Ministerial position at a young age ……….
తమిళనాడు సీఎం విజయ్ తొలి క్యాబినెట్లో తెలుగు మూలాలున్న ఎస్. కీర్తన (29) మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, తమిళనాడు రాజకీయ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మంత్రిగా సరికొత్త రికార్డు సృష్టించారు.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల క్యాబినెట్లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా ప్రతినిధి ఈమె కావడం విశేషం.
కీర్తన 1996లో విరుదునగర్ జిల్లా చత్రరెడ్డియపట్టిలో ఒక సాధారణ మధ్యతరగతి తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు సంపత్. వీరి తాతలు చాలా ఏళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
కీర్తన ప్రభుత్వ పాఠశాలలో తమిళ మాధ్యమంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో బీఎస్సీ మ్యాథమెటిక్స్, అనంతరం పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 2019లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు.ఆమెకు తెలుగు, తమిళంతో పాటు హిందీ సహా మొత్తం 5 భాషలపై మంచి పట్టు ఉంది.
రాజకీయాల్లోకి రాకముందు ఆమె డేటా అనలిస్ట్‌గా పనిచేశారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘ఐప్యాక్’ (I-PAC) బృందంలో కీలక సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు.పశ్చిమ బెంగాల్, గోవా ఎన్నికలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తెరవెనుక వ్యూహరచనలో, క్షేత్రస్థాయి గ్రౌండ్ వర్క్‌లో ఆమె చురుకైన పాత్ర పోషించారు.
టీడీపీ సోషల్ మీడియా వింగ్ లో కూడా కొన్నాళ్ళు పని చేశారు. 2021 ఎన్నికల్లో స్టాలిన్ తరపున పని చేశారు.
విజయ్ స్థాపించిన TVK పార్టీ ద్వారా తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె, విరుదునగర్ జిల్లాలోని శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడ ఎక్కువగా తెలుగు వారు ఉన్నారు. దీంతో తెలుగులోనే ప్రచారం కూడా చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి అశోకన్‌పై 11,670 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.గత ఏడు దశాబ్దాలుగా పురుషుల ఆధిపత్యం ఉన్న శివకాశి నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె రికార్డు సృష్టించారు.
ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సాధారణ మధ్యతరగతి తెలుగు కుటుంబం నుంచి వచ్చి,ఎన్నికల్లో గెలిచి, క్యాబినెట్లో మంత్రి స్థాయికి ఎదగడం ద్వారా కీర్తన సంపత్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

