Action thriller…….
‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna – 2023) పర్యావరణ పరిరక్షణ సందేశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది .. వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా.
కథ ఏమిటంటే ?
లండన్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెంట్‌గా పనిచేసే మాజీ ‘రా’ అధికారి అర్జున్ వర్మ (వరుణ్ తేజ్), అక్రమ పర్యావరణ వ్యర్థాల గుట్టును (‘ఫైల్ 13’) ప్రపంచం ముందు బయటపెట్టబోతున్న భారత కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ బహదూర్‌ను (నాజర్),అల్లుడైన రణ్వీర్ (వినయ్ రాయ్) హత్యాయత్నాల నుండి ఎలా కాపాడాడు అనేదే ఈ సినిమా కథ.
వరుణ్ తేజ్ తన లుక్స్ తో, యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తాడు.కేంద్ర మంత్రి పాత్రలో నాజర్ హుందాగా నటించారు. క్లైమాక్స్‌లో ఐక్యరాజ్యసమితి సదస్సులో ఇచ్చే ప్రసంగం ఆకట్టు కుంటుంది.ప్రతినాయకుడు రణ్వీర్ పాత్రలో వినయ్ రాయ్ బాగానే చేసాడు. అయన పాత్ర అంత బలంగా కనిపించదు.
మంత్రి పీఏ పాత్రలో సాక్షి వైద్య అందంగా కనిపించడంతో పాటు తన పరిధి మేరకు చక్కగా నటించారు, అయితే కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉంది.. విమలారామన్ పాత్ర కూడా అంతే. నటీ నటులంతా బాగానే చేశారు.
సినిమాలో హాలీవుడ్ స్టైలిష్ గన్‌ఫైట్లు, కార్ ఛేజింగ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. లండన్‌లో ఒక రష్యన్ బాస్‌కు సెక్యూరిటీగా పనిచేస్తున్న అర్జున్ ప్రత్యర్థుల దాడి నుండి అతనిని కాపాడుతూ సూట్‌లోనే చేసే స్టైలిష్ ఫైట్ సినిమాకు ఆరంభంలోనే మంచి హైప్ ఇస్తుంది.
రద్దీగా ఉండే ఫుట్‌బాల్ స్టేడియంలో శృతి (రోషణి ప్రకాశ్) నుండి ‘ఫైల్ 13’ ఆధారాలను సేకరించే క్రమంలో విలన్ గ్యాంగ్‌తో జరిగే ఛేజింగ్, పోరాట సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. మంత్రి మనవరాలైన రియాను కాపాడే సన్నివేశాలు అంతకుముందు పోరాట సన్నివేశాలను బాగా చిత్రీకరించారు.
వ్యర్ధ పదార్ధాల డంపింగ్ వల్ల గ్రామాలు ఎలా కలుషితమౌతున్నాయో బాగా చూపారు. వరుణ్ తేజ్ తల్లి క్యాన్సర్ బారిన పడుతుంది. ఆ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. ఇలాంటి కథలతో కొన్ని సినిమాలు గతంలో వచ్చాయి.
సూర్య నటించిన సింగం 3 లో ఆస్ట్రేలియా నుండి భారత్‌లోకి అక్రమంగా విషపూరిత వ్యర్థాలను దిగుమతి చేసుకునే మాఫియాను హీరో అంతం చేస్తాడు. కథ వేరే అయినా కొన్నిపాయింట్స్ కలుస్తాయి. మొదటి భాగంలో ఉన్నంత వేగం, ఉత్కంఠ ద్వితీయార్ధంలో లేదు.
కథలో కొత్తదనం లేకపోవడం, మందగించిన స్క్రీన్‌ప్లే, సినిమా కు మైనస్‌గా మారాయి. కథ పై మరింత కసరత్తు జరిపితే బాగుండేది. ప్రధాన ప్రతినాయకుడు రణ్వీర్ (వినయ్ రాయ్) పాత్రలో బలం లేకపోవడం, హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులు ఆసక్తికరంగా లేకపోవడంతో థ్రిల్ తగ్గింది.
టేకింగ్ బాగున్నప్పటికీ కథలో దమ్ము తక్కువ కావడంతో అంచనాలను అందుకోలేకపోయింది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే అత్యల్ప వసూళ్లు సాధించిన చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.
ముఖేష్ జి అందించిన సినిమాటోగ్రఫీ, రిచ్ మేకింగ్, మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. ఒక విధంగా సినిమాకు బలంగా నిలిచాయి. యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను ఒక సారి చూడవచ్చు. ఆసక్తి ఉన్నవారు netflix లో చూడవచ్చు.

