Do they look the same?…………..
హిందూ మతంలో మనకు ఎందరో సాధువులు,సన్యాసులు కనిపిస్తారు.వీరిలో అఘోరాలు(అఘోరీలు ) నాగ సాధువులు ముఖ్యులు. కుంభమేళాలో నాగ సాధులు ఎక్కువగా కనిపిస్తారు. కుంభమేళాలో స్నానం చేసే మొదటి వ్యక్తులు కూడా నాగ సాధువులే. అఘోరాలు కొద్దిమంది మాత్రమే ఈ కుంభమేళాకు వస్తారు.వేషధారణలో చూడటానికి వారు ఒకేలా కనిపిస్తారు.
కానీ వారు వేరే .. వీరు వేరే. నాగ సాధువులు నగ్నంగా ఉంటారు. అఘోరాలు మొల కనబడకుండా జంతు చర్మం తో దాచుకుంటారు.ఇక బొట్లు, విభూది రాసుకోవడం మామూలుగానే ఉంటుంది.తపస్సు,జీవనం,ధ్యానం,ఆహారం తదితర అంశాలలో అఘోరాలకు.. నాగసాధువులకు మధ్య కొన్ని వ్యత్యాసాలున్నాయి.
నాగ సాధువులు, అఘోరాలు కష్టతరమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కఠోరమైన సాధనలు చేయాలి. సాధువులు లేదా అఘోరాలగా మారాలంటే సుమారు 12 సంవత్సరాలు పడుతుంది. నాగసాధు అకడా లలో ఉంటూ ఎన్నోకష్టమైన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. కానీ అఘోరా కావాలంటే తపస్సు శ్మశానవాటికలో చేయాలి.
అఘోరాలు తమ జీవితంలో చాలా సంవత్సరాలు శ్మశానవాటికలోనే గడుపుతారు. ఇద్దరూ శివుడిని ఆరాధిస్తారు కాని వేర్వేరు పద్ధతులు అనుసరిస్తారు.నాగ సాధువులకు అకడాలలో గురువులు ఉంటారు. ఆ గురువు అకడా కు అధిపతి కావచ్చు లేదా ఎవరైనా పెద్ద పండితుడు కావచ్చు. వారి మార్గ దర్శనంలోనే నాగసాధువులు నడవాలి. సాధనలు చేయాలి.
అఘోరాల గా మారడానికి సీనియర్ అఘోరా మార్గదర్శనం తప్పనిసరి కాదు. అఘోరాలు గురువుగా శివుడిని భావిస్తారు. రాత్రిళ్ళు శ్మశానవాటికలో కూర్చుని తపస్సు చేస్తారు. శ్మశానం పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు.ఈ విధానం కఠినంగా ఉండటం మూలానా అఘోరాలగా మారే సాధువుల సంఖ్య తగ్గిపోతున్నది. అఘోరాలు శవం తొడ భాగంలోని మాంసాన్ని ప్రసాదం గా స్వీకరిస్తారు.
నాగ సాధువులలో కొందరు మాంసాహారులు,కొందరు శాఖాహారులు కనిపిస్తారు. ఏదీ దొరకనప్పుడు ఉపవాసాలుంటారు. నాగ సాధువులు వారి సమూహాలలో ఉంటారు. లేదా దేవాలయాల్లో, హిమాలయాల్లో ఉంటారు. అఘోరాలు గతంలో శ్మశానాలకు దగ్గరలో ఉంటూ రాత్రిళ్ళు రుద్రభూమిలో పూజలు చేస్తుండేవారు.
ఈ కాలంలో అది కష్టం కాబట్టి అఘోరాలు హిమాలయాల్లో.. జన సంచారం లేని కొండల్లో, కోనల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఈ కారణంగానే అఘోరాల సంఖ్య తగ్గిపోతోంది.కొంతమంది అఘోరాలు తాంత్రిక పూజలు కూడా చేస్తుంటారు. ఇరువురికి కఠిన సాధన, తపశ్శక్తి వలన కొన్ని అద్భుత శక్తులు సిద్ధిస్తాయని అంటారు కానీ ప్రత్యక్షం గా చూసినవారు బహు తక్కువ.
నాగసాధువులు, అఘోరాలు కుటుంబాన్నీ పూర్తిగా వదిలి సంపూర్ణ బ్రహ్మచర్యానికి కట్టుబడి ఉండాలి. సాధువుగా మారే ప్రక్రియలో తమ శ్రాద్ధ ప్రక్రియను కూడా ముందే పూర్తి చేయాలి. పిండ ప్రధానం చేయాలి. రాగ ద్వేషాలను విడనాడాలి.
చందౌలీకి చెందిన అఘోరీ సన్యాసి అయిన బాబా కీనారామ్, శైవమతంలోని అఘోరీ శాఖను స్థాపించారు. శక్తి పీఠాలకు దగ్గర్లో వీరు సంచరిస్తుంటారు.
అసూయ, ఆవేశం వంటి దుర్గుణాలను వదిలేయాలి. నాగా సాధువులు ఉత్తరాఖండ్ లో ఎక్కువగా కనిపిస్తారు. అఘోరాలు అబూ పర్వతాలలో ఎక్కువగా ఉంటారు. నేపాల్ గుజరాత్,మధ్యప్రదేశ్, యూపీ లలో అపుడపుడు కనిపిస్తుంటారు. వీరి మొత్తం సంఖ్య ఎంత అనే విషయం ఎవరికి తెలీదు.ఇటీవల కాలంలో నకిలీ అఘోరాలు పట్టణాలలో కూడా తిరుగుతున్నారు.
—————K.N.MURTHY