Subramanyam Dogiparthi ………………..
తాడిని తన్నేవాడుంటే వాడిని తలదన్నే వాడు ఉంటాడు అనే సూత్రం మీద ఆధారపడి ఎత్తులు,పైఎత్తుల కధ ఈ ‘ఛాలెంజ్’ సినిమా కధ . అప్పటికే వీర పాపులరయిన యండమూరి వీరేంద్రనాధ్ డబ్బు టుది పవరాఫ్ డబ్బు నవల ఆధారంగా తీసిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది.
40 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పుడు తీసిన సినిమా లాగానే ఉంటుంది . యండమూరి సృష్టించిన పాత్రలకు ఇంకా ఎక్కువ నగిషీ పెట్టారు స్క్రీన్ ప్లే రైటర్ సొయినాధ్. సూపర్ ఫాస్ట్ రైలు లాగా ఉరకటానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం ఎంత కారణమో, అంతే ఘనత సాయినాథ్ స్క్రీన్ ప్లేది కూడా. ఆ తర్వాత సత్యమూర్తి డైలాగ్స్ . AK 47 నుండి వచ్చే తూటాల్లాగా దూసుకు వస్తాయి.
సినిమా లోని ఎత్తుకుపైఎత్తులకు ధీటైన వ్యక్తీకరణ డైలాగులు . ఆ రెండింటినీ సమన్వయం చేయడం కష్టమే . అయినా సత్యమూర్తి చాలా పదునైన డైలాగులను వ్రాసి సక్సెస్ అయ్యారు . తర్వాత పాటలు . వాటిని వ్రాసిన వేటూరి వారిని , డాన్సులను కంపోజ్ చేసిన తారను , సంగీతాన్ని స్వరపరచిన ఇళయరాజాని అభినందించాలి . బ్రహ్మాండమయిన మ్యూజిక్ ఇళయరాజాది.
చిరంజీవి , సిల్క్ స్మిత పాట , డాన్స్ . ఖైదీ సినిమాలో ‘రగులుతుంది మొగలి పొదే’ గుర్తుకొస్తుంది . ఆ పాటలో చిరంజీవి గుర్రం మీద ఎంట్రీని కోదండరామిరెడ్డి అద్భుతంగా చిత్రీకరించారు . మనసే మైకం పాట . మిగిలిన అన్ని డ్యూయెట్లు చిరంజీవి , విజయశాంతి , సుహాసిని అదరగొట్టేసారు.
‘ఇందువదన కుందరదన మందగమన’ పాటలో ‘ఐ లవ్యూ హారికా’ కుర్రాళ్ళు బాగానే పాడేవాళ్ళు . కుందరదన అంటే ఏంటో !? ‘సాయంకాలం సాగరతీరం’ , ‘భామా ఈ తిప్పలు తప్పవు ఎప్పటికయినా’ , ‘ఓం శాంతి ఓం శాంతి’ డ్యూయెట్లు సినిమా ఘన విజయానికి ప్రధాన కారణాలలో ముఖ్యమయినవి.
చిరంజీవి నటనతో ధీటుగా , విజయశాంతి , సుహాసినిలు పోటీపడ్డారు. సుహాసిని , విజయశాంతి పాత్రలను చాలా గొప్పగా తీర్చిదిద్దారు. నట విరాట్ రావుగోపాలరావు తనదైన శైలిలో నటించారు. తర్వాత చెప్పుకోవలసింది గొల్లపూడి మారుతీరావు , సిల్క్ స్మితల జంట .
పనిగండం పేరుతో ఏ పని చేయకుండా , ఓకవేళ చేసినా సున్నప్పిడత పనులు చేసే బతుకు . ప్రతి డైలాగుకు ……… ఆఫ్ ఇండియా అనే tag line తగిలిస్తూ మాట్లాడే గొల్లపూడి డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
డాన్సులకే పరిమితమయ్యే సిల్క్ స్మితకు సినిమా అంతా ఉండే మంచి పాత్ర లభించింది . చక్కగా పోషించింది . ఇతర ప్రధాన పాత్రల్లో సాయికుమార్ , రాజేంద్రప్రసాద్ , ప్రభృతులు నటించారు . సాధారణంగా యండమూరి నవలలు చదరంగం ఆట లాగా ఉంటాయి . యక్ష ప్రశ్నలు , క్విజ్ పోటీల్లాగా ఉంటాయి .
ఈ సినిమాలో అలాంటి డైలాగులు పుష్కలం . ఆవేశంలో కూతుర్నే పందెం కాసిన తండ్రితో మహాభారతంలో ధర్మరాజు భార్యను ఎలా పందెం కాసాడో అర్థం అవుతుందనే కూతురి డైలాగ్ ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది.
వ్యాపారంలో కట్టుకున్న దానిని కూడా నమ్మకూడదనే వ్యాపార సూక్తి . న్యాయబధ్ధత vs చట్టబధ్ధత డిబేట్ . ఆర్ధిక , సామాజిక , రాజకీయ నేరాలు చేయటం అన్యాయం . ప్రాసిక్యూషన్ వైఫల్య సహాయంతో శిక్ష తప్పించుకోవటం చట్టబధ్ధత . ఇదే మన దేశ సమకాలీన సంస్కృతి కదా ! ఈ నవలను తెరకెక్కించడానికి యండమూరి,సత్యమూర్తి,సాయినాథ్ చాలా కృషి చేశారు.
14 సెంటర్లలో వంద రోజులు ఆడటమే కాదు , కనక వర్షం కురిపించింది. విశాఖపట్టణంలో తీస్తే సినిమాలు సక్సెస్ కావాల్సిందే . నిర్మాత కె యస్ రామారావు , దర్శకుడు కోదండరామిరెడ్డి , చిరంజీవి , యండమూరి కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అయింది. యూట్యూబులో సినిమా ఉంది. చూడని వారు చూడవచ్చు. యువత తలచుకుంటే ఛాలెంజ్ గా తీసుకుని ఏదయినా సాధించగలదనే సందేశాన్ని ఇస్తుంది సినిమా .