పేపర్ చదవకపోయినా ఆయనకు సామాజిక స్పృహ ఎక్కువే !!

Sharing is Caring...

Mani Bhushan ……….

ఎన్.టి.రామారావు రాజకీయ జీవితం ప్రస్తావనకు రాగానే… తెలిసినోడు తెలియనోడు చెప్పే మాట ఒకటుంది. ‘‘ఎన్టీవోడు ఏ రోజునా న్యూస్ పేపర్ చదివి ఎరగడు. ఆయనకు రాజకీయాలేం తెలుసు. అంతా గాలివాటం’’ అనేస్తారు. మనలో మన మాట… అసలు సంపాదకులే తమ న్యూస్ పేపర్ పూర్తిగా చదవరు. ఎలా చదవగలరు!

పొద్దున లేచిన దగ్గర్నుంచి అన్నీ పితూరీలు, పంచాయతీలే సాగుతుంటాయి. ఎడిటర్ గారు ఎవరైనాగానీ, కంపారిజన్ కోసం ఇతర పత్రికలు తిరగేస్తారు (చదవరు). సంపాదకులు అనుభవించే వత్తిడి అంతా ఇంతా కాదు. పొగిడేవాళ్లు పుంజీడు, తెగనాడేవాళ్లు తట్టెడు అన్నట్లుంటది ఎడిటర్ స్థానం.

అయినప్పటికీ ఎడిటర్ గారికి ఏమీ తెలీదు అనేయలేం. జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఆర్థిక సామాజిక రాజకీయ అంశాల మీద పూర్తి పట్టుతో ఉంటారు. సాయంత్రానికల్లా రేపటి మార్పులు చేర్పులపై క్లియర్ పిక్చర్ రాబడతారు. ఇదంతా వాళ్లకున్న సామాజిక పరిజ్ఞానం, రాజకీయ సంబంధాల ఆధారంగా జరిగే నిరంతర ప్రక్రియ..ఎన్.టి.రామారావు కూడా అంతే!

పొద్దున్నే ‘ది హిందు’ పత్రిక ముందేసుకుని మొత్తం16–24 పేజీలు మాస్టర్ హెడ్ నుంచి ఇంప్రింట్ వరకూ చదివేసే బాపతు కాదు. పక్కా ప్రణాళికతో ఏడాదికి 10–12 సినిమాలు విడుదల చేసిన పని రాక్షసుడు ఎన్టీఆర్. నిర్మాతగా, నటుడుగా, కథా రచయితగా, దర్శకుడుగా, ఒక పె…ద్ద కుటుంబానికి పెద్దగా అనేక భూమికలు ఏక కాలంలో నిర్వహించగలిగారు ఎన్టీఆర్.

పేపర్ చదవనంత మాత్రాన ఎన్.టి.రామారావుకి సామాజిక స్పృహ లేదని, ఏపి పాలిటిక్స్ గురించి పరిజ్ఞానం లేదని అనుకోవడం వెర్రిబాగులతనం. సినిమాల్లో 1949లో ప్రవేశిస్తే… 1952లో రాయలసీమ కరవుపై స్పందించారు. కేవలం మూడేళ్లలోనే సినీ నటుల్ని సమీకరించి చందాలు వసూలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్.

ఆయన తన సినీ కెరీర్లో యుద్ధ సహాయార్థం, దివిసీమ సహాయార్థం, పోలీసుల సంక్షేమార్థం అనేకమార్లు స్పందించారు. తెలుగు సినీ రంగాన్ని కదిలించారు. ఇవన్నీ చేయడానికి పొద్దున్నే న్యూస్ పేపర్ చదవనక్కరలేదు. సామాజిక స్పృహ ఉంటే చాలు.

ఎన్.టి.రామారావు తన హయాం (1983–84,84–85, 85–89, 1994–95)లో… తిరుగులేని సంక్షేమ పథకాలు, సామాజిక నిర్ణయాలు తీసుకున్నారు. అనేక మార్పులు తీసుకొచ్చారు. అవన్నీ అనితర సాధ్యమైనవి, ఏ పార్టీ వచ్చినా మార్చలేనివి. రెండు రూ.లకు కిలో బియ్యం, మునసబ్–కరణాల (పటల్ పట్వారీల) వ్యవస్థ రద్దు.

నిరుపేదలకు పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు, ఆలయ నిర్వహణలో సంస్కరణలు, సంపూర్ణ మద్య నిషేధం, తిరుమలలో నిత్యాన్నదానం, తిరుమలను పవిత్ర స్థలంగా తీర్చి దిద్దడం వంటి వినూత్న పథకాలు, కార్యక్రమాలు, బిసిలకు రాజకీయ ప్రాధాన్యం, అవకాశాలు వంటివి చాలా చేపట్టి ప్రజాదరణ పొందగలిగారు.

జన రంజక పాలనకోసం న్యూస్ పేపర్ రీడింగ్ ఉండనక్కర లేదు. ప్రజా సంబంధాలు పుష్కలంగా ఉండాలి.

 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!