దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది పాటు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించింది.
జిల్లాలలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ వృత్తిలో ఉన్నవారితో స్వయంగా కమిటీ మాట్లాడింది. 169 ప్రశ్నలను తయారు చేసిన కమిటీ వాటికి సమాధానాలు రాబట్టి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సెక్స్‌వర్కర్ల జీవన విధానం మెరుగు పడేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేసింది. దాదాపుగా ఇలాంటి పరిస్థితులే దేశం లోని పలు రాష్ట్రాల్లో నెలకొన్నాయి.
కమిటీ నివేదికలోని అంశాలు ….
@ పేదరికం,కుటుంబ పెద్ద అనారోగ్యం వంటి కారణాలతో మహిళలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. తల్లిదండ్రులు,అన్నదమ్ములే బలవంతంగా మహిళలను ఈ వృత్తిలోకి దించుతున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బెళగావి జిల్లా 18 ఏళ్లకంటే తక్కువ వయసున్న అమ్మాయిలు వృత్తిలో కొనసాగుతున్నారు.
వయస్సు పై బడిన మహిళలు తమ ఇంటిని వేశ్యలకు అద్దెకు ఇస్తూ సొమ్ములు వసూలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దందాలో ఉన్న మహిళలు సంపాదించే సొమ్ములో దాదాపు 40 శాతం ఇతరులకు వెళుతోంది. ముఖ్యంగా దళారులకు, పోలీసులకు, స్థానిక రౌడీ, గుండాలకు చెల్లిస్తున్నారు.
చేయూత నివ్వాలి…….
@ సెక్స్‌వర్కర్ల సంక్షేమం కోసం రూ.733 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. 45 ఏళ్లు దాటిన వారికి అంత్యోదయ కార్డుతో పాటు రూ.5వేలను ప్రతి నెలా ఇవ్వాలి. హెచ్‌ఐవీతో బాధపడుతున్నవారికి ఉచిత మందులు ఇవ్వడంతో పాటు రూ.5వేలను ప్రతినెలా చెల్లించాలి.ఈ వృత్తి నుంచి బయటపడాలనుకునేవారికి రోజుకు రూ.300 ఇస్తూ వివిధ వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వాలి.
సొంతంగా వ్యాపారం, పశుపోషణ తదితర జీవనోపాధి అవకాశాలపై ఆసక్తి కలిగిన మహిళలకు ఎటువంటి వడ్డీ, తనఖా లేకుండా రుణాలు ఇవ్వాలి. ఏడాదికి కనీసం 1,000 మంది సెక్స్‌వర్కర్లకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. ఈ సిఫారసులున్న నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ లోగా ప్రభుత్వాలు మారడంతో నివేదిక అటకెక్కింది. 2015 లో కమిటీ వేస్తె 2016 లో నివేదిక సమర్పించారు. అదే సమయంలో తమతో సంప్రదించకుండా కమిటీ వేశారని సెక్స్ వర్కర్స్ యూనియన్ నేతలు విమర్శలు చేశారు. కమిటీ నివేదిక తప్పుల తడకని ఆరోపించారు. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు తరహాలో సెక్స్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏ డిమాండ్ ఇంతవరకు నెరవేరలేదు.
————-KNM