Actual angles…………………….
ఆరు దశాబ్దాల క్రిందట కరెంట్ కూడా లేని ఓ పల్లెలో ఎలుక పిల్లలా పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను శిల్పంగా చెక్కుకుంటూ ప్రపంచ స్థాయికి చేరిన రచయిత తుర్లపాటి నాగభూషణ రావు కలం పలికించిన రాగాలే ఈ `జీవన రాగాలు’ పుస్తకం.
రచయితకు 40 ఏళ్ల పైగానే జర్నలిజమే వృత్తి అయినా రచయితగా, నాటక కళాకారునిగా, రేడియో ప్రోగ్రామర్ గా ఎదిగి మీడియాలోని బహు పార్శ్వాలను సృశించిన అనుభవం ఈ పుస్తకంలోని ప్రతి పేజీలో స్పష్టంగా కనబడుతోంది.
పల్లెలు 60ఏళ్ల క్రిందట ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయనీ, ఏదో ప్రాధమిక సౌకర్యాలు తప్ప పల్లెలను ప్రగతి బాటలోకి త్రొక్కించడంలో పాలకులు వైఫల్యం చెందుతున్నారన్నదే రచయిత ఆవేదనలా కనబడుతోంది. రచయిత ఇది తన స్వీయకథ అని చెబుతూనే 1960, 70, 80 దశకాల నాటి సామాజిక , రాజకీయ, ఆర్థిక అంశాలను తనదైన చమత్కార ధోరణిలో చెప్పడం ఈ రచనలో స్పష్టంగా కనబడుతున్నది.
పిల్లల మనస్తత్వం ఎరిగిన రచయిత కావడంతో వారికి స్ఫూర్తిదాయకంగా ఉండే అనేక అంశాలను ఈ రచనలో పొందుపరిచారు. ఐదారు దశబ్దాల క్రిందట పల్లెల్లో పేరుకుపోయిన భయాలు, మూఢనమ్మకాలను చెబుతూనే మరో ప్రక్క సైన్స్ లో పిజీ చేయడంతో వాటి వెనుక ఉన్న వాస్తవ కోణాలను పాఠకులకు తెలియజెప్పి – సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు రచయిత.
ఈ పుస్తకం చదువుతుంటే, స్వీయ కథల రచనలో కొత్త పుంతలు తొక్కినట్లు అనిపిస్తుంది. తుర్లపాటి వ్రాసిన ఈ జీవనరాగాలు భావితరాల వారి జీవితాన్ని ఉన్నత స్థాయిలో నిలిపే వ్యక్తిత్వ వికాస సూత్రాలుగానే ఉన్నాయి.
ఇందులోని 20 అధ్యాయాలకు పెట్టిన శీర్షికలు ( ఉదాహరణకు..ఎలుక పుట్టింది, బక్క కోపం, భయం నీడలో, బెల్ట్ మాష్టారు, చూడు చూడు సినిమా, జై ఆంధ్ర బ్యాచ్, తొలి వేషం) పాఠకులను ఆద్యంతం చదివించేలా ఉన్నాయి.
చిత్రకారులు బ్నిం వేసిన కవర్ పేజీ చూడముచ్చటగా ఉండటమే కాక, రచయిత ఎదుగుదలను వీణపై రాగాలు పలికించారు. `జీవనరాగాలు – 1‘ అని చెప్పడం తో రెండవ భాగం పట్ల కూడా పాఠకులకు ఆసక్తి పెరుగుతుంది. ఈ పుస్తకం ధర : 295
పేజీలు : 272
దొరుకు చోట్లు :
• నవోదయ బుక్ హౌస్, సుల్తాన్ బజార్ కోఠీ, హైదరాబాద్.
• రచయిత (తుర్లపాటి నాగభూషణ రావు) వద్ద: ఫోన్ నెంబర్ 9885292208 (వాట్సప్ )
• వెబ్ సైట్ : achangatelugu.com