Big budget movies ……………..
ధురంధర్ తో ఘనవిజయం సాధించి ఇండియా టాప్ దర్శకుడిగా ఎదిగిన ఆదిత్యధర్ తదుపరి సినిమా ఏమిటా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆదిత్య ధర్ చేతిలో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. రెండూ భారీ ప్రాజెక్టులే. అందులో ఒకటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’. రెండోది చంద్రగుప్త మౌర్య..
‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ విషయానికొస్తే ఇది మహాభారతంలోని చిరంజీవి అయిన అశ్వత్థామ పాత్ర ఆధారంగా రూపొందుతున్న ‘మైథో-సైన్స్ ఫిక్షన్’ (Mythological Science Fiction) చిత్రం. పురాణ కాలం నాటి శక్తులు, ఆధునిక కాలపు టెక్నాలజీతో కలిస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమా ప్రధానాంశం. దీనిని కేవలం ఒక సినిమాగా కాకుండా, ‘పాన్-వరల్డ్’ స్థాయిలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దాలని ఆదిత్య ధర్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం గతంలో ₹500 కోట్లకు పైగా బడ్జెట్ అంచనాలు వేశారు.బడ్జెట్ పరిమితులు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో ప్రాజెక్టు ను వాయిదా వేశారు.అయితే ‘ధురంధర్’ సిరీస్ (2025-26) భారీ వసూళ్లు సాధించడంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన ఆర్థిక బలం లభించింది. పెట్టుబడిదారులు కూడా సిద్ధంగా ఉన్నారు.
మొదట ఈ పాత్ర కోసం విక్కీ కౌశల్‌ను అనుకున్నారు.తాజా సమాచారం ప్రకారం, భారీ బడ్జెట్ తో తీసే మూవీ కావడంతో మార్కెట్ దృష్ట్యా రణవీర్ సింగ్ ను అనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగానే తెలుగు హీరో లు అల్లు అర్జున్,రామ్ చరణ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
ఈ సినిమా కి సంబంధించి యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఆదిత్య ధర్ ఈ సినిమాను హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నారు.
ముందుగా ఈ సినిమా తీయదలిస్తే ప్రి-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని 2027 చివరిలో లేదా 2028లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది ఆదిత్య ధర్ కెరీర్‌లోనే అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ‘ధురంధర్’ విజయంతో ఆయనకు ఇప్పుడు ఈ సినిమాను తాను అనుకున్న స్థాయిలో తెరకెక్కించే అవకాశం దక్కింది.
ఇక ఆదిత్య ధర్ మరో ప్రాజెక్టు ‘చంద్రగుప్త మౌర్య’పై కూడా దృష్టి పెట్టారు. ఆదిత్యధర్ రణవీర్ సింగ్ కలయిక లోనే చంద్రగుప్త మౌర్య రానుంది. ‘చంద్రగుప్త మౌర్య’ సినిమాపై పరిశ్రమలో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘ధురంధర్’ సిరీస్ ఇప్పటికే ₹1,300 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ‘చంద్రగుప్త మౌర్య’ మొదటి రోజే ₹150 – ₹200 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ చిత్రం క్లోజింగ్ వసూళ్లు ₹2,000 కోట్లను దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలవనుంది. దీని నిర్మాణ వ్యయం సుమారు ₹500 – ₹600 కోట్లు ఉండవచ్చని సమాచారం. రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం తన శరీరాకృతిని మార్చుకోవడంతో పాటు, యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకోవాలనుకుంటున్నారు.
‘అల్లావుద్దీన్ ఖిల్జీ’ (పద్మావత్) తర్వాత ఆయన చేయబోయే అత్యంత పవర్‌ఫుల్ పాత్ర ఇదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదిత్య ధర్ తన సినిమాల్లో వాడే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సౌండ్ డిజైన్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దించుతున్నారు. మౌర్య సామ్రాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఆయన భారీ సెట్లు, గ్రాఫిక్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ తర్వాత గ్లోబల్ స్థాయిలో చర్చించుకునే ఇండియన్ సినిమా ఇదే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ‘చంద్రగుప్త మౌర్య’ సినిమానే ముందుగా పట్టాలెక్కే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఆదిత్య ధర్ ఇప్పటికే రణవీర్ సింగ్‌తో ‘ధురంధర్’ సిరీస్ చేసి ఉండటం వల్ల, వీరిద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ‘చంద్రగుప్త మౌర్య’ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని సమాచారం.
‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అత్యంత భారీ బడ్జెట్ సినిమా. దీనికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. అందుకే దీనిని కొంచెం నిదానంగా, పకడ్బందీగా చేయాలని ఆదిత్య భావిస్తున్నారు.

