ఆమెను వందల మంది కి అమ్మేసిన ప్రియుడు !!

Sharing is Caring...

Inhuman incident……………

ఫ్రాన్స్‌లో ఒక మాజీ బ్యాంక్ మేనేజర్ తన ప్రేయసిని దారుణంగా హింసిస్తూ, బలవంతంగా వ్యభిచారంలోకి దించి వందల మందికి విక్రయించిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఈ కేసును విచారించిన ఫ్రాన్స్ కోర్టు సదరు నిందితుడికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

ఫ్రాన్స్‌కు చెందిన గిల్లౌమ్‌ బూచి (Guillaume Bucci – 51) అనే మాజీ బ్యాంక్ మేనేజర్, తన మాజీ భాగస్వామి  మహిళపై ఈ దారుణానికి ఒడిగట్టాడు.వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఆమెను మానసికంగా, శారీరకంగా పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకున్నాడు. బెల్టులు, వైర్లతో కొడుతూ తీవ్రంగా హింసించేవాడు.

క్రమక్రమంగా ఆమెను పూర్తిగా తన బానిసగా మార్చుకుని ఆన్‌లైన్ ద్వారా పరిచయమైన అపరిచితులు,తన స్నేహితులు, సహోద్యోగులకు ఆమెను తార్చాడు.ఆమెతోనే ఆ క్లయింట్ల లిస్ట్‌ను రాయించేవాడు.

కోర్టు విచారణలో బాధితురాలు మాట్లాడుతూ, “నేను 487 మంది పురుషుల వరకు లెక్కపెట్టాను, ఆ తర్వాత లెక్కించడం మానేశాను. లోపల నేను రోజురోజుకూ చచ్చిపోతున్నట్లు అనిపించేది” అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమెకు డెలివరీ అయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే ఒక లారీ డ్రైవర్‌తో బలవంతంగా వ్యభిచారం చేయించాడని కోర్టులో రుజువైంది.

ఫ్రాన్స్‌లో గతంలో సంచలనం సృష్టించిన గిసెల్ పెలికాట్ (Gisele Pelicot) అనే మహిళా ఐకాన్ కేసు నుండి స్ఫూర్తి పొంది, ఈమె రహస్య విచారణను తిరస్కరించి, బహిరంగంగా కోర్టుకెళ్లి నిందితుడికి శిక్ష పడేలా చేసింది.

కోర్టు విచారణలో బాధితురాలు సమర్పించిన బలమైన సాక్ష్యాధారాలు  కారణంగానే నిందితుడు గిల్లౌమ్‌ బూచి తప్పించుకోలేకపోయాడు. నిందితుడు కోర్టులో వాదిస్తూ, ఇవన్నీ కేవలం ఇద్దరి సమ్మతితో జరిగిన లైంగిక క్రీడలు  అని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించాడు.

అయితే, బాధితురాలిని భయపెట్టడానికి నిందితుడు పంపిన వందలాది టెక్స్ట్ మెసేజ్‌లు, వాయిస్ నోట్స్‌ను కోర్టు ముందు సాక్ష్యంగా పెట్టారు. “నేను చెప్పినట్లు వినకపోతే చంపేస్తా” అని అతను పంపిన బెదిరింపు సందేశాలు, ఆమె ఇష్టపూర్వకంగా కాకుండా ప్రాణభయంతోనే ఇదంతా చేసిందని నిరూపించాయి.

నిందితుడు బూచి, తన మాజీ ప్రేయసి వద్దకు ఎవరెవరు వస్తున్నారో… ఆ పురుషుల వివరాలను డైరీ లేదా ఒక లిస్ట్‌ రూపంలో రాయించేవాడు. ఆ 487 మంది క్లయింట్ల జాబితా (డైరీ రికార్డ్స్) కోర్టుకు కీలకమైన ఆధారంగా మారింది.

ఏడేళ్ల పాటు  బెల్టు దెబ్బలు, వైర్లతో కొట్టడం, కాల్చడం, గొంతు నులమడం వల్ల బాధితురాలి శరీరం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం ఆమె శాశ్వత అంగవైకల్యంతో  బాధపడుతోంది. ఈ శారీరక నష్టానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు అతను చేసిన క్రూరత్వానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి.

బాధితురాలు తనను వదిలి వెళ్లకుండా బ్లాక్‌మెయిల్ చేయడానికి నిందితుడు కొన్నిఅమానవీయ చర్యలకు పాల్పడి వాటిని వీడియో తీసి ఉంచాడు. ఆ వీడియో రికార్డింగులను కూడా విచారణలో భాగంగా పరిశీలించారు.
ఈ తిరుగులేని ఆధారాల వల్లే ఫ్రాన్స్‌ కోర్టు నిందితుడి వాదనలను పూర్తిగా కొట్టిపారేసి, అతనికి 25 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!