Second Love……..
‘సెకండ్ లవ్’ ఇదొక రియాలిటీ షో…. ఈ షో కు నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు .ఈ షో కు డిజిటల్ ప్రేక్షకులు, ముఖ్యంగా యువత నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదేసమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి.
లవ్ ఫెయిల్యూర్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్,లేదా విడాకుల వల్ల ఒంటరిగా మారిన కంటెస్టెంట్లు తమ గత చేదు జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకునే విధానం ప్రేక్షకులను కదిలిస్తోంది.
ఈ షోతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ హోస్టింగ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె కంటెస్టెంట్ల బాధలను వింటూ, వారికి ఇచ్చే సలహాలు, ఓదార్పు ఒక గైడ్‌లా చాలా హుందాగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రమోషనల్ పోస్టర్లలో ఆమె సరికొత్త లుక్ కూడా బాగా వైరల్ అయింది.
బిగ్‌బాస్ తమిళ ఫేమ్ శ్రుతికా అర్జున్ క్యూపిడ్ (ప్రేమ రాయబారి) గా హౌస్‌లో చేసే అల్లరి, కామెడీ షోలో ఎమోషన్స్‌తో పాటు మంచి వినోదాన్ని కూడా అందిస్తోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. విల్లాలో ఉండే 12 మంది కంటెస్టెంట్ల మధ్య టాస్కులు, డేట్స్, మధ్యలో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు షోపై ఆసక్తిని (Buzz) రోజురోజుకూ పెంచుతున్నాయి.
మొత్తంగా చెప్పాలంటే, “ప్రేమకు రెండో అవకాశం” అనే ఒక సున్నితమైన అంశాన్ని ఎంచుకోవడంతో ఈ షో JioHotstar లో మంచి వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.గతంలో ప్రేమ విఫలమై, విడాకులు తీసుకుని లేదా పెళ్లిళ్లు పెటాకులై ఒంటరిగా మారిన 30 ఏళ్లు పైబడిన 12 మంది సింగిల్స్ (6 గురు పురుషులు, 6 గురు మహిళలు) ఒక విల్లాలో కలిసి ఉంటారు.
మనసుకైన గాయాలను మాన్పుకుంటూ, తమ జీవితంలో ప్రేమకు ‘రెండో అవకాశం’ ఇచ్చుకోవడానికి ఈ షో వేదికగా నిలుస్తుంది.కంటెస్టెంట్లు అందరూ ఒక లగ్జరీ విల్లాలో కలిసి గడుపుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలుగా విభిన్నమైన ఎమోషనల్ టాస్కులు, సంభాషణలు,డేటింగ్స్ ఉంటాయి.
ఈ షో జులై 13, 2026 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇది ఓటీటీలోనే కాకుండా స్టార్ విజయ్ (Star Vijay) టెలివిజన్ ఛానల్లో కూడా ప్రసారమవుతుంది. ఇది తమిళ షో అయినప్పటికీ, పాన్-ఇండియా వీక్షకుల కోసం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్స్ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్నాయి.
ఒక షోలో.. కంటెస్టెంట్‌గా వచ్చిన మలయాళ, తమిళ టీవీ నటి మోనిషా సి.ఎస్ తన గత వైవాహిక జీవితం గురించి పంచుకున్న విషయాలు ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఎనిమిదేళ్ల బంధం తర్వాత విడాకులు తీసుకున్న ఆమె, తన మాజీ భర్త నుండి ఎదుర్కొన్న దారుణమైన మానసిక, శారీరక వేధింపుల గురించి వివరిస్తూ షోలో కన్నీళ్లు పెట్టుకుంది.
తన మాజీ భర్త సైకోలా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించింది. చిన్న చిన్న కారణాలకే గొడవ పడటమే కాకుండా, ఆమెకు తెలియకుండానే ఆమె ప్రైవేట్ ఫోటోలను తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు పాల్పడేవాడని మోనిషా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాటలు సంచలనం రేపాయి. ముందు ముందు మరి కొందరు తారలు ఈషో లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
విమర్శలు ……
ఈ షో MTV స్ప్లిట్స్‌విల్లా’ లేదా ‘లవ్ ఐలాండ్’ వంటి విదేశీ డేటింగ్ షోల తరహాలో ఈ ప్రదర్శన ఉందనే విమర్శలున్నాయి. భారతీయ కుటుంబ విలువలు, సంప్రదాయాలకు ఈ విధమైన ఓపెన్ డేటింగ్ కాన్సెప్ట్‌లు విరుద్ధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షోలోని కొన్ని సన్నివేశాలు, కంటెస్టెంట్ల ప్రవర్తన చాలా కృత్రిమంగా అనిపిస్తోందని అంటున్నారు. ఇది కేవలం టీఆర్పీ రేటింగ్‌ల కోసం ముందే రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం నడుస్తోందని ఆరోపణలు లేకపోలేదు.

