Response to criticism ….
తనపై జరుగుతున్న నెగటివ్ ప్రచారం పై సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పందించారు. ఇంత కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు స్పందించడానికి ప్రధాన కారణం..తనపై వస్తున్న రాజకీయ ఆరోపణలు, పుకార్లను నెటిజన్లు, సమాజం నిజమేనని నమ్మే ప్రమాదం ఉందని ఆయన భావించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత రజనీ పై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విపరీతమైన నెగిటివ్ ప్రచారం, విమర్శలు వచ్చాయి. దీనిపై రజనీకాంత్ స్పందిస్తూ.. “నేను ఇప్పుడు గనుక స్పందించకపోతే, నాపై వస్తున్న అబద్ధపు ప్రచారాలనే అందరూ నిజమని నమ్మేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది” అని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం పాలైంది, ఎంకే స్టాలిన్ కూడా ఓడిపోయారు. ఆ తర్వాత రజనీకాంత్ ఆయనను కలవడంతో.. విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడానికి రజనీకాంత్ తెరవెనుక రాజకీయాలు (డీఎంకే-ఏఐఏడీఎంకే రాయబారాలు) నడుపుతున్నారనే పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లను ఖండిస్తున్నానని ప్రకటించారు.
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనీకాంత్ నేరుగా మీడియా ముందుకు వచ్చి అభినందనలు చెప్పలేదని విమర్శలు వచ్చాయి. అయితే తాను ఫలితాలు రాగానే ‘ఎక్స్’ (ట్విట్టర్) లో పోస్ట్ చేశానని, ఎయిర్‌పోర్టులో ఒకరు ఫోన్ కెమెరాతో అడిగితే అది మీడియా ఇంటరాక్షన్ కాకపోవడం వల్లే నవ్వి ఊరుకున్నానని, దానిని కూడా వివాదం చేశారని రజనీ వివరణ ఇచ్చారు.
విజయ్ చారిత్రాత్మక విజయం తర్వాత తన స్నేహ బంధాలను, వ్యక్తిత్వాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ట్రోలింగ్, రూమర్లకు చెక్ పెట్టడానికే రజనీకాంత్ తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.
ఎన్నికల ఫలితాల అనంతరం తాను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ను కలవడంపై వచ్చిన విమర్శలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, ఓటమి తర్వాత స్నేహపూర్వకంగా పరామర్శించడానికి మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు.
విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికి తాను డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య రాయబారాలు (డీల్స్) నడిపానంటూ వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. విజయ్‌ను దెబ్బతీయడానికి వెనుక సీట్లు మార్చే అంతటి నీచ రాజకీయాలు తాను చేయనని, అలాంటి దురుద్దేశాలు తనకు లేవని రజనీకాంత్ ఘాటుగా సమాధానమిచ్చారు.
విజయ్‌కీ, తనకు మధ్య దాదాపు 28 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉందని,విజయ్ తనకు సమవుజ్జీ కాదని, అతని ఎదుగుదలపై తనకు ఎలాంటి కుళ్లు లేదా నెగిటివిటీ లేదని చెప్పారు. ఒకవేళ కమల్ హాసన్ గనుక సీఎం అయి ఉంటే తాను కాస్త అసూయపడేవాడినేమో అని చమత్కరించారు.
దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల ఆధిపత్యం ఉన్న తమిళనాడు రాజకీయాలలో విజయ్ సొంతంగా నిలబడి, ఒక పబ్లిక్ ఇమేజ్ సాధించి గుర్తింపు తెచ్చుకున్నారని రజనీకాంత్ ప్రశంసించారు.

