కొంచెం కామెడీ ..కొంచెం థ్రిల్ !!

Sharing is Caring...

Paresh Turlapati………….

“సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని” సినిమా పేరు ఇది. టైటిల్ వెరైటీ గా ఉంది కదా .ఇరవై ఏళ్ల క్రితం ఫస్ట్ ఇన్నింగ్స్ లో హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే సినిమాలు చేసిన శివాజీ తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

దండోరా, కోర్ట్ వంటి సినిమాల్లో శివాజీ చక్కటి పెర్ఫార్మెన్స్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు..తాజాగా శివాజీ నిర్మించి, నటించిన సినిమానే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూస’..మొదట్లో ఈటీవీ విన్ లో నేరుగా రిలీజ్ చేద్దామనుకున్న సినిమా అంచనాలు అందుకుని థియేటర్ రిలీజ్ కి వెళ్ళింది..ఇప్పుడు నెట్ ఫ్లిక్స్  లోకి స్ట్రీమింగ్ అవుతుంది.. 

కథేంటంటే?

కొత్తకోట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీరామ్ (శివాజీ) సంప్రదాయాలను పాటిస్తూ నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకుంటాడు. టైటిల్లో మొదట చెప్పుకున్న సంప్రదాయిని శివాజీ గురించే.. ఇక అతడి భార్య ఉత్తర (లయ)చాలా గడుసుది. తన తెలివి తేటలతో సుప్పనాతి వేషాలు వేస్తుంటుంది..వీళ్ల కొడుకు మిట్టు(రోహన్)రీల్స్ పిచ్చిలో తింగరి వేషాలు వేసే సుద్దపూస.

సినిమా ప్రారంభంలోనే తన భార్య కొడుకుల స్వభావాల గురించి శివాజీ చెప్తాడు…అయితే వీరి జీవితాల్లో అనుకోని సంఘటన జరుగుతుంది..ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) అనూహ్యంగా శ్రీరామ్ ఇంటికి వచ్చి హత్యకు గురి అవుతాడు.

హత్యా నేరం తమ కొడుకు మీద పడుతుందేమో అన్న భయంతో దంపతులు వణికిపోతారు…దాంతో ఈ హత్య కేసునుంచి బయటపడటానికి భార్య ప్రోద్బలంతో శ్రీరామ్ ఒక ప్లాన్ వేస్తాడు. అసలు ఎస్సై విక్రమ్ శ్రీరామ్ ఇంటికి ఎందుకొస్తాడు? అక్కడ ఎస్సైని హత్య చేసింది ఎవరు? కేసునుంచి బయటపడటానికి శ్రీరామ్ అండ్ ఉత్తరలు వేసిన ప్లాన్ ఏంటి? ఎస్సైని నిజంగా శ్రీరామ్ కొడుకే చంపుతాడా? అసలు హంతకుడు ఎవరు? అనే విషయాలు మిగిలిన కథనంలో తెలుస్తాయి. 

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో హిట్ కొట్టాలంటే స్క్రీన్ ప్లే  పకడ్బందీ గా ఉండాలి. క్లైమాక్సులో అదిరిపోయే ట్విస్ట్ ఉండాలి.మలయాళ దర్శకులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతారు.. సినిమా అంతా సస్పెన్సుతో స్లోగా నడిపి ఆఖర్లో ప్రేక్షకులు ఊహించని ట్విస్టుతో ముగిస్తారు..దాంతో చాలామందికి థ్రిల్లింగ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తుంది ఈ మూవీలో కూడా అదే ఫార్ములాని ఫాలో అయినట్టు ఉన్నారు

ప్రారంభంలో శ్రీరామ్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సీన్లు రాసుకున్న దర్శకుడు హఠాత్తుగా శ్రీరామ్ ఇంట్లో జరిగిన ఎస్సై విక్రమ్ హత్యతో కథని సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి లాక్కెళ్లారు. ఎస్సై హత్యతో కథలో అసలు సంఘర్షణ మొదలౌతుంది.

శ్రీరామ్, ఉత్తరలు కలిసి హత్యకు సంబంధించిన ఆధారాలు చెరిపేసేయడం , పోలీసుల కంటపడకుండా శవాన్ని మాయం చేయడానికి కారులో తరలించడం వంటి సన్నివేశాలతో కథనంలో వేగం పెరుగుతుంది..కథనం మరీ సీరియస్ గా సాగిపోయి ప్రేక్షకులకు బోర్ కొడుతుందని ఊహించాడో ఏమిటో ఆలీ పాత్రని దింపటం ద్వారా దర్శకుడు వాతావరణాన్ని చల్లబర్చాడు..అతడు ఊహించినట్టే తన కామెడీ టైమింగ్ తో ఆలీ నవ్వులు పంచాడు..

నవ్వించడానికి జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ ను కూడా రంగంలోకి దింపారు కానీ ఎందుకో అతడి పాత్ర అంతగా రక్తి కట్టలేదు..సీరియస్ గా సాగిపోతున్న సినిమాలో జోష్ పెంచటానికి బండ్ల గణేష్ తో హుషారైన సాంగ్ కి స్టెప్పులు వేయించారు..

అయితే ఫస్టాఫ్ లో మొదలైన ఎస్సై హత్య సెకండాఫ్ లో అతడి శవాన్ని మాయం చేయడం వరకు కథనం మెల్లిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది….దీనికి తోడు అక్కడక్కడా సాగతీత సన్నివేశాలు ఉన్నాయి.రఘుబాబు, పృథ్వీ లతో చేయించిన సన్నివేశాలు కామెడీ ట్రాక్ కోసం కథ మధ్యలో అతికించినట్టు ఉన్నాయి.

నిజానికి ఆ సన్నివేశాలు లేకపోయినా కథకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఇదేకాకుండా మధ్య మధ్యలో ఆ ఎమ్మెల్యే తిమ్మప్ప గోల కూడా ఎక్కువైనట్టు అనిపిస్తుంది..హత్య కేసు నుంచి కథను సైడ్ ట్రాక్ పట్టించేలా ఉంది తప్ప కథనంలో సరిగా అతకలేదు.
 
ఇక విన్నకోట ప్రదీప్ తో చేయించిన కామెడీ కొద్దిగా ఎఫ్ 2 ను గుర్తు చేస్తుంది…ఇవన్నీ అలా ఉంచితే సినిమాకి ఊపిరి పోసింది మాత్రం క్లైమాక్స్ ట్విస్టే..అప్పటిదాకా ఎంత రీల్స్ పిచ్చి ఉన్నా శివాజీ కొడుకు మిట్టు ఏకంగా ఓ ఎస్సైని చంపడం ఏంటని? కొంత జస్టిఫికేషన్ కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు క్లైమాక్స్ ట్విస్ట్ ద్వారా దర్శకుడు సమాధానం చెప్పాడు.

ఈ ట్విస్ట్ చూస్తే గబాల్న మనకు దృశ్యం మూవీ గుర్తుకొస్తుంది…గుర్తుకొస్తే గుర్తుకొస్తుంది కానీ క్యూరియాసిటీని కలుగచేస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ లేకపోతే మిగిలిన కథనమంతా రొటీన్ రోడ్డ కొట్టుడు ఫార్ములా అయ్యేది.. శ్రీరామ్ పాత్రలో శివాజీ పరకాయ ప్రవేశం చేశాడు. లయ కూడా బాగా చేసింది. ఆలీ ఎప్పటిలానే తన తాగుబోతు మార్క్ నటన చూపించి నవ్వులు పూయించాడు.. రఘుబాబు , పృథ్వీ ల నటన పర్లేదు.. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చిన ధనరాజ్ నటన బాగుంది.

సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కథ హార్స్లీహిల్ ప్రాంతంలో జరిగినట్టు చూపించారు. పనిలోపనిగా అక్కడి అందాలను మరింత అందంగా తమ కెమెరా లో చిత్రీకరించారు.. ఓవరాల్ గా సినిమాటోగ్రఫీ బాగుంది.ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే బండ్ల గణేష్ సాంగుతో జోష్ తెప్పించారు…నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది..సెకండాఫ్ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతలా అనిపించినా ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి కథనంలో కలిసిపోతాయి.. ఫస్టాఫ్ లో కామెడీ ట్రాక్ టచ్ చేసిన దర్శకుడు సెకండాఫ్ లో క్రైమ్ థ్రిల్లర్ వైపు సినిమాని మలుపుతిప్పి క్యూరియాసిటి పెంచాడు.. క్రైమ్ నేపధ్యం ఉన్న సినిమా అయినా ఎక్కడా మోతాదును మించిన అశ్లీల సన్నివేశాలు కానీ, వయోలెన్స్ సన్నివేశాలు కానీ లేవు కాబట్టి  ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు..

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!