Survival crime thriller……
‘నాయట్టు’ (Nayattu) ఇది 2021 నాటి మలయాళ సినిమా. కుంచకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. మలయాళ వెర్షన్ ‘నెట్‌ఫ్లిక్స్‌లో, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘చుండూరు పోలీస్ స్టేషన్’ పేరుతో ఆహా (Aha) లో ఉంది.
మార్టిన్ ప్రక్కాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మన రాజకీయ వ్యవస్థ, పోలీస్ డిపార్ట్మెంట్లోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
కథ ఏమిటంటే ?
ప్రవీణ్ మైఖేల్ (కుంచకో బోబన్), మణియాన్ (జోజు జార్జ్), సునీత (నిమిషా సజయన్) ముగ్గురూ ఒకే పోలీస్ స్టేషన్లో పని చేసే పోలీసులు. ఒక రాత్రి వేళ వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఒక దళిత యువకుడిని ఢీకొడుతుంది, ఆ యువకుడు మరణిస్తాడు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అధికార పక్షం ఈ ముగ్గురు పోలీసులను నిందితులుగా మార్చాలని చూస్తుంది.
వ్యవస్థ తమను బలిపశువులను చేస్తుందని గ్రహించిన ఈ ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతారు. వారిని రాజకీయ నాయకులు, తోటి పోలీసులు ఎలా వేటాడారు (నాయట్టు అంటే మలయాళంలో వేట అని అర్థం) అనేదే మిగతా కథ.
జోజు జార్జ్ ఒక సీనియర్ కానిస్టేబుల్‌గా నిస్సహాయతను అద్భుతంగా పండించారు. కుంచకో బోబన్, నిమిషా సజయన్ తమ నటనతో ప్రాణం పోశారు. ప్రతి ఒక్కరి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. షాహీ కబీర్ అందించిన కథాంశం అత్యంత వాస్తవికంగా ఉంటుంది. ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, ఆ తర్వాత వచ్చే మలుపులతో సాగితే… సెకండాఫ్ మొత్తం ఉత్కంఠభరితమైన చేజింగ్ డ్రామాగా సాగుతుంది.
ఓట్ల కోసం రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కింది స్థాయి పోలీసుల జీవితాలతో ఎలా ఆడుకుంటారో ఇందులో చాలా బోల్డ్‌గా చూపించారు. సినిమా ముగింపు ప్రేక్షకుల గుండెలను పిండేసేలా, వ్యవస్థపై ఒక బలమైన ప్రశ్నను సంధించేలా ఉంటుంది.
ముగ్గురు పోలీసులు రాత్రికి రాత్రే ఊరు విడిచి పారిపోయే సన్నివేశాలు రియలిస్టిక్‌గా, ఉత్కంఠభరితంగా సాగుతాయి.కేరళ లోని మున్నార్ కొండలు, దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక నిర్మానుష్యమైన ఇంట్లో ఈ ముగ్గురు పోలీసులు దాక్కునే సీన్స్ బాగుంటాయి.నిందితులైన పోలీసులు ఏ రూట్లో వెళ్తారు, ఎలా ఆలోచిస్తారు అనేది ఊహిస్తూ తోటి పోలీసులే వీరిని వేటాడే సీన్లు బాగా వచ్చాయి.
మలయాళ సినిమాల సహజ శైలి లాగే సినిమా ఫస్టాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఇది పక్కా రియలిస్టిక్ సినిమా. ఇందులో హీరో ఎలివేషన్లు, ఫైట్లు, డ్యూయెట్లు వంటి కమర్షియల్ హంగులు ఏమీ లేవు. సినిమా మొదటి ముప్పై నిమిషాలు పాత్రల పరిచయం, పోలీస్ స్టేషన్ వాతావరణం, వారి వ్యక్తిగత జీవితాలను చూపించడానికే దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. ఉత్కంఠభరితమైన సస్పెన్స్ కథను ఆశించే వారికి ఈ ప్రారంభ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించవచ్చు.
కథనం మొత్తం ముగ్గురు పోలీసుల చుట్టూనే తిరుగుతుంది. అయితే, ప్రమాదంలో మరణించిన దళిత యువకుడి కుటుంబం ఎదుర్కొనే పరిస్థితులను లేదా రాజకీయ పార్టీల అంతర్గత వ్యూహాలను ఇంకాస్త లోతుగా చూపించి ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ చాలా వాస్తవికంగా, వ్యవస్థలోని నిజాన్ని నిలదీసేలా ఉంటుంది. అయితే, ఇది చూసే ప్రేక్షకుడికి తీవ్రమైన నిరాశను, మనసుకు ఒక రకమైన భారాన్ని మిగుల్చుతుంది. సినిమా ముగింపులో “న్యాయం గెలిచింది” అనే హ్యాపీ ఎండింగ్ ఆశించే వారికి ఇది నిరాశ కలిగిస్తుంది.
ఇదొక ‘వేట’ నేపథ్యం ఉన్న సినిమా అయినప్పటికీ, ఇందులో హాలీవుడ్ తరహా కార్ చేజింగ్‌లు లేదా భారీ యాక్షన్ విన్యాసాలు ఉండవు. కేవలం పోలీసులు దాక్కోవడం, వారిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ చేసే ప్లాన్స్ చుట్టూనే డ్రామా నడుస్తుంది.
అఖిల్ అలెక్స్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ఈ సర్వైవల్ థ్రిల్లర్‌కు ప్రధాన బలంగా నిలిచింది. సినిమాలో ఎక్కడా అనవసరమైన హడావుడి లేకుండా, సీన్లోని మూడ్‌ను ఎలివేట్ చేసేలా చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉండే సంగీతాన్ని అందించారు.
షైజు ఖాలిద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆయన కెమెరా వర్క్ సినిమాకు మంచి లుక్‌ని తీసుకు వచ్చింది. కథ కేరళలోని దట్టమైన మున్నార్ అడవులు, కొండల నేపథ్యంలో సాగుతుంది. అక్కడి లొకేషన్లను, పచ్చదనాన్ని అందంగా చూపిస్తూనే, అదే సమయంలో ఆ అడవి ఎంత ప్రమాదకరమైనదో కెమెరా యాంగిల్స్ ద్వారా భయాన్ని కలిగించారు.
కారెక్టర్ల ముఖాల్లోని నిస్సహాయత, అలసట, భయాన్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగించిన క్లోజప్ షాట్స్ ఆకట్టుకుంటాయి.
కేవలం డ్రోన్ షాట్స్, వైడ్ యాంగిల్ షాట్స్ ద్వారా పోలీసులు ఎంత ఒంటరివారైపోయారో, చుట్టూ ఉన్న పోలీస్ వ్యవస్థ వారిని ఎంత పెద్ద ఎత్తున వేటాడుతుందో విజువల్స్ ద్వారానే కళ్లకు కట్టారు.
మొత్తంగా చెప్పాలంటే, ‘నాయట్టు’ కేవలం ఒక కథగా కాకుండా ప్రేక్షకుడికి ఒక నిజమైన అనుభూతిని ఇవ్వడానికి ఈ సంగీతం, అద్భుతమైన విజువల్స్ ప్రధాన కారణం. మలయాళంలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘కోటబొమ్మాళి పీఎస్’ పేరిట తెలుగులో రీమేక్ చేసారు. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

