The first split in the AIADMK……
తమిళనాడు సీఎం ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ లో మొదటిసారిగా చీలిక వచ్చింది. జానకి రామచంద్రన్, జయలలిత వర్గాలు రెండుగా చీలిపోయాయి. ఆ వర్గాలు రెండూ తమదే అసలైన అన్నాడీఎంకే అని క్లెయిమ్ చేశాయి. దీంతో అప్పటి కేంద్ర ఎన్నికల సంఘం (EC) 1988 డిసెంబర్లో ‘రెండాకులు’ గుర్తును తాత్కాలికంగా ఫ్రీజ్ చేసింది. దీంతో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వర్గానికి ‘రెండాకులు’ (Two Leaves) గుర్తు లభించలేదు.
ఎన్నికల సంఘం జయలలిత నేతృత్వంలోని వర్గానికి ప్రత్యేకంగా ‘కోడిపుంజు గుర్తును కేటాయించింది. ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ నేతృత్వంలోని వర్గానికి ‘రెండు పావురాలు’ గుర్తును ఇచ్చారు. రెండు వర్గాలు ఎన్నికల బరిలోకి దిగాయి.
అప్పటికే జయలలితకు ప్రజల్లో, ముఖ్యంగా మహిళల్లో అసాధారణమైన క్రేజ్, తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీని తన వైపు తిప్పుకోవడానికి,ఎన్నికల్లో గెలవడానికి ఆ ఫాలోయింగే ఆమెకు బ్రహ్మాస్త్రంలా పనిచేసింది.
ఎంజీఆర్‌తో కలిసి దాదాపు 28 సూపర్ హిట్ సినిమాల్లో నటించడం వల్ల ఆమెకు క్షేత్రస్థాయిలో విపరీతమైన పాపులారిటీ ఉండేది.1982 లోనే ఆమెను ఎంజీఆర్ పార్టీ ప్రచార కార్యదర్శిగా నియమించారు. ఆ సమయంలో ఆమె తమిళనాడు అంతటా పర్యటించి తన ప్రసంగాలతో , ఆకర్షణీయమైన రూపంతో లక్షలాది మంది అభిమానులను, ముఖ్యంగా మహిళా ఓటర్లను సంపాదించుకున్నారు.
1989 ఎన్నికల్లో జయలలిత ఒంటరి పోరాటం చేశారు. ఎంజీఆర్ భార్య జానకి వైపు పార్టీలోని సీనియర్ మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ.. సామాన్య ప్రజలు, క్యాడర్ మాత్రం జయలలిత వైపే నిలిచారు.పార్టీ గుర్తు ‘రెండాకులు’ లేకపోయినా, కేవలం కొత్తగా వచ్చిన ‘కోడిపుంజు’ గుర్తును చూసి జయలలిత సభలకు ప్రజలు ఇసుక వేస్తే రాలనంతగా వచ్చేవారు.
ఆ ఎన్నికల్లో ఆమె 27 సీట్లు గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టిన ‘తొలి మహిళా ప్రతిపక్ష నేత’గా రికార్డు సృష్టించారు.నాటి ఎన్నికల్లో డీఎంకే 150,కాంగ్రెస్ 26,సీపీఎం 15,ఇండిపెండెంట్లు 5,ఇతరులు 11 సీట్లు గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత జానకి రామచంద్రన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1989 ఫిబ్రవరిలో రెండు వర్గాలు జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ వెంటనే రెండు వర్గాల విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ‘రెండాకులు’ గుర్తును తిరిగి అన్నాడీఎంకే పార్టీకి పునరుద్ధరించింది.
1989 మార్చి 25 న అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం జరుగుతున్నప్పుడు అధికార డీఎంకే సభ్యులు జయలలితపై దాడి చేసి, ఆమె చీరను లాగి ఘోరంగా అవమానించారు.చెదిరిన జుట్టుతో, చిరిగిన చీరతో అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన జయలలిత.. “మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ అసెంబ్లీలో అడుగుపెడతాను” అని శపథం చేశారు.
ఈ ఘటన తమిళనాడులోని ప్రతి ఇంట్లో ఉన్న మహిళ హృదయాన్ని కదిలించింది. జయలలితపై విపరీతమైన సానుభూతి (Sympathy Wave) పెరిగింది. ఆతర్వాత కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది.
తర్వాత కొన్నాళ్ళకు జరిగిన 1991 ఎన్నికల్లో జయలలిత అఖండ మెజారిటీతో గెలిచి ‘తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి’ అయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు, రాజీవ్ గాంధీ హత్య వంటి అంశాలు జయ విజయానికి దోహద పడ్డాయి. ఒక సాధారణ నటిగా జీవితాన్ని ప్రారంభించి, పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న రాజకీయాల్లో తన సొంత ఇమేజ్, ఫాలోయింగ్‌తో ఆమె తమిళనాడు ప్రజలకు “అమ్మ” గా మారిపోయారు.

