పురచ్చితలైవి,దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఎక్కువగా ఆకు పచ్చ రంగు అంటే ఇష్టపడేవారు. ఎక్కువగా ఆమె ఆకుపచ్చ రంగు చీరలను ధరించేది.తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలోను … పార్టీ వేడుకల్లోనూ జయలలిత ఆకుపచ్చ చీరల్లోనే కనిపించేది.
అలాగే ఆమె సంతకం చేయడానికి ఉపయోగించే పెన్ కూడా ఆకుపచ్చ రంగులో ఉండేది. జయ వేలికి ఆకుపచ్చరంగు ఉంగరం కూడా ఉండేది. ఆకుపచ్చ రంగు చీరెలో కార్యక్రమాలకు హాజరై అందరి దృష్టిని ఆకర్షించేది.ఆకు పచ్చ రంగు అంటే కేవలం ఇష్టమే కాదు .. అది ఆమెకు సెంటిమెంట్ అని కూడా ఆమెకు సన్నిహితంగా మసలిన వ్యక్తులు చెబుతుంటారు.
జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా మద్రాస్ యూనివర్శిటీ సెంటెనరీ ఆడిటోరియం వేదికను కూడా ఆకుపచ్చ రంగులో అలంకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జయలలితకు బహుమతిగా ఇచ్చిన పూల బొకేలు కూడా ఆకుపచ్చ బాహ్య కవచాన్నికలిగి ఉండేలా సిబ్బంది జాగ్రత్త పడ్డారు. వేదిక నేపథ్యం కూడా ఆకుపచ్చ రంగులో కనిపించేలా ఆ రంగును అమర్చారు.
జయ నెచ్చెలి శశికళ కూడా ఆకుపచ్చ చీరనే ధరించారు.పార్టీ మహిళా కార్యకర్తలను కూడా ఆకుపచ్చ రంగు చీరలు ధరించమని జయ అడిగేవారట. జయ మరణం తరువాత కూడా ఆమెను ఆకుపచ్చ చీరలో ఖననం చేశారు. ఇంతగా జయలలిత కు ఆకుపచ్చ రంగు ఎందుకు ఇష్టమో ? ఎవరూ స్పష్టంగా ఎవరూ చెప్పలేదు.
కానీ ఒక సందర్భం లో చెన్నై కి చెందిన ఒక సిద్ధాంతి ఆకుపచ్చ రంగు మేలు చేస్తుంది చెప్పారని … అప్పటినుంచి ఆమె ఆకుపచ్చ అంటే ఎక్కువగా ఇష్టపడేది అని అంటారు.ఇక ఆమె పార్టీ చిహ్నంలో కూడా రెండు ఆకుపచ్చని ఆకులు ఉన్నాయి. జయ టీవీ లోగోలో కూడా ఈ ఆకుపచ్చని ఆకులు కనిపిస్తాయి. ఆమె పాలనలో చెన్నై ఆకుపచ్చగా మారినందున ఆమె ఆకుపచ్చను ప్రేమిస్తుందని అంటారు.
ఇక ఆకుపచ్చ రంగును ఇష్టపడే వ్యక్తులు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఊహల సామ్రాజ్యంలో ఉండడం వీరికి నచ్చదు. జాలి, ఉదార భావాలను ఎక్కువగా ప్రదర్శించకుండా వాటిని అదుపులో ఉంచుకుంటారు. మనసులో ఒకటి ఉంచుకుని బయట ఇంకొకలా మాట్లాడటం వీరికి రాదు. నచ్చని విషయాన్ని ఎదుటివాళ్లకి మొహమాటం లేకుండా చెప్పేస్తారు.
వాదించడం అంటే వీరికి నచ్చని విషయం. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా వేగంగా నిర్ణయాలను తీసుకుని అమలు చేస్తారు. ఆకు పచ్చను ఇష్టపడే వ్యక్తులకు నిబద్ధత, నిలకడ, పట్టుదల ఎక్కువగా ఉంటాయని అంటారు. పురచ్చితలైవి లో ఈ లక్షణాలు అన్ని ఉన్నాయి.
————— KNM