Worth watching movie…………
‘బత్తా’ (Baththa) విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలనటుడు సాయి పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో బాలాజీ తరణీధరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ ఈ చిత్రం ఒక విభిన్నమైన ఎమోషనల్ డ్రామా గా ప్రశంసలు అందుకుంటోంది .. Netflix లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో ఇదొకటి. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా.
కథేంటంటే?
బత్తా (విజయ్ సేతుపతి) ఆ ఊరిలో అందరినీ భయభ్రాంతులకు గురిచేసే ఒక రౌడీ. భార్య కన్నిమా (లిజోమోల్ జోస్), కూతురు ఉన్నప్పటికీ ఊరి మీద పడి ఎదురు తిరిగిన వ్యక్తులను కొట్టుకుంటూ తిరగడమే అతని పని. అయితే, అనుకోకుండా ఒక రోజు ఆ ఊరిలోని ఒక స్కూల్ బాత్రూంలో బత్తా లాక్ అయిపోతాడు..శబరి (మాస్టర్ సాయి పృథ్వీరాజ్) అనే భయస్తుడైన స్కూల్ పిల్లాడు అనుకోకుండా అతన్ని బాత్రూంలో బంధిస్తాడు. తర్వాత బత్తా ఎలా బయటపడ్డాడు ? బంధించిన పిల్లవాడిని బత్తా ఏం చేసాడు అనేది మిగతా కథ.
విజయ్ సేతుపతి తన పాత్రలో ఒదిగిపోయారు.బాత్రూంలో ఇరుక్కుపోయినప్పుడు ఒక వైపు భయపెడుతూనే మరో వైపు నిస్సహాయతను ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.చాలా సన్నివేశాల్లో విజయ్ సేతుపతి చక్కగా నటించారు.
విజయ్ సేతుపతి కంటే కూడా మాస్టర్ సాయి పృథ్వీరాజ్ నటన ఈ సినిమాకు ఊపిరి పోసింది.భయంతో తప్పులు చేసే పిల్లాడిగా అతని నటన అద్భుతమని చెప్పుకోవాలి. విజయ్ సేతుపతి తో పోటాపోటీగా నటించాడు. ఈ సందర్భంగా ఆ పిల్లోడి నుంచి అలాంటి నటనను రాబట్టిన దర్శకుడిని కూడా ప్రశంసించాలి. అసలు ఈ కథలో హీరో ఆ పిల్లోడే ..సినిమా కు అతని పాత్రపేరు శబరీ అని పెడితే బాగుండేది.
సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘బత్తా’ సినిమాకు సాయి పృథ్వీరాజ్ అసలైన హీరో అని, కథ మొత్తం అతని పాత్ర చుట్టూనే నడుస్తుందని చాలా గొప్పగా చెప్పారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, బాలనటుడికి క్రెడిట్ ఇస్తూ ఆయన మాట్లాడటం మీడియాలో హైలైట్ అయింది.
‘జై భీమ్’ చిత్రంలో తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న లిజోమోల్, ఈ సినిమాలో కూడా అంతే సహజమైన నటనను కనబరిచారు. ఒక రౌడీ భార్యగా ఆమె పడే అంతర్మథనం, వేదన, భర్తపై ఉండే ప్రేమను తన కళ్లతోనే అద్భుతంగా పలికించారు. మిగతా పాత్రధారులంతా కూడా బాగానే నటించారు.
సినిమా ప్రారంభ సన్నివేశాలు, బత్తా బ్యాక్‌స్టోరీని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. అలాగే ద్వితీయార్థంలో కొన్నిచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. ఇది కేవలం క్యారెక్టర్-డ్రైవెన్ సినిమా కావడం వల్ల, రెగ్యులర్ రౌడీ సినిమాల్లో ఉండే భారీ ఫైట్లు, మాస్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఇది కొంచెం భిన్నంగా అనిపించవచ్చు.
బలవంతపు కామెడీ ట్రాక్‌లు లేకుండా, కేవలం వారున్న పరిస్థితుల నుంచి వచ్చే హ్యూమర్ ప్రేక్షకులను నవ్విస్తుంది ఒక రౌడీకి, ఒక పిల్లాడి అమాయకత్వానికి మధ్య వచ్చే సీన్లు గుండెకు హత్తుకుంటాయి. చివర్లో శబరి తప్పు ఒప్పుకునే సీన్ ,తర్వాత బత్తా ను శత్రువులు చంపబోతుంటే శబరి అడ్డం పడిన సన్నివేశం ఆకట్టుకుంటాయి. క్లయిమాక్స్ బాగుంది. బత్తా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను ట్రిమ్ చేస్తే బాగుండేది.
పిల్లల్లో ఉండే సహజమైన భయం ఎలాంటి పొరపాట్లకు దారితీస్తుంది, అలాగే ఒక మనిషిలోని క్రూరత్వాన్ని, ప్రేమ, అమాయకత్వం ఎలా జయిస్తుంది అనే మంచి సందేశాన్ని కథ ద్వారా చూపించారు.
ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అతిపెద్ద బలం. సినిమా అంతా ఒక రౌడీ, చిన్న పిల్లాడి మధ్య సాగే ఎమోషనల్ జర్నీ కావడం వల్ల, వారి మధ్య వచ్చే సీన్లను తన మ్యూజిక్‌తో సాయి అభ్యంకర్ అద్భుతంగా ఎలివేట్ చేశారు.. కథలోని భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేశారు.
ఈ చిత్రానికి డి. సెల్వకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. లైటింగ్‌ను చాలా సహజంగా డిజైన్ చేశారు. పరిమితమైన ప్రదేశంలో కూడా కెమెరా యాంగిల్స్ మార్చుకుంటూ, ప్రేక్షకుడికి ఎక్కడా క్లాస్ట్రోఫోబిక్ (ఇరుకుగా ఉన్న ఫీలింగ్) లేదా బోర్ కొట్టకుండా, ప్రతి సీన్‌ను ఆసక్తికరంగా చూపించడంలో కెమెరామెన్ సక్సెస్ అయ్యారు.
‘బత్తా’ కుటుంబంతో కలిసి చూడదగ్గ ఎమోషనల్ అండ్ హ్యూమరస్ డ్రామా. కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, మనుషుల్లో వచ్చే మార్పును , అనుబంధాలను అద్భుతంగా చూపించారు. ఓటీటీలో ఒక మంచి అనుభూతినిచ్చే సినిమా చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో దీనిని అస్సలు మిస్ అవ్వకండి.

