Crime drama……..
‘సిబిఐ 5: ది బ్రెయిన్’ (CBI 5: The Brain) అనేది లెజెండరీ యాక్టర్ మమ్ముట్టి సిబిఐ ఆఫీసర్ ‘సేతురామ అయ్యర్’గా నటించిన ఐకానిక్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్‌లోని ఐదవ చిత్రం. ఈ సినిమాకు కె. మధు దర్శకత్వం వహించారు. ఇది పూర్తిగా క్రైమ్ డ్రామా,కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు..హీరోయిన్,డ్యూయెట్స్ లేవు. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది.2022 నాటి సినిమా ఇది.
కథ ఏమిటంటే ?
కేరళ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అబ్దుల్ సమద్ ఢిల్లీ నుండి కేరళకు వస్తుండగా విమానంలో అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఈ మరణం చుట్టూ రాజకీయ కోణాలు వెలుగుచూస్తుండగానే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక జర్నలిస్ట్, మినిస్టర్ వ్యక్తిగత డాక్టర్, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ వరుసగా హత్యకు గురవుతారు.
ఈ హత్యలన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయని గ్రహించిన ప్రభుత్వం విచారణను ‘సేతురామ అయ్యర్’ (మమ్ముట్టి) నేతృత్వంలోని సిబిఐ బృందానికి అప్పగిస్తుంది. ఫైట్స్ లేకుండా, కేవలం తన మేధస్సుతో అయ్యర్ ఈ ‘బాస్కెట్ కిలింగ్స్’ (Basket Killings) మిస్టరీని ఎలా ఛేదించాడనేదే మిగతా కథ.
దాదాపు 34 ఏళ్ల క్రితం (1988లో) ప్రారంభమైన ఈ పాత్రను మమ్ముట్టి అదే గంభీరతతో పండించారు. చేతులు వెనక్కి పెట్టుకుని నడిచే ఆయన పాత శైలి, విలక్షణమైన డైలాగ్ డెలివరీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
నేరపూరిత మనస్తత్వం గల వ్యక్తి వేర్వేరు వ్యక్తులను ఒకే వ్యూహంతో చంపే ‘బాస్కెట్ కిలింగ్స్’ అనే కొత్త సబ్జెక్ట్‌ను ఎంచుకోవడం తో కథ ఆసక్తికరంగా సాగుతుంది. 1980ల నాటి స్క్రీన్‌ప్లే పద్ధతులనే దర్శకుడు ఇప్పుడూ వాడటం వల్ల, నేటి తరం సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూసే ప్రేక్షకులకు ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్డ్‌గా అనిపిస్తుంది.
సినిమా మొదటి భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా డైలాగ్స్ రూపంలోనే జరగడం వల్ల కథ లో ఉత్కంఠ లోపించింది.శ్యామ్ కంపోజ్ చేసిన పాత క్లాసిక్ సిబిఐ థీమ్ మ్యూజిక్‌ను ఈ చిత్రంలో జేక్స్ బిజోయ్ రీమిక్స్ చేసిన విధానం, అది స్క్రీన్‌పై వచ్చే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా అఖిల్ జార్జ్ వ్యవహరించారు. ఇన్వెస్టిగేషన్ డ్రామా, ఇండోర్ సీన్లతో సాగుతుంది. కథకు అవసరమైన గంభీరమైన మూడ్‌ను ఎలివేట్ చేయడానికి ఆయన లో-లైటింగ్, టెక్నికల్ షాట్స్‌ను అద్భుతంగా ఉపయోగించారు. నటీనటులందరూ బాగా నటించారు.
సినిమా చివరి వరకు ఈ హత్యల వెనుక ఏదో పెద్ద పొలిటికల్ మాఫియా లేదా విదేశీ శక్తులు ఉన్నాయని అందరూ భావిస్తారు. ఈ వరుస హత్యలన్నింటినీ వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారి ఐపీఎస్ ఆఫీసర్ (నటుడు అనూప్ మీనన్).అని తేలిపోతుంది.
హవాలా కుంభకోణం, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి, హోమ్ మినిస్టర్ పేస్‌మేకర్‌ను హ్యాక్ చేయించి డిజిటల్ పద్ధతిలో హత్య చేయించారని ఆరోపణతో ఐపీఎస్ ఆఫీసర్ ను అరెస్ట్ చేస్తారు.ఇతనికి సహకరించిన కిల్లర్ మేజో పాత్రలో విలక్షణ నటుడు సౌబిన్ షాహిర్ తనదైన శైలిలో నటించాడు.
ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌కు క్లైమాక్స్ అనేది ప్రాణం. కానీ ఈ సినిమాలో హంతకుడిగా చూపించిన పాత్ర, అందుకు ఆపాదించిన కారణాలు అంత బలంగా లేకపోవడంతో ప్రేక్షకుడు పూర్తిగా సంతృప్తి చెందలేడు. ప్రస్తుతం ఈ సినిమాప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో లభ్యమవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. యూట్యూబ్ లో కూడా ఉంది.

