రీలుకెక్కిన రియల్ కెమిస్ట్రీ !!

Sharing is Caring...

Ramana Kontikarla ……………..

అమితాబ్, రేఖ, జయబాధురి… ఈ ముగ్గురిదీ నిజజీవితంలోనూ ఓ ముక్కోణపు ప్రేమకథ. ఇదే రియల్ స్టోరీని… సిల్సిలా  సినిమాగా  తెరకెక్కించడమంటే  ఓ పెద్ద సవాలే. కానీ, ఆ సవాల్ ను యశ్ చోప్రా ఛేదించాడు. ఆకర్షణ నుంచి ఏర్పడే వివాహేతర బంధాలు… ఆ తర్వాత జరిగే పరిణామాలు.. పశ్చాత్తాపం.. మళ్లీ వివాహ బంధానిదే విజయమని చెప్పే శుభం కార్డుతో ముడి వేసి.. సిల్సిలా  ను   ఓ ఎవర్ గ్రీన్ కల్ట్ మూవీగా తీసాడు.

ఈ సినిమా మేకింగ్ సమయంలో జయాబచ్చన్ ఎందుకు వెనుకడుగు వేశారు…? రేఖ మాత్రం ఎందుకు వెంటనే ఒప్పుకుంది..? చివరకు ఒక షరతుతో జయాబాదురి ఎలా ఒప్పుకుంది..?

కైపెక్కిన చూపులు, అందంతో… అప్సరసలు సైతం ఆశ్చర్యపోయే రేఖ పుట్టినరోజున ఆ సిల్సిలా వెనుక జరిగిన కథేంటో ఓసారి చెప్పుకుందాం. 

ఎందుకంటే, 1981లో వచ్చిన ఈ సిల్సిలా కథ కంటే కూడా వెనుక జరిగిన బాలీవుడ్ కథే మరింత ఆసక్తికరమైంది. అమితాబ్, జయ, రేఖ.. అప్పటికే ముగ్గురూ తమ తమ స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్నవారే. కానీ ఈ ముగ్గురినీ ఒకే సినిమాలో, అదీ ప్రేమ–వివాహేతర సంబంధం చుట్టూ తిరిగే కథలో చూపించడం అప్పట్లో పెద్ద సంచలనం. అందుకు, కేవలం సినిమా మాత్రమే కారణం కాదు.

అమితాబ్, రేఖ మధ్య ప్రేమకథ… అప్పటికే సినీ పత్రికల్లో, గాసిప్ కాలమ్స్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న కాలమది. అలాంటి సమయంలో యశ్.చోప్రా సిల్సిలా వంటి సినిమా చేయాలని ఆలోచించడం.. తన ఆలోచనలకనుగుణంగా, సినీతారల చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని బలపర్చేలా ఓ సినిమాకు రూపకల్పన చేయడం మరో ఎత్తైతే… అమితాబ్, రేఖ అంటే ఒప్పుకుంటారేమోగానీ.. జయాబాధురీ ని ఒప్పించడం మరో ఎత్తు.

సిల్సిలా కోసం ముందు అనుకున్న తారలెవరు..?

అసలు యశ్ చోప్రా ముందు అనుకున్న తారల్లో రేఖ, జయ లేరు. అమితాబ్ తో కలిసి సిల్సిలాలో నటించడానికి ముందుగా యశ్ చోప్రా స్మితాపాటిల్, పర్వీన్ బాబీని ఎంపిక చేశారు. స్మితాపాటిల్ జయబాదురి పాత్ర చేయాల్సి ఉండగా.. రేఖ పాత్రలో పర్వీన్ బాబీ నటించాలి. కానీ, షూటింగ్ సమయానికి పర్వీన్ బాబీ అనారోగ్యం కారణంగా  ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత స్మితాపాటిల్ కూడా ఆమె వ్యక్తిగత కారణాల వల్ల డేట్స్ కుదరకపోవడంతో తప్పుకోవాల్సి వచ్చింది. అదిగో అప్పుడే యశ్ చోప్రా ఆలోచన పూర్తిగా మారిపోయింది.

యాదృచ్ఛికంగా తెరమీదకెక్కిన రియల్ స్టోరీ!

జయ, రేఖను తీసుకుంటే ఎలాగుంటుందన్న ఆలోచన యశ్ కు తట్టింది. రేఖకు యశ్ సినిమాలో నటించడానికి ఎలాంటి సంకోచం లేదు. కానీ, జయ సంగతేంటి మరి..?

అప్పటికే అమితాబ్, రేఖ మధ్య ప్రేమకథల గురించి పలు వార్తలు గుప్పుమంటున్న కాలంలో… తన భర్త అమితాబ్ తో పాటు… రేఖ కూడా నటించే సినిమాలో తాను ఎలా నటించాలన్న సంకోచం జయది. అందుకే, జయ మొదట్లో యశ్ ప్రతిపాదనను తిరస్కరించారు. కానీ, ఆ ముగ్గురితో చేస్తేనే సినిమా పండుతుందన్న విశ్వాసం యశ్ చోప్రాది.

ఎందుకంటే, సినిమాకు కావల్సింది మంచి నటులతో పాటే… అప్పటికే బయట నడుస్తున్న ప్రచారం కూడా సినిమాకు తోడవు తుందన్న భావనతో యశ్ చోప్రా ఎలాగైనా జయను ఒప్పించాలని నిర్ణయించుకున్నారు. పైగా ఆ సమయంలో యశ్ చోప్రాకు ఓ పెద్ద హిట్ కావల్సి వచ్చింది. ఎందుకంటే, అప్పటికే కాలాపత్తర్ బాక్సాఫీస్ వద్ద ఫట్టంది.

దాంతో తదుపరి సినిమా హిట్ ఇవ్వాల్సిన ఒత్తిడి కూడా యశ్ చోప్రాపై ఉంది. దాంతో సిల్సిలా తన కెరీర్ లోనే ఓ కీలకమైన ప్రాజెక్ట్ గా మారింది.

మరి సంజీవ్ కుమార్ పాత్రేంటి..?

ససేమిరా అన్న జయాబచ్చన్ ను ఒప్పించడం యశ్ చోప్రా వల్ల కాలేదు. దాంతో జయతో సన్నిహిత సంబంధమున్న సంజీవ్ కుమార్ ను రంగంలోకి దింపారు యశ్ చోప్రా. కోశిష్ అనే సినిమా నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధమేర్పడింది. సంజీవ్ కుమార్ జయను ఓ సోదరిలా భావించేవారని.. రాఖీ కట్టించుకునేవారని సినీ జర్నలిస్ట్ హనీఫ్ జవేరీ ఓ వార్త ఛానల్ కు గతంలో చెప్పిన సందర్భముంది.

మొత్తానికి యశ్ చోప్రా వేసిన ఎత్తు ఫలించింది. సంజీవ్ కుమార్ ఎంట్రీతో జయ ఒప్పుకుంది. కానీ, ఒక షరతుతో ఆమె అందుకు అంగీకరించింది.

మరి సిల్సిలా నటించేందుకు జయ పెట్టిన ఆ షరతేంటి..?

తాను సినిమా షూటింగ్ జరిగేంత వరకూ మొత్తం సెట్లోనే ఉంటానన్నది జయ కండిషన్. అంటే తను నటించాల్సిన సన్నివేశాలు లేకపోయినా.. తన అవసరం సినిమాకు లేకపోయినా.. సినిమా షూటింగ్ అయ్యేంతవరకు తాను సెట్ లో ఉండాలన్నదే జయ పెట్టిన షరతు. అందుకు కారణం రేఖ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమితాబ్, రేఖ సెట్లో ఉండే సమయంలో తాను దూరం గా ఉండకూడదన్నదే ఆ షరతు ఉద్ధేశం.

అప్పటికే ప్రచారంలో ఉన్న అమితాబ్, రేఖ సంబంధంతో… తన భర్త అమితాబ్ విషయంలో ఒక అభద్రతా భావంలో ఉంది జయ. దాంతో ముందు ససేమిరా అన్నా సంజీవ్ కుమార్ చొరవతో ఓకే అంది.

మరి ముగ్గురూ ఒకే సెట్ లో ఉన్న వాతావరణమెలా ఉండేది..?

సిల్సిలా సినిమా తనకో ఛాలెంజ్. దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం, ఒత్తిడి యశ్ చోప్రాపై ఉంది. మరోవైపు, రేఖ అంటేనే భగ్గుమనే జయ.. భర్త అమితాబ్, రేఖ మధ్య వినిపిస్తున్న గాసిప్స్.. ఇలా సినిమాను డీల్ చేయడం కత్తిమీద సామే. కానీ, యశ్ చోప్రా చాలా జాగ్రత్తగా సిల్సిలా సినిమా షూటింగ్ నిర్వహించారట.

ముఖ్యంగా మీడియాకు దూరంగా షూటింగ్స్ చేసుకోవడం. అవసరం లేని వ్యక్తులను సెట్లోకి అనుమతించకపోవడం. జయ, రేఖ ఇద్దరినీ వీలైనంత వరకూ వేర్వేరుగా ఉండేలా చూడటం.. వీటన్నింటి కోసం  యశ్ చోప్రా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందట.

ఎందుకంటే సినిమాలో జరుగుతోంది కేవలం నటనే కాదు… తెరపై ఓ వివాహిత, ఆమె భర్త… అతడి ప్రియురాలు.. మరోవైపు, బయట కూడా అదే ముగ్గురి గురించి భిన్నకథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తంగా రియల్ లైఫ్ ను రీల్ కు ఎక్కించే ఓ సున్నితమైన ప్రక్రియలా సిల్సిలా సినిమా ప్రాజెక్ట్ మారింది.

రీలుకెక్కిన రియల్ స్టోరీతో అద్భుతమైన కెమిస్ట్రీ!

షూటింగ్ సమయంలో ఎంతో టెన్షన్ కు గురిచేసిన సినిమా.. పూర్తై తెరకెక్కాక మాత్రం ముగ్గురి మధ్యనున్న ఆ టెన్షన్ వాతావరణమే సినిమాను ప్రత్యేకంగా  మార్చింది. జయ, రేఖ మధ్య వచ్చే సీన్స్ ఇప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది సిల్సిలా.
ఒకవైపు ప్రేమ, ఆకర్షణ.. ఇంకోవైపు, వైవాహిక బంధంపై నమ్మకం.. వెరసి రెండు భిన్న భావజాలాలు ఎదురెదురుగా నిల్చి ప్రేక్షకులను రంజింపజేశాయి. మొత్తంగా సిల్సిలా ప్రేమ, వివాహం, బాధ్యత, నమ్మకం వంటి వాటిమధ్య జరిగే ఓ సంఘర్షణను తెరకెక్కించింది.

ముగింపులో యశ్ మార్క్!

నిజ జీవితంలో ఏ ప్రచారమైతే పెద్ద ఎత్తున జరుగుతుందో.. అదే టెంపోను సినిమాలో మొదటంతా మెయింటైన్ చేస్తూ… చివరకు కథను మరో దిశలోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు యశ్. వివాహేతర ప్రేమను కథలో మొదట చూపించినా.. చివరకు వివాహ బంధానికే ప్రాధాన్యతనిచ్చి అమితాబ్ తిరిగి తన భార్య శోభ దగ్గరకే వచ్చే సన్నివేశాలతో ముగించాడు.

వివాహేతర, అక్రమ ప్రేమల కంటే కూడా..  వివాహ బంధానిదే విజయమన్నట్టుగా దర్శకుడు సినిమాకు శుభం కార్డ్ వేసి… 1981 నాటి భారతీయ ప్రేక్షకుల సామాజిక, నైతిక అంచనాలకు దగ్గరగా చేస్తూ ముగించాడు. సిల్సిలాను సమాజం విధించే నియమాల మధ్య చిక్కుకున్న ఓ ప్రేమకథగా చూడాల్సి ఉంటుంది.

మరి సినిమా ఆడిందా..?

సిల్సిలా సినిమా తీస్తున్న సమయంలో బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న గాసిప్స్ తో… సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. కానీ, బాక్సాఫీస్ వద్ద యశ్ ఆశించిన స్థాయి విజయమైతే సిల్సిలాకు దక్కలేదు. సినిమాలో అమితాబ్, రేఖ, జయ ముగ్గురిపై జరుగుతున్న ప్రచారం రిఫ్లెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉంటుందా అన్న అంచనా జనంలో నెలకొంది.

అదే ఆ సినిమాపై ఆసక్తిని పెంచింది. దాంతో సినిమాలో కథ కంటే కూడా ఆ అంచనాలే సినిమాను అనుకున్నంత హిట్ చేయలేదేమోనన్న భావన నెలకొంది.

మరి సిల్సిలా ఎందుకు ఇంతకాలం గుర్తుండిపోయింది..?

బాక్సాఫీస్ ఫలితాల్ని పక్కనబెడితే సిల్సిలా ఒక్క విషయంలో మాత్రం విజయం సాధించింది. అప్పటికే బాలీవుడ్ లో ప్రచారంలోకొచ్చిన గాసిప్స్ కు దృశ్యరూపమివ్వడమే ఆ విజయం. అమితాబ్, రేఖ మధ్యనున్న బంధంపై జరుగుతున్న ప్రచారాన్ని.. తెరపై సన్నివేశాలుగా మల్చింది. సంభాషణలతో ఆకట్టుకునే యత్నం చేసింది. పాటలతో అలరించింది. అందుకే దశాబ్దాలు గడిచినా… అమితాబ్, రేఖ ప్రస్తావన వస్తే సిల్సిలా ఫోటోలు, సన్నివేశాలు, పాటలు ఇప్పటికీ సినీ ప్రేమికుల మదిలో మెదులుతూనే ఉంటాయి.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!