Murder Mystery Story………
’12th మ్యాన్’ ఇదొక విలక్షణమైన ఇండోర్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దృశ్యం ఫేమ్ దర్శకుడు జీతూ జోసేఫ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా. 2022లో నేరుగా హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం విడుదలైంది. హాలీవుడ్ క్లాసిక్ ‘పర్ఫెక్ట్ స్ట్రేంజర్స్’ అగాథా క్రిస్టి నవలల ప్రేరణతో ఈ సినిమా తెరకెక్కింది . ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడవచ్చు.
కథాంశం
ఒకరినొకరు బాగా తెలిసిన 11 మంది స్నేహితులు (భార్యాభర్తలు, ప్రేమికులు) ఒక హిల్ స్టేషన్ రిసార్ట్‌లో పార్టీ జరుపుకోవడానికి వస్తారు. సరదాగా గడుపుతున్న సమయంలో, వారు ఒక వినూత్నమైన మొబైల్ గేమ్ ఆడాలని నిర్ణయించుకుంటారు. ఆ గేమ్ రూల్ ప్రకారం—ఆ రాత్రి ఎవరి ఫోన్‌కి ఏ మెసేజ్, కాల్ వచ్చినా మిగిలిన వారందరికి స్పీకర్‌లో పెట్టి వినిపించాలి /చూపించాలి.
ఈ గేమ్ కారణంగా ఆ స్నేహితుల రహస్యాలు,ఒకరిపై ఒకరికి ఉన్న మనస్పర్థలు బయటపడతాయి. ఆ గందరగోళం నడుస్తుండగానే, రాత్రి ఆ గ్రూప్‌లో ఉన్న షైనీ (అనుశ్రీ) అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. అదే రిసార్ట్‌లో తాగుబోతులా తిరుగుతున్న 12వ వ్యక్తి చంద్రశేఖర్ (మోహన్ లాల్) రంగంలోకి దిగుతాడు. అతను ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. అసలు షైనీని చంపింది ఎవరు? ఆ 11 మందిలో దాగున్న ఆ ‘అపరాధి’ని చంద్రశేఖర్ ఎలా పట్టుకున్నాడు? అనేదే మిగిలిన కథ.
సినిమా అంతా మోహన్ లాల్ వన్-మ్యాన్ షో గా నడుస్తుంది. తన విచారణశైలితో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మోహన్ లాల్ జీవించేశారు.ఫస్ట్ హాఫ్‌లో మొబైల్ గేమ్ ఆడే సీన్లు, దానివల్ల పాత్రల మధ్య వచ్చే గొడవలు చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా సాగుతాయి.
ఒకే లొకేషన్‌లో సినిమా జరుగుతున్నప్పటికీ, ఫ్లాష్‌బ్యాక్ సీన్లను చూపించడానికి వాడిన విజువల్ ట్రాన్సిషన్స్ (Transitions) సాంకేతికంగా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంటుంది.
జీతూ జోసేఫ్ మునుపటి సినిమాలా మాదిరి ఇందులో వేగవంతమైన కథనం ఉండదు. ఒకే హాల్‌రూమ్‌లో కూర్చుని అందరినీ ప్రశ్నించే సీన్లు ఎక్కువ అవ్వడం వల్ల కొంత సాగతీతగా అనిపిస్తుంది. సినిమా అంతా మాటలతోనే నడుస్తుంది. ఇదొక విభిన్నమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది. ఒక ‘గేమ్ షో’ చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
ఒకేసారి 11 మంది నటీనటులు స్క్రీన్‌పై ఉండటం, వారి మధ్య సంబంధాల కన్‌ఫ్యూజన్ వల్ల సాధారణ ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం కొద్దిగా కష్టం. ఫస్ట్ హాఫ్‌లో మిత్రుల రహస్యాలను బయటపెట్టే మొబైల్ గేమ్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుండి థ్రిల్ స్టార్ట్ అవుతుంది.
సినిమా ప్రారంభం నుండి రిసార్ట్‌లో అందరితో గొడవపడుతూ, ఒక తాగుబోతులా తిరిగే మోహన్ లాల్ (చంద్రశేఖర్)… హఠాత్తుగా ఒక హత్య జరిగిన తర్వాత తను సస్పెండ్ అయిన డివైఎస్పీ అని ఐడెంటిటీ కార్డు చూపించే సీన్ థ్రిల్ ఇస్తుంది. ఒకే హాల్ రూమ్‌లో 11 మందిని కూర్చోబెట్టి, మోహన్ లాల్ ఒక్కొక్కరిని ప్రశ్నించే సీన్లు సినిమాలో ప్రధాన బలం..అబద్ధాలు చెబుతున్న వారిని తన లాజికల్ ప్రశ్నలతో, పాత మెసేజ్‌ల ఆధారంగా మోహన్ లాల్ కార్నర్ చేసే విధానం ఆకట్టుకుంటుంది.
నిందితులు చెప్తున్న అబద్ధాలను, ఆ రాత్రి అసలు ఏం జరిగిందనే నిజాలను ఒకే ఫ్రేమ్‌లో (అదే రూమ్‌లో క్యారెక్టర్లు నడుస్తూ గతంలోకి వెళ్లినట్లు) విజువలైజ్ చేసిన విధానం సరికొత్తగా ఉంటుంది. దర్శకుడు జీతూ జోసేఫ్ టేకింగ్ ఆకట్టుకుంటుంది.
సినిమా చివరి 15 నిమిషాలు ఊహించని మలుపు తిరుగుతుంది అప్పటివరకు ఒకరిపై అనుమానం ఉంటే, చివర్లో అసలైన హంతకుడు/అపరాధి ఎవరు అనేది బయటపడే సీన్, దానికి మోహన్ లాల్ ఇచ్చే జస్టిఫికేషన్ ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తాయి.
సినిమాలో కెమెరా పనితనం,సంగీతం కథను ముందుకు నడిపించడంలో, ప్రేక్షకులలో సస్పెన్స్ మూడ్‌ను క్రియేట్ చేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించాయి. ఈ చిత్రానికి సతీష్ కురుప్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఒకే రూమ్‌లో అంతమంది పాత్రలను చూపిస్తూ ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేయడంలో ఆయన కెమెరా ట్రిక్స్ అద్భుతంగా పనిచేశాయి.హిల్ స్టేషన్ లోని అందమైన రిసార్ట్, పొగమంచు, రాత్రి వేళల్లోని లొకేషన్లను చాలా రిచ్‌గా చూపించారు.
ఈ సినిమాకు అనిల్ జాన్సన్ సంగీతాన్ని అందించారు. ఇదొక టాక్-షో లాంటి ఇన్వెస్టిగేషన్ సినిమా కావడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కీలకం.ఒక్కో పాత్ర తాలూకూ రహస్యం బయటపడేటప్పుడు, వారి ఫోన్ రింగ్ అయ్యేటప్పుడు వచ్చే మ్యూజిక్ ప్రేక్షకుడిలో ఉత్కంఠను పెంచుతుంది.
మోహన్ లాల్ ఒక్కొక్కరి అబద్ధాలను పట్టుకుంటూ లింకులు కలుపుతున్నప్పుడు వచ్చే బిజిఎం చాలా క్లాసీగా, మైండ్ గేమ్‌కు తగినట్లుగా ఉంటుంది. ఫాస్ట్ మూవీస్ చూసే వారికి ఈ సినిమా అసలు నచ్చదు. సీరియస్ డ్రామా లు చూసే వారికి నచ్చుతుంది.
ఆసక్తి ఉన్నవారు జియో హాట్ స్టార్ లో ఈ సినిమా చూడవచ్చు.

