Chitrakoot Parikrama ……..
సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో అత్యధిక సమయం (సుమారు 11న్నర ఏళ్లు) గడిపిన పుణ్యక్షేత్రం చిత్రకూట్. ఇక్కడ ఉన్న కామద్గిరి పర్వతం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కామద్గిరి’ అంటే “కోరికలను నెరవేర్చే పర్వతం” అని అర్థం. భక్తులు ఈ పర్వతాన్ని సాక్షాత్తూ రాముడి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇక్కడ పర్వతం పైకి ఎక్కడం నిషిద్ధం.. కేవలం పర్వతం చుట్టూ ప్రదక్షిణ (పరిక్రమ) మాత్రమే చేస్తుంటారు.
రాముడు వనవాసానికి వచ్చినప్పుడు మునుల సూచన మేరకు చిత్రకూట్‌ను తన నివాసంగా ఎంచుకున్నాడు.తండ్రి దశరథుడు మరణించిన తర్వాత, భరతుడు రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకెళ్లడానికి చిత్రకూట్ వచ్చాడు. వారు కలుసుకున్న ప్రదేశం ఈ పర్వత ప్రాంతంలోనే ఉంది.భరతుడు రాముడిని వెనక్కి రమ్మని ప్రాధేయపడినప్పుడు, రాముడు నిరాకరించాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలను తీసుకుని వెళ్లాడు.
చిత్ర కూట్ లేదా కామద్గిరి పరిక్రమ సుమారు 5 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. ఈ మార్గం మొత్తం సిమెంట్ రోడ్డు వేశారు. దారి పొడవునా అనేక ప్రాచీన ఆలయాలు కనిపిస్తాయి. భక్తులు ఈ పరిక్రమ చేసేటప్పుడు “సీతా రామ్” లేదా “కామద్గిరి పరమేశ్వరాయ నమః” అని స్మరిస్తూ నడుస్తారు. కొందరు భక్తులు ‘దండవత్ పరిక్రమ’ (సాష్టాంగ ప్రణామం చేస్తూ దూరం కొలవడం) కూడా చేస్తారు. పరిక్రమ ప్రారంభంలో, చివరలో ఉండే ‘లక్ష్మణ్
వనవాసంలో ఉన్న రాముడికి ఈ పర్వతం నీడను, ఆహారాన్ని ఇచ్చి ఆదుకుందని, అందుకే రాముడు ఈ పర్వతానికి “నిన్ను దర్శించి ప్రదక్షిణ చేసేవారి కోరికలన్నీ నెరవేరుతాయి” అని వరం ఇచ్చాడని కథనం.
చిత్రకూట్‌లో ప్రతి నెల అమావాస్య ఒక పెద్ద పండుగలా జరుగుతుంది. ఈ రోజున లక్షలాది మంది భక్తులు మందాకిని నదిలో స్నానం చేసి, కామద్గిరి పరిక్రమ చేస్తారు.
దీపావళి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. రాముడు వనవాసం ముగించుకుని తిరిగి అయోధ్యకు వెళ్ళే ముందు ఇక్కడ చిత్రకూట్ వాసులకు దర్శనమిచ్చాడని భక్తుల నమ్మకం.దీపావళి రోజున రామఘాట్ వద్ద లక్షలాది దీపాలను వెలిగిస్తారు. ఆ దృశ్యం చూడటానికి రెండు కళ్లు సరిపోవు.శ్రీరాముడి జన్మదినం సందర్భంగా చిత్రకూట్ మొత్తం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. రథయాత్రలు, భజనలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ మాసంలో రాముడు, సీతమ్మ వారు ఊయల ఊగుతున్నట్లుగా అలంకరించి ‘ఝూలా ఉత్సవం’ జరుపుతారు. భక్తులు పాటలు పాడుతూ ఈ వేడుకలో పాల్గొంటారు.దసరా తర్వాత భరతుడు రాముడిని కలిసిన ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ వేడుక చేస్తారు. ఈ సమయంలో కామద్గిరి పరిక్రమ చేయడం చాలా పుణ్యమని భక్తులు భావిస్తారు.
ఉత్తర భారత దేశంలో హోలీకి ఎంత ప్రాధాన్యత ఉందో చిత్రకూట్‌లో కూడా అంతే ఘనంగా జరుపుతారు. రంగులతో పాటు మందాకిని నది నీటితో భక్తులు హోలీ ఆడుకుంటారు.ఈ క్షేత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటం వల్ల రెండు రాష్ట్రాల సంస్కృతుల కలయిక ఇక్కడ కనిపిస్తుంది.చిత్రకూట్‌లో కామద్గిరి పరిక్రమ చేసే భక్తుల కోసం అన్ని వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
ఆశ్రమాలు, ధర్మశాలలు (తక్కువ ధరలో) ఆధ్యాత్మిక వాతావరణం కోరుకునే వారికి ఇవి ఉత్తమమైనవి. ఇక్కడ గదులు ₹300 నుండి ₹800 వరకు లభిస్తాయి.కుటుంబంతో వెళ్లేవారికి సౌకర్యవంతంగా ఉండే హోటళ్లు ₹1,000 నుండి ₹2,500 మధ్యలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ప్రభుత్వ పర్యాటక హోటళ్లు కూడా ఉన్నాయి.
చిత్రకూట్‌లో అన్నదానం చేసే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. హోటళ్లలో కూడా ఉత్తర భారతీయ భోజనం నాణ్యంగా దొరుకుతుంది. పండుగ రోజుల్లో శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం మంచిది.
చిత్రకూట్‌కు నేరుగా రైలు లేదా విమాన సౌకర్యం లేదు, కాబట్టి సమీప నగరాల నుండి ప్రయాణించాల్సి ఉంటుంది.యాత్రికులు సమీపంలోని మాణిక్‌పూర్ జంక్షన్ (Manikpur Jn) లేదా చిత్రకూట్ ధామ్ కర్వి (Chitrakutdham Karwi) రైల్వే స్టేషన్లకు చేరుకుంటే అక్కడి నుండి టాక్సీ లేదా బస్సు ద్వారా చిత్రకూట్ చేరుకోవచ్చు.అక్కడి నుండి చిత్రకూట్ సుమారు 24-30 కి.మీ దూరంలో ఉంటుంది.
ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) విమానాశ్రయం కి చేరుకుంటే … చిత్రకూట్ అక్కడ నుండి సుమారు 135 కి.మీ దూరంలో ఉంది.
చిత్రకూట్ వెళితే ఇతర దర్శనీయ ప్రదేశాలు
రామఘాట్ (Ramghat) ….. మందాకిని నది తీరాన ఉన్న ఈ ఘాట్ చిత్రకూట్‌కు కేంద్రబిందువు. తులసీదాసుకి ఇక్కడే రాముడి దర్శనం కలిగిందని చెబుతారు. సాయంత్రం వేళ జరిగే మందాకిని ఆరతి చూడటం ఒక అద్భుతమైన అనుభూతి.
జానకి కుండ్ (Janaki Kund) రామఘాట్‌కు సుమారు 2 కి.మీ దూరంలో మందాకిని నది ఒడ్డున ఉంది. నది ఒడ్డున సీతమ్మ వారి పాదముద్రలను మనం చూడవచ్చు.
స్ఫటిక శిల (Sphatik Shila)……..జానకి కుండ్ సమీపంలో ఉన్న ఒక పెద్ద బండరాయి. ఇక్కడ రాముడు, సీత కూర్చుని ప్రకృతిని ఆస్వాదించేవారని పురాణాలు చెబుతాయి. ఇక్కడే జయంతుడు (ఇంద్రుడి కుమారుడు) కాకి రూపంలో వచ్చి సీతమ్మను వేధించాడని కథనం. ఇక్కడ కూడా రాముడి పాదముద్రలు ఉన్నాయి.
అనసూయ ఆశ్రమం (Sati Anasuya Ashram)…దట్టమైన అడవిలో మందాకిని నది జన్మస్థానం వద్ద ఈ ఆశ్రమం ఉంది. అత్రి మహర్షి, సతీ అనసూయలు ఇక్కడే నివసించారు. అనసూయ దేవి తన తపశ్శక్తితో మందాకిని నదిని ఇక్కడికి రప్పించిందని చెబుతారు.
గుప్త గోదావరి (Gupt Godavari) ఇది చిత్రకూట్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన గుహ. గుహ లోపల మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ వెళ్లడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. గుహ చివరలో నీటి ప్రవాహం భూగర్భంలో కలిసిపోతుంది (అందుకే దీనిని గుప్త గోదావరి అంటారు).
హనుమాన్ ధార (Hanuman Dhara) ఒక కొండపై వెలసిన ఆలయం. కొండ పైనుండి వచ్చే ఒక చిన్న నీటి ధార నిరంతరం హనుమంతుని విగ్రహంపై పడుతూ ఉంటుంది. లంకను దహనం చేసిన తర్వాత హనుమంతుడు తన వేడిని తగ్గించుకోవడానికి ఇక్కడికి వచ్చాడని చెబుతారు. (పైకి వెళ్లడానికి మెట్లు లేదా రోప్ వే సౌకర్యం ఉంది).
భరత్ మిలాప్ మందిర్ (Bharat Milap Temple)భరతుడు తన సోదరుడైన రాముడిని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించడానికి కలిసిన చోటు ఇది. ఈ ప్రదేశాలన్నీ చూడాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతుంది. పక్కాగా ప్లాన్ చేసుకుని వెళితే అన్నింటిని సందర్శించి రావచ్చు. లోకల్ ఆటోలు అందుబాటులో ఉంటాయి.

