NTR experiments…………………..
పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ ఎన్నో కీలకమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్నారు. రాముడిగా , కృష్ణుడిగా అయితే ఇక చెప్పనక్కర్లేదు. అప్పట్లో ప్రేక్షకులు ఆయన్నే కృష్ణుడు , రాముడిగా భావించారు. ఇక రామాయణ , భారతాల్లో రావణుడు , దుర్యోధనుడు వంటి ప్రతి నాయకులను నాయక పాత్రలుగా మార్చి … వాటి చుట్టూ కథ తిప్పిన క్రెడిట్ కూడా ఎన్టీఆర్ దే.
ఇదొక రకమైన కొత్త ప్రయోగం . ప్రతినాయకులను హీరోలుగా చేయడం …. ఆ పాత్రలను ఆయనే నవరస భరితం గా పోషించడం ఎన్టీఆర్ కే చెల్లింది. ఇందుకు సీతారామ కళ్యాణం , శ్రీకృష్ణపాండవీయం , దానవీర శూరకర్ణ సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అంతకు ముందు భూకైలాస్ చిత్రంలో కూడా రావణాసురుడి చుట్టూనే కథ నడుస్తుంది. ఆ పాత్ర కూడా ఎన్టీఆర్ చేసిందే. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు నారదుని పాత్ర చేశారు. భూకైలాస్ చిత్రాన్ని అగ్రగామి సంస్థ ఏవిఎం నిర్మించింది. దర్శకుడు కె.శంకర్. సముద్రాల రాఘవాచార్య మాటలు .. పాటలు సమకూర్చారు. సినిమా హిట్ అయింది. ఎన్టీఆర్ కి మంచిపేరు తెచ్చిపెట్టింది.
బహుశా ఆ సినిమా స్ఫూర్తి తోనే ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం సినిమాను సొంతంగా నిర్మించారు. దర్శకత్వం కూడా ఆయనే. పేరు మాత్రం వేసుకోలేదు. ఈ సినిమాలో రావణ పాత్రను హైలైట్ చేశారు. రాముడిగా హరనాథ్ నటించారు.
రావణ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని, తన ఫెవరెట్ క్యారెక్టర్ అని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పుకున్నారు. ఈ సినిమా కథ ను తయారు చేసింది సముద్రాల వారే. ఎన్టీఆర్ సలహా మేరకు పలు రామాయణాలను సముద్రాల పరిశీలించి వాటి ఆధారం గా స్క్రిప్ట్ రూపొందించారు.
ఇప్పటికి ఎక్కడ పెళ్లి జరిగినా వినబడే ‘సీతారాముల కళ్యాణము చూతము రారండి’ పాట ఇందులోనిదే. 63 ఏళ్ళ క్రితం సముద్రాల వారు ఈ పాట రాశారు. ఆల్ టైం సూపర్ హిట్ సాంగ్ గా అది నిలిచిపోయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ దిట్ట అని పరిశ్రమ గుర్తించింది.
ఆ తర్వాత 1966 లో శ్రీకృష్ణ పాండవీయం చిత్రాన్ని ఎన్టీఆర్ నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను ఆయన అద్భుతంగా చేశారు. ఆ పాత్రలలో ఇమిడి పోయారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ పేరు దర్శకునిగా మొదటిసారి వెండితెర మీద కనిపించింది. అంతకుముందు సీతారామ కల్యాణం, గులేబకావళి కథ సినిమాలకు దర్శకత్వం వహించినా తన పేరు వేసుకోలేదు.
ఈ సినిమాలో శకుని పాత్ర కూడా విభిన్నంగా ఉంటుంది. శకుని పూర్వపరాలు ఏమిటో ఈ సినిమాలో చూపారు. ధూళిపాళ ఆపాత్ర అద్భుతం గా చేశారు. ఇక కె.ఆర్.విజయ రుక్మిణి పాత్రలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడికి రుక్మిణి కి ఒక డ్యూయెట్ పెట్టారు. ” ప్రియురాలా సిగ్గేలనే” అంటూ సముద్రాల వారు రాసిన ఆపాట అప్పట్లో సూపర్ హిట్.
మరి అప్పుడెందుకో దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టాలని ఆలోచన ఎన్టీఆర్ కి రాలేదు. అయితే ఆ తర్వాత కాలంలో “దానవీర శూరకర్ణ” చిత్రంలో దుర్యోధనుడికి, భానుమతికి డ్యూయెట్ పెట్టి ఒక కొత్త వరవడికి ఎన్టీఆర్ నాంది పలికారు. సందర్భం చెప్పి పాట రాయమని ఎన్టీఆర్ డాక్టర్ సి.నారాయణరెడ్డి ని అడిగేరట. డ్యూయెట్ సాంగ్స్ రాయడంలో సినారే కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.
అదికాక చిత్ర పరిశ్రమకు ఎన్టీఆరే సినారె ని పరిచయం చేశారు. దుర్యోధనుడికి భానుమతి కి డ్యూయెట్ అనగానే సినారె ఇదేమి చిత్రం అనుకున్నారట. భారతంలో సుయోధనుడు విలన్ . అతని భార్యా పిల్లల గురించి ఎవరికి తెలియదు. అలాంటిది పాట పెట్టడం విచిత్రంగా ఉంటుందేమో అనుకున్నారట. తన సందేహాలను బైట పెట్టకుండా “చిత్రం భళారే విచిత్రం. అయ్యారే విచిత్రం ” అన్నారట.
ఎన్టీఆర్ కి ఆ లైన్ నచ్చి ప్రొసీడ్ అన్నారట . తర్వాత “ఈ రాచనగరుకి రారాజుని రప్పించుటే విచిత్రం” అంటూ పాట కొనసాగుతుంది. ఈ పాటలో భానుమతిగా ప్రభ నటించింది. పాట కు తగిన విధంగా నృత్య రీతులు , పెండ్యాల సంగీతం , పాట చిత్రీకరణ , గాయకుడు ఎస్పీబాల సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ కి సూట్ అయ్యేలా ఆ పాట పాడిన విధానం .. పదాల విరుపులకు ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. ఈలలు ,కేకలు, కరతాళ ధ్వనులతో థియేటర్లు హోరెత్తిపోయాయి.
దుర్యోధనుడికి డ్యూయెట్ ఏమిటి ? ఎన్టీఆర్ కి మతి భ్రమించిందా అని అనుకున్న సినీ విమర్శకులు తెరపై పాట చూసి బిత్తరపోయారట. అప్పట్లో ఈ పాట పత్రికల్లో చర్చనీయాంశమైంది. అప్పటి ఆ పాటను తిరిగి ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో మళ్ళీ ఉపయోగించారు. ఆ పాటలో బాలయ్య ,శ్రియ నటించారు.
దానవీర శూర కర్ణ కు కొండవీటి వేంకటకవి స్క్రిప్ట్ తయారు చేశారు. సినిమా 10 లక్షల వ్యయం తోపూర్తి అయింది. తొలి రిలీజ్ లో కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది. 1994లో రెండవ సారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. పలు రికార్డులు బద్దలు కొట్టింది.
—— K.N.M
baagaane undi