పట్టుదలకు మరోపేరు జెన్సన్ హువాంగ్ !!

Sharing is Caring...

Ravi Vanarasi….

His journey is extraordinary…..

తొమ్మిదేళ్ల వయసులో ఏమీ తెలియని ఒక విదేశీ బాలుడిగా అమెరికా గడ్డపై అడుగుపెట్టి, మరుగుదొడ్లు శుభ్రం చేసి, రెస్టారెంట్లలో ప్లేట్లు కడిగిన స్థాయి నుండి,ఇవాళ  ప్రపంచ సాంకేతిక భవిష్యత్తును నిర్దేశించే ట్రిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి అధినేతగా ఎదిగిన జెన్సన్ హువాంగ్ ప్రయాణం అసామాన్యమైనది. 

నిరంతర అభ్యాసం, భవిష్యత్తును ముందే ఊహించే దార్శనికత, ఓటమిని అంగీకరించని పట్టుదల, తోటి మనుషుల పట్ల గౌరవం ఉంటే ఎలాంటి అద్భుతాలనైనా సృష్టించవచ్చని ఆయన జీవితం నిరూపిస్తోంది.

జెన్సన్ హువాంగ్ అసలు పేరు జెన్-హాసన్ హువాంగ్. ఆయన పందొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి పదిహేడున తైవాన్‌ లోని తైపీలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి హువాంగ్ హ్సింగ్-తాయ్ ఒక ఇంజనీర్, తల్లి లో త్సాయ్-హ్సియు ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు. జెన్సన్ చిన్నతనంలోనే వారి కుటుంబం తైవాన్ నుండి థాయ్‌లాండ్‌కు వలస వెళ్ళింది. బ్యాంకాక్‌లో ఆయన బాల్యం గడిచింది.

ఆ రోజుల్లో థాయ్‌లాండ్‌లో రాజకీయ అస్థిరత, వియత్నాం యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉండేవి. పిల్లల భవిష్యత్తు కోసం వారిని అమెరికా పంపాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం జెన్సన్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆయన తల్లికి ఇంగ్లీష్ రాకపోయినా, ప్రతిరోజూ డిక్షనరీ నుండి పది కొత్త పదాలు నేర్పిస్తూ పిల్లలను అమెరికా జీవితానికి సిద్ధం చేసింది.

పదిహేడు వందల డెబ్బై మూడులో, కేవలం తొమ్మిదేళ్ల వయసులో జెన్సన్, తన అన్నయ్యతో కలిసి అమెరికాకు ప్రయాణమయ్యారు. మొదట వారు వాషింగ్టన్ రాష్ట్రంలోని టకోమాలో ఉన్న తమ బంధువుల వద్దకు చేరారు. అయితే అక్కడ సరైన విద్యావకాశాలు లేకపోవడంతో, వారి బంధువులు పొరపాటున కెంటకీ రాష్ట్రంలోని ఒనిడా బాప్టిస్ట్ ఇన్‌స్టిట్యూట్ అనే బోర్డింగ్ స్కూల్‌లో వారిని చేర్పించారు.

అదొక సాధారణ పాఠశాల కాదు.. సమాజంలో ఇమడలేని, క్రమశిక్షణ లేని, నేర ప్రవృత్తి కలిగిన పిల్లలను సంస్కరించడానికి ఉద్దేశించిన ఒక కఠినమైన సంస్థ. ఆ పాఠశాలలో జెన్సన్ ఎదుర్కొన్న అనుభవాలు అత్యంత కఠినమైనవి. అక్కడ ప్రతి విద్యార్థి కష్టపడి పనిచేయాలి. తొమ్మిదేళ్ల చిన్నారి అయిన జెన్సన్ ప్రతిరోజూ పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేయాల్సి వచ్చేది.

తోటి విద్యార్థుల నుండి వేధింపులు, కఠినమైన నిబంధనల మధ్య ఆయన తన చిన్ననాటి భయాలను అధిగమించి, మానసికంగా ఎంతో దృఢంగా మారారు. అక్కడ తన రూమ్‌మేట్‌కు చదవడం నేర్పిస్తూ, బదులుగా అతని నుండి శారీరక దృఢత్వాన్ని, ఆత్మరక్షణ కళలను నేర్చుకున్నారు. జీవితంలో ఎంతటి కష్టమైనా తట్టుకోగలననే ఆత్మవిశ్వాసం ఆయనకు ఆ పాఠశాలలోనే అలవడింది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా అమెరికాకు చేరుకుని ఒరెగాన్ రాష్ట్రంలోని పోర్ట్‌ల్యాండ్ నగరంలో స్థిరపడ్డారు. జెన్సన్ అక్కడ అలోహా హైస్కూల్‌లో చేరారు. చదువులో అత్యంత ప్రతిభ కనబరుస్తూనే, టేబుల్ టెన్నిస్ ఆటలో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగారు. పదిహేనేళ్ల వయసులోనే అమెరికన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ డబుల్స్ విభాగంలో మూడవ స్థానాన్ని గెలుచుకున్నారు.

మరోవైపు, తన కుటుంబ ఆర్థిక అవసరాల కోసం డెన్నీస్ అనే రెస్టారెంట్‌లో వెయిటర్‌గా, డిష్‌వాషర్‌గా పనిచేశారు. ఆ ఉద్యోగం ఆయనలో ఉన్న బిడియాన్ని పోగొట్టింది. విభిన్న రకాల మనుషులతో మాట్లాడటం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా సేవలు అందించడం ఆయన అక్కడే నేర్చుకున్నారు.

హైస్కూల్ విద్య పూర్తయిన తర్వాత జెన్సన్ ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో చేరారు. అక్కడే ఆయన జీవిత భాగస్వామి లోరీ మిల్స్ పరిచయమయ్యారు. ఇంజనీరింగ్ ల్యాబ్‌లో వారు ఇద్దరూ ఒకే గ్రూప్‌లో పనిచేసేవారు. తరగతి గదిలో ఉన్న అతికొద్ది మంది అమ్మాయిలలో లోరీ ఒకరు. జెన్సన్ తన చదువులోని ప్రతిభతో ఆమెను ఆకట్టుకుని, తర్వాత వివాహం చేసుకున్నారు.

పందొమ్మిది వందల ఎనభై నాలుగులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆయన సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అడ్వాన్స్‌డ్ మైక్రో డివైసెస్ సంస్థలో మైక్రోప్రాసెసర్ డిజైనర్‌గా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత ఎల్‌ఎస్‌ఐ లాజిక్ సంస్థలో చేరి, ఇంజనీరింగ్ నుండి మార్కెటింగ్,  జనరల్ మేనేజ్‌మెంట్ విభాగాల వరకు వివిధ హోదాల్లో పనిచేశారు.

ఉద్యోగం చేస్తూనే స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పందొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి చేశారు.పందొమ్మిది వందల తొంభై మూడువ సంవత్సరం కంప్యూటర్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఆ సమయంలో పర్సనల్ కంప్యూటర్లు కేవలం టెక్స్ట్, సాధారణ గ్రాఫిక్స్ మాత్రమే చూపించగలిగేవి.

కానీ భవిష్యత్తులో త్రీడీ గ్రాఫిక్స్, వీడియో గేమ్స్ విపరీతంగా పెరుగుతాయని జెన్సన్ హువాంగ్, ఆయన మిత్రులు క్రిస్ మలాచోవ్స్కీ, కర్టిస్ ప్రీమ్ బలంగా నమ్మారు. సిలికాన్ వ్యాలీలోని శాన్ జోస్ నగరంలో, జెన్సన్ గతంలో పనిచేసిన డెన్నీస్ రెస్టారెంట్‌లోని ఒక మూల టేబుల్ వద్ద కూర్చుని వారు ఒక కొత్త కంపెనీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

కేవలం నలభై వేలు డాలర్ల పెట్టుబడితో, పందొమ్మిది వందల తొంభై మూడువ ఏప్రిల్ ఐదున ఎన్విడియా సంస్థ పురుడు పోసుకుంది. లాటిన్ పదమైన ‘ఎన్విడియా’ అంటే అసూయ లేదా ఆకర్షణ నుండి ఈ పేరును ఎంచుకున్నారు. కంప్యూటింగ్ రంగంలో సాధారణ ప్రాసెసర్లు చేయలేని అత్యంత క్లిష్టమైన గ్రాఫిక్స్ గణనలను చేసే ప్రత్యేక చిప్స్ తయారు చేయడమే వారి ప్రధాన లక్ష్యం.

Pl. read it also….. పట్టుదలకు మరోపేరు జెన్సన్ హువాంగ్ ! (2)

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!