‘డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో’ కథ ఏమిటి ?

Sharing is Caring...

World famous bronze statue……….

“డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో” అనేది సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి సింధు లోయ నాగరికత కు చెందిన  ప్రపంచ ప్రసిద్ధ కాంస్య విగ్రహం. ఈ చిన్న విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది.క్రీ.పూ. 2300 – 1750 కాలానికి చెందిన పురాతన నగరం మొహంజొదారో (ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో ఉంది) లో పురావస్తు త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ విగ్రహం బయటపడింది.

1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అర్నెస్ట్ మెక్కే (Ernest Mackay) మొహంజొదారోలోని ఒక శిథిల గృహంలో జరిపిన త్రవ్వకాల్లో ఈ అపురూప విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని మొదట పరిశోధించిన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అప్పటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ దీనికి “డాన్సింగ్ గర్ల్” అని పేరు పెట్టారు. 

ఈ విగ్రహం నిలబడి ఉన్న భంగిమ ఆయనకు అప్పట్లో రాజాస్థానాలలో నృత్యాలు చేసే ‘నాట్యగత్తె’ ల హావభావాలను గుర్తుకు తెచ్చింది. ఆమె రెండు కాళ్లు కాస్త వంగి, ఒక చేయి నడుముపై పెట్టుకుని నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పేరు స్థిరపడిపోయింది.

కేవలం 10.5 సెంటీమీటర్ల (దాదాపు 4 అంగుళాలు) ఎత్తు మాత్రమే ఉండే ఈ చిన్న విగ్రహం నాటి సమాజం ఉన్నత సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సుమారు 15 ఏళ్ల వయసున్న ఒక యువతి, తల స్వల్పంగా వెనక్కి వాల్చి, నిస్సంకోచంగా, ఎంతో ఆత్మవిశ్వాసంతో నిలబడినట్లు ఉంటుంది.

ఈమె దిగంబరంగా ఉన్నప్పటికీ శరీరంపై విలువైన ఆభరణాలు ఉన్నాయి. మెడలో మూడు ముత్యాల లాంటి పూసలున్న హారం ఉంది.ఆమె ఎడమ చేతి నిండా పైవరకు గాజులు ఉంటే, కుడి చేతికి మాత్రం కేవలం 4 గాజులు మాత్రమే ఉన్నాయి. కుడి చేతిని వయ్యారంగా నడుముపై ఉంచుకోగా, ఎడమ చేయి క్రిందికి వాలి ఉంది. జుట్టును చక్కగా ముడి వేసి భుజంపై వేసుకుంది. 

ఆ కాలంలోనే లోహాలను కరిగించి విగ్రహాలు తయారు చేసే అత్యంత అధునాతనమైన “లాస్ట్-వాక్స్ కాస్టింగ్” (Lost-Wax Casting) పద్ధతిని సింధు ప్రజలు వాడారని ఈ విగ్రహం నిరూపించింది. 4,500 ఏళ్ల క్రితమే భారత ఉపఖండంలో నృత్యం, సంగీతం వంటి కళలకు, స్త్రీలకు సమాజంలో ఉన్నతమైన, స్వేచ్ఛాయుతమైన స్థానం ఉండేదనడానికి ఇది ఒక తిరుగులేని ఆధారం.

1947లో దేశ విభజన జరిగినప్పుడు భారత్-పాకిస్తాన్ మధ్య ఈ విగ్రహం ఎవరికి దక్కాలనే వివాదం నడిచింది. చివరకు ఒప్పందం ప్రకారం ఇది భారతదేశానికి కేటాయించబడింది. ప్రస్తుతం ఈ ఒరిజినల్ విగ్రహం ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో భద్రపరచబడి ఉంది. 

‘డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహంజొదారో’ అనేది కేవలం ఒక కంచు బొమ్మ కాదు; అది వేల ఏళ్ల క్రితమే భారతదేశం కళలు, విజ్ఞానం,  నాగరికతలో ఎంతటి ఉన్నత శిఖరాలను అందుకుందో ప్రపంచానికి చాటిచెప్పిన ఒక చారిత్రక సత్యం.

ఇటీవల  క్లాస్ 9 ఆర్ట్స్ టెక్స్ట్‌బుక్‌లో మొహంజొదారో నాట్యగత్తె  అసలు బొమ్మ లో నగ్నంగా ఉన్న భాగాన్ని, NCERT డిజిటల్‌గా షేడింగ్ చేసి “బట్టలు వేసినట్లు” చూపించింది.దీనిపై దేశవ్యాప్తంగా చరిత్రకారులు, విమర్శకులు మండిపడ్డారు. 

“ఒక చారిత్రక విగ్రహం ఎలా ఉందో అలాగే చూపించాలి. దానికి బట్టలు తొడగడం అంటే చరిత్రను వక్రీకరించడమే,  విద్యార్థులకు తప్పుడు అబద్ధపు విజ్ఞానాన్ని (Fake Artefact) అందించడమే” అని విమర్శించారు. తీవ్రమైన విమర్శలు, ఒత్తిడి రావడంతో NCERT  వెనక్కి తగ్గింది. అసలు ఫోటోనే ఉంచుతామని అధికారికంగా ప్రకటించింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!