New Venture……..
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రణయ్ రాయ్ ప్రారంభించిన కొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ‘deKoder’ (డికోడర్) కు ప్రస్తుతం విశేషమైన ఆదరణ లభిస్తోంది.2024 ఎన్నికల ఫలితాల సమయంలో.. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాలకు సంబంధించి విశ్లేషణలకు భారీ స్థాయిలో స్పందన లభించింది.
ప్రధాన టీవీ ఛానెళ్లతో పోలిస్తే, డికోడర్ లైవ్ స్ట్రీమింగ్ (ట్విట్టర్, యూట్యూబ్) ను వీక్షించిన వారి సంఖ్య చాలా రెట్లు ఎక్కువగా ఉంది.మే 4న వోట్ల లెక్కింపు రోజున ‘DeKoder’ యూట్యూబ్ ఛానెల్లో లైవ్ స్ట్రీమింగ్కు సుమారు 9.15 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. కొన్ని వీడియోలు కేవలం ఒక్క రోజులోనే 1.2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించాయి.
అనవసరమైన హడావిడి లేకుండా, కేవలం డేటా ,లోతైన విశ్లేషణతో వార్తలను అందించడం వల్ల ముఖ్యంగా యువత ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.ఇది భారతదేశపు మొట్టమొదటి AI ఆధారిత డిజిటల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి.
వార్తలను విశ్లేషించుకోవడానికి అవసరమైన టూల్స్‌ను ఇది వినియోగదారులకు అందిస్తుంది. 15 భారతీయ భాషలలో కంటెంట్ అందించడం వల్ల ప్రాంతీయ స్థాయిలో కూడా దీనికి ఆదరణ పెరుగుతోంది.ఇటీవల ప్రణయ్ రాయ్ స్వయంగా పశ్చిమ బెంగాల్, కేరళ,తమిళనాడు వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సామాన్యులతో మాట్లాడుతున్న వీడియోలకు సోషల్ మీడియాలో భారీ వ్యూస్ వచ్చాయి.
ప్రణయ్ రాయ్ 76 ఏళ్ల వయసులో క్షేత్రస్థాయికి వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్న తీరు సామాజిక మాధ్యమాల్లో వీక్షకులను ఆకట్టుకుంది. దశాబ్దాల కాలం పాటు ఏసీ రూముల్లో, అత్యాధునిక స్టూడియోల్లో కూర్చుని ఎన్నికల విశ్లేషణలు చేసిన ఆయన, ఇప్పుడు సామాన్య జర్నలిస్టులా రోడ్లపైకి వచ్చి వార్తలు సేకరించడం విశేషం.
ఒకప్పుడు దేశ ప్రధానులను, ముఖ్యమంత్రులను ఇంటర్వ్యూ చేసిన ఒక లెజెండరీ జర్నలిస్ట్, ఈ వయసులో ఒక యువ రిపోర్టర్లా పని చేయడం కొత్త తరం జర్నలిస్టులకు స్ఫూర్తి నిస్తుంది. కేవలం స్టూడియో చర్చలకే పరిమితం కాకుండా, వార్త పుట్టే చోటుకు వెళ్లడమే అసలైన జర్నలిజం అని ఆయన నిరూపిస్తున్నారు.
టెలివిజన్ మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన రాయ్, ఇప్పుడు డిజిటల్ మీడియా అవసరాలకు తగ్గట్లుగా తన శైలిని మార్చుకున్నారు. పెద్ద టీమ్‌లు లేకుండానే తక్కువ వనరులతో నాణ్యమైన కంటెంట్‌ను అందిస్తున్నారు.
NDTV నుంచి ఎందుకు తప్పుకున్నారంటే ?
గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్, ఎన్డీటీవీ (NDTV) సంస్థను దశాబ్దాల క్రితం జరిగిన ఒక అప్పు ఒప్పందాన్ని ఆధారంగా చేసుకుని టేకోవర్ చేసుకుంది. ఎన్డీటీవీ టేకోవర్ ఒక ముందస్తు ప్రణాళికతో (Planned) జరిగినప్పటికీ, అది ప్రారంభంలో “హోస్టైల్ టేకోవర్” (Hostile Takeover) గానే పరిగణించబడింది.
అంటే సంస్థ యజమానుల అంగీకారం లేకుండానే ఈ ప్రక్రియ మొదలైంది. అదానీ గ్రూప్ ఎన్డీటీవీ వాటాలను నేరుగా కొనలేదు. ప్రణయ్ రాయ్ దంపతులు 2009లో తీసుకున్న అప్పును ఆధారంగా చేసుకుని, ఆ అప్పు ఇచ్చిన కంపెనీనే అదానీ కొనుగోలు చేశారు. ఈ విషయం తమకు ముందే తెలియదని, ఎటువంటి చర్చలు జరగలేదని అప్పట్లో ప్రణయ్ రాయ్ ప్రకటించారు .
అదానీ గ్రూప్ చాలా వ్యూహాత్మకంగా, పాత రుణ ఒప్పందంలోని లొసుగులను వాడుకుని ఈ టేకోవర్‌ను ప్లాన్ చేసింది. దీన్ని మార్కెట్ నిపుణులు ఒక “స్టెల్త్ ఆపరేషన్” (Stealth Operation) గా వర్ణించారు. ప్రణయ్ రాయ్ మొదట్లో ఈ టేకోవర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సెబీ (SEBI) నిబంధనలను ఉటంకిస్తూ అదానీ గ్రూప్ చర్యలను సవాలు చేశారు.
అదానీ గ్రూప్ మెజారిటీ వాటాను దక్కించుకోవడం ఖాయమని తెలిశాక, రాయ్ దంపతులు చర్చలకు మొగ్గు చూపారు. 2022 డిసెంబర్లో గౌతమ్ అదానీతో జరిగిన చర్చలు “నిర్మాణాత్మకంగా” సాగాయని, పరస్పర అంగీకారంతోనే తమ వాటాలను విక్రయిస్తున్నామని వారు ప్రకటించారు.
అదానీ గ్రూప్ హస్తగతం చేసుకున్న తర్వాత ఎన్డీటీవీ (NDTV) పనితీరులో, నిర్వహణలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆర్థికంగా సంస్థ మిశ్రమ ఫలితాలను చూస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రాబడి (Revenue) పెరిగినప్పటికీ, మార్కెటింగ్, విస్తరణ ఖర్చుల వల్ల నష్టాలు కూడా పెరిగాయి. స్టాక్ మార్కెట్లో ఎన్డీటీవీ షేరు ధర గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టింది.
ప్రణయ్ రాయ్ కేవలం ఒక జర్నలిస్టు మాత్రమే కాదు, ఆయన ఒక ఆర్థికవేత్త, చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఆయన కెరీర్ ప్రారంభం చాలా వైవిధ్యంగా సాగింది.లండన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పూర్తి చేసిన ప్రణయ్ రాయ్, లండన్‌లోనే చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. భారతదేశానికి తిరిగి వచ్చాక, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి పీహెచ్డీ పొందారు. అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
జర్నలిజంలోకి రాకముందు ఆయన భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఎకనామిక్ అడ్వైజర్‌గా (1985-87) పనిచేశారు. దేశం కోసం ఒక భారీ ఎకనామిక్ మోడల్‌ను రూపొందించిన బృందంలో ఆయన సభ్యుడిగా ఉండేవారు.1977లో మొదటిసారిగా ఒక మేగజైన్ కోసం ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం ద్వారా ఆయన జర్నలిస్ట్ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
1980వ దశకంలో దూరదర్శన్ కోసం ఎన్నికల ఫలితాలను విశ్లేషించడంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. డేటా ఆధారిత ఎన్నికల విశ్లేషణను (Psephology) భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు.
1988లో తన భార్య రాధికా రాయ్‌తో కలిసి ఎన్డీటీవీ (NDTV)ని ఒక ప్రొడక్షన్ హౌస్‌గా ప్రారంభించారు. అప్పట్లో దూరదర్శన్ కోసం వారు రూపొందించిన “ది వరల్డ్ దిస్ వీక్” అనే కార్యక్రమం అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్త వార్తలను ప్రతి వారం భారతీయుల ముందుకు తీసుకురావడంలో ఈ షో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.ఆయన ప్రయాణం, చివరకు భారత టెలివిజన్ జర్నలిజం ముఖచిత్రాన్నే మార్చివేసింది.

