మూడు తెలుగు దేశం పార్టీల కథ!

Sharing is Caring...

సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటినుంచి ఎన్టీఆర్ అల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు,మరికొందరు నేతలు చేసిన కృషి ఎంతో ఉంది. ఆనాటి తెలుగు దేశం ఈనాటికి అలాగే ఉన్నప్పటికీ నాటినేతలు చాలామంది లేరు. తర్వాత కాలంలో మరో మూడు తెలుగుదేశం పార్టీలు పుట్టుకొచ్చాయి. అయితే అవేవి ఎక్కువ కాలం నిలబడలేదు. వాటి గురించి తెలుసుకుందాం. 

1. “నాదెండ్ల తెలుగు దేశం” ….. 

తెలుగు దేశం పార్టీ 83 లో అధికారంలో కొచ్చిన  ఏడాదన్నర  కాలంలోనే ఎన్టీఆర్ … పార్టీలో నంబర్ 2 గా ఉన్న నాదెండ్ల బాస్కరరావు ల మధ్య విభేదాలొచ్చాయి. కాంగ్రెస్ సహాయంతో  ఎన్టీఆర్ ను పీఠం నుంచి దింపేసి,ముఖ్యమంత్రిగా నాదెండ్ల పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. “నెలరోజుల సీఎం ” అంటూ అప్పట్లో ఆయనపై చలోక్తులు కూడా వెల్లువెత్తాయి.

అప్పటి ప్రతిపక్షాల సహాయంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగి … నాదెండ్లను పదవి నుంచి తప్పించి ఎన్టీఆర్  మళ్ళీ తన పదవిని దక్కించుకున్నారు.  చరిత్రలో అదొక రికార్డు.  ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ సంగతి అటోఇటో తేల్చాలని ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు  “ప్రజాస్వామ్య తెలుగుదేశం”.  1985 ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని ఆయన రాష్ట్రమంతా తిరిగాడు. 220 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపారు.

అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం గొప్ప విషయమే.  ప్రచారం కూడా భారీగానే  చేశారు. ఆయన ప్రచార సభలకు జనం పెద్ద ఎత్తున వచ్చారు. అయితే ఓట్లు మాత్రం వేయలేదు. నాదెండ్ల భాస్కరరావు మలక్‌పేట నుంచి పోటీ చేసినా గెలవ లేకపోయారు. కేవలం రెండే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాయి . ఆ తర్వాత కొంత కాలానికి నాదెండ్ల మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. 

 2. “లక్ష్మీపార్వతి తెలుగు దేశం” …..

అల్లుడు చంద్రబాబు తెలుగు దేశం పార్టీని లాగేసుకున్నాక  ఎన్టీఆర్ ఒక పార్టీ పెట్టాలనుకున్నారు. ఆ విషయంపై చర్చలు జరుగుతుండగానే ఎన్టీఆర్ కన్నుమూసారు. దాంతో కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరిట స్థాపితమైంది. లక్ష్మి పార్వతి ఆ పార్టీకి అధ్యక్షురాలు కాగా అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి బయటికొచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనారు.

చంద్రబాబు వెంట వెళ్లకుండా ఎన్టీఆర్ తో ఉన్న 34 మంది ఎమ్మెల్యేలు వీరి వెంట ఉన్నారు. అపుడే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పార్టీ నేతలు  అభ్యర్థులు గా సింహం గుర్తు తో బరిలోకి దిగారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు  జయకృష్ణ శ్రీకాకుళం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జయకృష్ణకు 199700 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఎర్రం నాయుడికి 234278 ఓట్లు వచ్చాయి. 34,578 ఓట్ల ఆధిక్యతతో ఎర్రంనాయుడు గెలిచారు. ఇక బుచ్చయ్య చౌదరి, నెహ్రు,ముద్దుకృష్ణమ నాయుడు వంటి నేతలు లోకసభ బరిలోకి పార్టీ తరపున పోటీచేశారు. వీరెవరూ కూడా ఆ ఎన్నికల్లొ గెలవలేదు.

అయితే 42 స్థానాల్లో ఆ పార్టీకి దాదాపు 33 లక్షల ఓట్లు వచ్చాయి. ఎన్నికల సందర్భంగా దగ్గుబాటిపై లక్ష్మీపార్వతి వర్గీయులు కొన్ని విమర్శలు  చేశారు.దీంతో దగ్గుబాటి మనస్థాపం చెంది ఆ పార్టీకి దూరంగా జరిగారు. 96 లోనే పాతపట్నం అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో లక్ష్మీపార్వతి పోటీ చేసి గెలిచారు.  99 ఎన్నికల్లో లక్ష్మి పార్వతి సోంపేట , ఏలూరు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో చాలా కాలం పార్టీ కార్యాలయాన్ని నిర్వహించారు. పార్టీకి ఆదరణ అంతంత మాత్రంగా ఉండటంతో నేతలంతా తలోదారి చూసుకున్నారు.

3. హరికృష్ణ “అన్న తెలుగు దేశం” ….

ఇక ఎన్టీఆర్ కుమారుడు  హరికృష్ణ కూడా 1998 జనవరిలో లో చంద్రబాబుతో విబేధించి “అన్న తెలుగుదేశం ” పేరిట  పార్టీ ని స్థాపించారు. ఆ పార్టీలో ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చేరారు. అప్పట్లో రాజ్యసభ సభ్యులుగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా చేరారు. హరికృష్ణ  చైతన్య రధం వేసుకుని  రాష్ట్రమంతా తిరిగారు.హరి గర్జన పేరిట సభలు ఏర్పాటు చేసి  వీరావేశంతో ప్రసంగాలు ఇచ్చారు.

చంద్రబాబును ఎన్నికల సభల్లో తూర్పారా పట్టారు. జనం హరి సభలకు పెద్ద ఎత్తున వచ్చారు. హరి 191 సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపారు. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. హరికృష్ణ స్వయంగా గుడివాడలో పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు.

ఎన్టీఆర్ కే కాదు హరికృష్ణ కు కూడా గుడివాడ సొంత నియోజకవర్గం. అప్పట్లో కొడాలి నాని పార్టీ నేతగా  పనిచేశారు. కానీ ఓటర్లు ఎన్టీఆర్ కొడుకు అని కూడా చూడకుండా ఓడించారు. తర్వాత పార్టీ మూసేసి కొంతకాలం తర్వాత మళ్ళీ చంద్రబాబు వద్దకు వెళ్లి తెలుగుదేశంలో చేరాడు.  అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం 181 సీట్లతో అధికారంలోకొచ్చింది. మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యారు. 

ఫైర్ బ్రాండ్ లీడర్ రేణుకా చౌదరిని ఎన్టీఆర్ సస్పెండ్ చేసినపుడు  ఆమె కూడా  ‘తెలుగుదేశం పార్టీ 2’ ని పెడుతున్నట్టు చెప్పారు. లాంతరు గుర్తుతో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినట్టు సమాచారం.అయితే సానుకూల ఫలితాలు సాధించలేకపోయారు.  రాజ్యసభలో తనను ఆపార్టీ సభ్యురాలిగా చూడాలని స్పీకర్ కు లేఖ ఇచ్చారు.  చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక  మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రెండోసారి రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా కూడా చేశారు. అదే రీతిలో ఎంపీ ఉపేంద్ర కూడా తనను టీడీపీ ప్రత్యేక సభ్యుడిగా చూడాలని కోరారు. 

———— KNM 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!