపోయారా? చచ్చిపోయారా? ఇదిరా అబ్బాయ్ కథ.దీన్ని దారిలో పెట్టమని ఆత్రేయకు చెప్పి నెలలు గడిచాయి. నువ్వేమన్నా ఏడవగలవేమో చూడని ఓ రాత్రి ముళ్లపూడికి సెలవిచ్చారు ఆదుర్తి. సరిగ్గా వారం రోజుల్లో ట్రీట్ మెంట్ రాసి మూగమనసులు స్క్రిప్ట్ చేతిలో పెట్టారు ముళ్లపూడి వెంకటరమణ.
ముళ్లపూడి ఇచ్చిన స్క్రిప్ట్ ఆత్రేయ చేతిలో పెట్టి డైలాగులు , సీన్లు రాసిచ్చేయమన్నారు. నిజానికి ముళ్లపూడి రాసిన చాలా డైలాగ్స్ ను యధాతధంగా వాడేసుకున్నాను నేను…అంత బాగా రాశాడు అని సాక్షాత్తు ఆత్రేయే చెప్పారు.మొత్తానికి మూగమనసులు రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత దాగుడు మూతలూ విడుదలైంది. హిట్ అయింది.
ఇక్కడ వరకు అంతా బాగుంది. అయితే మూగమనసులు చిత్రానికి పనిచేసినందుకుగాను ముళ్లపూడికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ మాత్రం ఇవ్వలేదు ప్రొడ్యూసర్ సుందరం.ముళ్లపూడి కష్టం తెలిసిన ఆదుర్తి కూడా ఏమీ తెలియనట్టుండడంతో ముళ్లపూడి మనసు కష్టపెట్టుకున్నారు. ఆదుర్తి మీద ఒక రకంగా ఆయన మనసు విరిగిపోవడం మొదలైంది కూడా అప్పుడే.
నిజానికి ముళ్లపూడిలోని ఫైర్ కనిపెట్టింది డి.బి.ఎన్నే గానీ…ఫస్ట్ చాన్స్ ఇచ్చింది మాత్రం బెజవాడ డూండీ.
రాజ్యలక్ష్మీ ఫిలింస్ బ్యానర్ మీద సుందర్ లాల్ నహతాతో కలసి సినిమాలు చేస్తున్నారు డూండీ. ఆ బ్యానర్ లో వచ్చిన రక్త సంబంధం ముళ్లపూడి తొలి సినిమా. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ తో వరసగా మూడు హిట్స్ రాశారు. రెండోది గుడిగంటలు. మూడోది దాగుడు మూతలు.
డి.బి.ఎన్ ద్వారా ముళ్లపూడి వెంకటరమణ గురించి విన్న పోతిన డూండేశ్వర్రావు అలియాస్ డూండీ పిల్చి మరీ తమిళ సినిమా పాశమలర్ తెలుగు వర్షన్ పని అప్పగించారు. హీరో ఎన్.టి.ఆర్ కు ఎవరో చెప్పారు. అయ్యా రైటర్ గా ఆంధ్రపత్రిక ముళ్లపూడి వెంకటరమణను పెట్టారు. కామెడీ రైటరు…ఇదేమో సీరియస్సు…ఆత్రేయ లాంటోడు రాయాల్సిన స్క్రిప్ట్. ఆలోచించుకోండనేది ఆ మాటల తాత్పర్యం.
ఇదే విషయాన్ని డైరక్టర్ వి. మధుసూధనరావుని పిల్చి అడిగేశారు ఎన్.టి.ఆర్. జీవితంలో దు:ఖం తెల్సిన వాడే కామెడీ అదరగొట్టేస్తాడు. మీరు ఆలోచించకండి. రమణ బాగా రాస్తాడని చెప్పి సముదాయించారు వి.మధుసూధనరావు.
రక్తసంబంధం చూశాక రమణ మీద నమ్మకం కుదిరింది రామారావుగారికి. అంతే గుడిగంటలు కూడా ముళ్లపూడి వెంకటరమణకే అప్పగించేశారు. అదీ ఎమోషనల్ డ్రామానే. అదీ తమిళ రీమేకే. ఆత్రేయ మాత్రమే రాయదగిన డైలాగ్సే. అయితేనేం ముళ్లపూడి చెలరేగి రాశాడు.
సినిమా విజయం సాధించింది. రాసిన రెండు సినిమాలు వందరోజులు ఆడేశాయి. ఈ మధ్యలోనే ఆదుర్తితో ప్రయాణమూ సాగింది.ఆదుర్తితో గొడవ పడేనాటికి ముళ్లపూడి స్కోరు ఎనిమిది సినిమాలు. నందమూరితో మూడు. అక్కినేనితో ఐదు. పి. పుల్లయ్య పద్మశ్రీ బ్యానర్ మీద తీసిన ప్రేమించిచూడుకు తమిళ వర్షన్ ను మించిన డైలాగ్స్ రాశారు ముళ్లపూడి. పైగా ఇది ముళ్లపూడి తప్ప ఇంకెవరు రాసినా అంత గొప్పగా ఉండేది కాదనే పేరు సంపాదించి పెట్టిన చిత్రం అది.
అందులోనే తొలిసారి ఓ పాట కూడా రాశారాయన. బుచ్చబ్బాయ్ పని కావాలోయ్…అంటూ రేలంగిని టీజ్ చేసే అక్కినేని పాడిన పాట రమణ రాసిందే.మరో వైపు ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ మీద తాతినేని రామారావు డైరక్టర్ గా వచ్చిన ప్రయోగాత్మక చిత్రం నవరాత్రికీ ముళ్లపూడే రైటరు. అక్కినేని నాగేశ్వర్రావుతో తొమ్మిది పాత్రలు చేయించారా సినిమాలో. ఆ సినిమాతో తెలుగులో జండా ఎగరేసిన తాతినేని రామారావు…ఆ తర్వాత బాలీవుడ్ లో గ్రేట్ డైరక్టర్ అనిపించుకున్నాడు.
డైరక్టర్ ఆదుర్తి మోడరన్ థియేటర్స్ సుందరంతో కల్సి బూబూ మూవీస్ బ్యానర్ పెట్టి వరసగా సినిమాలు తీశారు. అన్నీ హిట్లే. అందులో తొలి చిత్రాలకు ముళ్లపూడి వెంకటరమణ హోల్ టైమర్ లాగా పనిచేశారు. ఆ తర్వాత బాబూ మూవీస్ నుంచే కాదు…ఆదుర్తి నుంచి కూడా దూరమైపోయాడు. అదీ మన మంచికే అనుకున్నాడు.
ఆదుర్తికి దూరమైనా…ఆదుర్తి మీదున్న ప్రేమ మాత్రం ముళ్లపూడిని వదల్లేదు.మూగమనసులు తర్వాత ఆదుర్తి అందరూ కొత్తవాళ్లతో ఓ సినిమా చేయాలనుకున్నారు. అందుకు తగ్గ యూత్ ఫుల్ కథ కోసం వెతుకుతున్నారు. ముళ్లపూడి వెంటరమణ చెప్పిన కథకు ఆత్రేయ, విశ్వనాథ్ కలసి డైలాగ్స్ రాసి తేనెమనసులు తయారు చేశారు. ఆదుర్తి బ్యానర్ లో వచ్చిన మనసులు సిరీస్ లో ముచ్చటగా మూడో సినిమా తేనెమనసులు కూడా బంపర్ హిట్ కొట్టింది.
మూగ మనసులు చిత్రానికి మూలాన్ని తయారు చేసినందుకు ముళ్లపూడికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదు బాబూ మూవీస్ వారు. అదే విషయాన్ని పరాకు పడ్డారని చెప్తారు ముళ్లపూడి వెంకటరమణ. తేనె, కన్నె మనసులు టైమ్ లోనూ అదే జరిగింది.చాలా అవసరంలో ఉండి… తన పెళ్లి కోసం వెళ్లి అడిగితే కూడా ఇవ్వలేదనేది ముళ్లపూడి కంప్లైంటు.
అప్పట్లో ఆదుర్తి చాలా బిజీ. ఒక కాలు ముంబైలోనూ ఇంకోకాలు మద్రాసులోనూ ఉంటుందని టాక్. లోకల్ గా ఉండే సుందరానికి విషయం అర్ధం కాదు. ఏదైనా గొడవైతే…ఆదుర్తి గారు లేరు కదా అనే సాకు. ఈ సెటప్ రమణకి బొత్తిగా నచ్చలేదు.దీంతో విరక్తి చెంది ఆదుర్తితో వర్క్ చేసేది లేదని డెసిషన్ తీసుకున్నారు. తనను వేలుపట్టుకుని సినిమా ప్రవేశం చేయించిన డిబిఎన్ వారించినా వినలేదు.
అసలిక సినిమాలే వద్దనుకున్నారు. బెజవాడెళ్లి జ్యోతి మంత్లీలో చేరిపోయారు. అయినా సినిమా బంధం వీడలేదు. పి.పుల్లయ్యగారి ప్రాణమిత్రులు కోసం మద్రాసు వస్తూ ఉండేవారు. ప్రాణమిత్రులుకు రాస్తూ ఉండగా…అన్నపూర్ణ దుక్కిపాటి మధుసూధనరావు నుంచి కబురొచ్చింది. అప్పటికి అన్నపూర్ణా వారు పూలరంగడు సినిమా కసరత్తులో ఉన్నారు.
పూలరంగడు కు ముందు వరసపెట్టి అక్కినేని సినిమాలు ఫ్లాపై ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్తితుల్లోనూ హిట్టు తీయాలనేది సంకల్పం. ఆదుర్తి సినిమాలకు పనిచేయకూడదని ఒట్టేసుకున్న ముళ్లపూడి దాన్ని తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది.పూలరంగడు సినిమా కోసం అప్పటికి ముప్పాళ్ల ఇంటి పేరుతోనే ఉన్న రంగనాయకమ్మ, గొల్లపూడి మారుతీరావులను కూడా రంగంలోకి దింపారు దుక్కిపాటి.
దీని మీద ఆదుర్తి ఓ అద్భుతమైన సెటైర్ వేశారు. పూడి కంబైన్స్ వారి ముళ్ల, గొల్ల వేడివేడి పొంగరం…అని. పూడి అంటే ముళ్లపూడి అని ఆయన అర్ధం.ఆదుర్తి బిజీ కావడంతో విశ్వనాథ్ గారే ఆయన తరపున కథాచర్చల్లో పాల్గొన్నారు. క్రైమ్, కుట్ర ఎలిమెంట్స్ తో పక్కా మాస్ కథకు పూలరంగడు అనే స్వీట్ టైటిల్ తగిలించి విడుదల చేసారు. సినిమా హిట్టైంది. అక్కినేనిని ఫ్లాపుల నుంచి బయటేసింది.
ఇంతకీ ఈ సినిమాకు కథ మాత్రమే వెంకటరమణ. డైలాగులు రంగనాయకమ్మగారే రాసారు. అలా కన్నెమనసులు టైమ్ లో ఆదుర్తిని వదిలేసిన ముళ్లపూడి పూలరంగడుకు పనిచేశారు.పొగరు, ఆత్మ విశ్వాసం ఉండాలే కానీ బంతి ఎంత గట్టిగా కిందకేసి కొడితే అంత గట్టిగా పైకి లేస్తుందనే ధియరీని బలంగా ఒంటపట్టించుకున్నవాడు ముళ్లపూడి వెంకట రమణ.
అందుకే ఉద్యోగం వదిలేసి ఫ్రీలాన్స్ లో అంతకు రెట్టింపు సంపాదించాడు.ఆదుర్తిని వదిల్తే మట్టికొట్టుకు పోతావంటే బయటకొచ్చి అంతకంతా సంపాదించడమే కాదు..ఏకంగా నిర్మాతే అయ్యాడు.ఆదుర్తి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూలరంగడు కథ నిమిత్తం దుక్కిపాటి మధుసూధనరావుగారు అక్షరాలా పదిహేను వేలు పారితోషికం ఇచ్చారు.
ఇలా లాభం లేదని మనమే ఎందుకు సినిమా తీయకూడదని జ్యోతి నుంచి బయటకు వచ్చి నిర్మాత అయ్యారు. సాక్షి తీయడమే కాదు…ఇది సాక్షి నామ సంవత్సరం అని టాలీవుడ్ లో కొత్త ట్రెండుకు నాంది పలికారు. కారీ కూపర్ నటించిన హై నూన్ అనే ఇంగ్లీష్ కౌబాయ్ సినిమాను ఆధారం చేసుకుని సాక్షి కథ రాసి దాన్ని ఫిలిం తీసి అదరగొట్టేశారు బాపు రమణలు.
కౌబాయ్ ను బల్లకట్టు కిట్టయ్య గా మార్చి తీసిన సాక్షి పెద్దగా లాభాలు తీయకపోయినా…నిర్మాతగా రమణకు, దర్శకుడుగా బాపుకూ ఓ పేరు ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీలో నిలబెట్టింది. ఆ తర్వాత బంగారు పిచ్చిక, బుద్ది మంతుడు, అందాలరాముడు, పెళ్లి పుస్తకం ఇలా బోల్డు సినిమాలు తీయించింది.
అందుకే తన్ను రెచ్చగొట్టి నేలకేసి కొట్టిన ప్రతి వారికీ ధన్యవాదాలు చెప్పారామధ్య రమణ గారు. అలాగే ఆదుర్తి సుబ్బారావుకీ ఎప్పటికీ రుణపడి ఉంటానంటారు. ఆదుర్తి మీద తనకున్న గౌరవం అపారం. ఆదుర్తి మీద ఆయన రాసిన వ్యాసాలే అందుకు నిదర్శనం. యుద్దం యుద్దమే. గౌరవం గౌరవమే.