Mystery drama……..
‘కాంత’ (Kaantha) ఇదొక పీరియాడికల్ మిస్టరీ డ్రామా. దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా 14 నవంబర్ 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.ప్రస్తుతం Netflix లో స్ట్రీమింగ్ అవుతోంది.
క్లుప్తంగా కథ ……
ఈ సినిమా కథ 1950ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ నేపథ్యంలో సాగుతుంది. ‘నట చక్రవర్తి’గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో టీకే మహదేవన్ (దుల్కర్ సల్మాన్) చుట్టూ కథ తిరుగుతుంది. అప్పట్లో ప్రముఖ దర్శకుడైన ‘అయ్య’ (సముద్రఖని) కలల ప్రాజెక్ట్ అయిన ‘శాంత’ అనే సినిమా షూటింగ్ సజావుగా సాగుతున్న సమయంలో ఒక అనూహ్యమైన మలుపు చోటుచేసుకుంటుంది. ఆ తర్వాత మహదేవన్ జీవితం, సినిమా భవిష్యత్తు ఏమైందనేదే మిగిలిన కథ.
నటుడిగా దుల్కర్ సల్మాన్ వన్-మ్యాన్ షో అని చెప్పొచ్చు. స్టార్డమ్, అహంకారం, భయం, మానసిక సంఘర్షణ వంటి పలు రకాల షేడ్స్ ఉన్న ‘మహదేవన్’ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. దర్శకుడి పాత్రలో సముద్రఖని నటన పోటాపోటీగా సాగింది.
1950ల కాలం నాటి లుక్‌లో భాగ్యశ్రీ బోర్సే అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగానూ ఆకట్టుకుంది. సినిమా సెకండాఫ్‌లో వచ్చే పోలీస్ ఆఫీసర్ పాత్రను రానా దగ్గుబాటి పోషించారు. ఆయన విచారణ శైలి విభిన్నంగా సాగుతుంది.
సినిమా మొదటి భాగం1950ల నాటి స్టూడియో వాతావరణం, సినిమా లోపల సినిమా మేకింగ్ ప్రాసెస్‌తో చాలా ఆసక్తికరంగా, అద్భుతమైన డ్రామాతో సాగుతుంది.ఫస్టాఫ్‌లో ఉన్నంత బిగువు సెకండాఫ్‌లో లోపించింది. కథ డ్రామా నుంచి మిస్టరీ/థ్రిల్లర్‌గా మారిన తర్వాత కొన్ని సీన్లు రిపీటెడ్‌గా అనిపిస్తాయి.
పీరియాడిక్ డ్రామా కావడం వల్ల సినిమా నడక నెమ్మదిగా సాగుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్, వేగవంతమైన యాక్షన్ ఆశించే ప్రేక్షకులకు బోర్ కొట్ట వచ్చు. ముగింపు భాగాన్ని ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది,కొన్ని చోట్ల కథనం నెరేషన్ పరంగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది.
ఈ సినిమా కథ తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మొట్టమొదటి సూపర్ స్టార్ ఎమ్. కె. త్యాగరాజ భాగవతార్ జీవితం నుండి ప్రేరణ పొంది రాసుకున్నారు. దుల్కర్ సల్మాన్ పోషించిన ‘టి.కె. మహదేవన్’ పాత్రకు, నిజ జీవితంలో భాగవతార్ ఎదుర్కొన్న కొన్ని కీలక సంఘటనలకు దగ్గరి పోలికలు ఉన్నాయి.
1930, 40ల కాలంలో త్యాగరాజ భాగవతార్ ఎంతటి అగ్ర హీరో అంటే, ఆయన నటించిన ‘హరిదాస్’ (1944) అనే సినిమా ఒకే థియేటర్‌లో వరుసగా 114 వారాల పాటు (దాదాపు మూడేళ్లు) ఆడింది. ఆయన విలాసవంతమైన జీవితాన్ని గడిపారు.
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో 1944లో ఒక సంచలన హత్య కేసులో (లక్ష్మీకాంతన్ హత్య కేసు) ఆయన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. మూడేళ్ల తర్వాత కోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, అప్పటికే ఆయన కెరీర్, సంపద, స్టార్‌డమ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత ఆయన కోలుకోలేకపోయారు.
ఈ సినిమా విడుదలైనప్పుడు భాగవతార్ మనవడు కోర్టును ఆశ్రయించారు. తమ తాతగారి జీవితాన్ని తప్పుగా చూపించారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, హీరో దుల్కర్ సల్మాన్, దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ విషయంపై స్పందిస్తూ, “ఇది పూర్తి బయోపిక్ కాదు, ఆయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగా రాసుకున్న ఒక కాల్పనిక (Fictional) క్రైమ్ థ్రిల్లర్ కథ మాత్రమే” అని స్పష్టం చేశారు.
అయ్య’ (Ayya) దర్శకుడి పాత్రకు కూడా బలమైన నిజ జీవిత ప్రేరణలు ఉన్నాయి. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ పాత్రను కేవలం ఒక్కరిని మాత్రమే చూసి కాకుండా, 1940లు – 50ల నాటి క్లాసిక్ తమిళ సినీ పరిశ్రమలోని కొందరు దిగ్గజ దర్శకుల జీవితాల ఆధారంగా మలిచారు.
1950ల కాలంలో దర్శకులు సరికొత్త నటీనటులను పరిచయం చేసి వారిని స్టార్స్ లాగా తీర్చిదిద్దేవారు. అయితే ఆ నటుడికి విపరీతమైన స్టార్‌డమ్ వచ్చాక, గురువును మించిపోయాననే అహంకారం తలకెక్కినప్పుడు.. గురుశిష్యుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరిగేవో ఈ పాత్ర ద్వారా చూపించారు.
నటుడు త్యాగరాజ భాగవతార్‌ను స్టార్‌గా నిలబెట్టిన నాటి పాతకాలపు దర్శకుల జీవితాల్లోని సంఘర్షణలను, వారి సినిమా పిచ్చిని కలిపి ఈ ‘అయ్య’ పాత్రను ఒక కల్పిత రూపంలో తెరపైకి తెచ్చారు. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఈ పాత్రల ద్వారా కేవలం ఒక వ్యక్తి బయోపిక్‌ను కాకుండా, “సినిమా గ్లామర్ వెనుక ఉండే చీకటి కోణాలు, మనుషుల అహాల మధ్య జరిగే సంఘర్షణ అనే అంశాన్ని ప్రధానంగా చూపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆ ఘర్షణ కనిపిస్తుంది.
1950ల నాటి పాత మద్రాస్ స్టూడియోల వాతావరణాన్ని, లైటింగ్ ప్యాటర్న్స్‌ను తలపించేలా స్పానిష్ సినిమాటోగ్రాఫర్ డాని శాంచెజ్ లోపెజ్ విజువల్స్ అందించడం ఈ డ్రామాకు మరింత బలాన్ని ఇచ్చింది
ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలానికి తీసుకెళ్లే ఆర్ట్ వర్క్, కలర్ టోన్, కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉన్నాయి.
జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. ‘కాంత’ కమర్షియల్ మసాలా సినిమా కాదు.. పీరియడ్ మిస్టరీ డ్రామా. నటుడిగా దుల్కర్ సల్మాన్ నటనను, 1950ల నాటి క్లాసిక్ సినిమా వాతావరణాన్నిఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. స్లో నరేషన్‌ను భరించగలిగితే ఖచ్చితంగా ఒకసారి చూడదగ్గ చిత్రం.

