ఆ ఇద్దరి మధ్యనే హోరాహోరీ పోరు !!

Sharing is Caring...

Who will win?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం లో పాత మిత్రుల మధ్య  హోరాహోరీ సమరం జరుగుతోంది. ముఖ్యమంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారి మరోమారు తల పడుతున్నారు.

గతంలో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించిన ఉత్సాహంతో, ఈసారి ఆమె సొంత గడ్డపైనే సువేందు అధికారి  సవాల్ విసిరారు. 2021లో నందిగ్రామ్‌లో సాధించిన విజయాన్ని పునరావృతం చేస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలోనే కట్టడి చేయడం ద్వారా, ఆమె రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకోవడమే బీజేపీ ప్రధాన లక్ష్యం గా కనిపిస్తోంది. 

 ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)’ ద్వారా భవానీపూర్‌లో సుమారు 47,000 మంది నకిలీ లేదా అక్రమ ఓటర్ల పేర్లను తొలగించారని, ఇది తన విజయానికి దోహదపడుతుందని  సువేందు అధికారి చెబుతున్నారు. సువేందు కేవలం భవానీపూర్ నుండే కాకుండా,తనకు పట్టున్న నందిగ్రామ్ నుండి కూడా పోటీ చేస్తున్నారు. ఒకవేళ భవానీపూర్‌లో ఫలితం తేడా వచ్చినా అసెంబ్లీలో ఉండాలనేది ఆయన ఆలోచన.

గత ఆరు నెలలుగా సువేందు భవానీపూర్‌పై ప్రత్యేక దృష్టి సారించి తరచుగా పర్యటనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మార్చి 19న అక్కడ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ముస్లిం ఓట్లు స్వల్పంగా తగ్గినా, హిందూ ఓట్లు బీజేపీ వైపు ఏకీకృతమైతే భవానీపూర్‌లో విజయం సాధ్యమని బీజేపీ అంచనా వేస్తోంది.

2021 ఎన్నికలలో మమతా బెనర్జీ నందిగ్రామ్ లో సువేందు అధికారి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.తర్వాత జరిగిన ఉప ఎన్నికలో మమతా భవానీ పూర్ నుంచి గెలిచారు. నాటి ఉప ఎన్నికలో మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి, బిజెపికి చెందిన ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,835 ఓట్ల రికార్డు మెజార్టీతో గెలుపొందారు.

మమతా బెనర్జీ 2011 నుండి భవానీపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భవానీపూర్ నియోజకవర్గానికి రెండో దశలో భాగంగా ఏప్రిల్ 29, 2026న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మే 4, 2026న విడుదలవుతాయి.

గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో కేవలం 1,956 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.అధికారి కూడా మమతా తో పనిచేసిన వాడే. సువేందు అధికారి తనను తాను “నందిగ్రామ్ పుత్రుడిగా”  ప్రొజెక్ట్ చేసుకున్నారు. మమతా బెనర్జీని కోల్‌కతాకు చెందిన “బయటి వ్యక్తి”గా ప్రచారం చేయడం అక్కడ పని చేసింది.

నందిగ్రామ్‌లో సుమారు 70% హిందూ,  30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. బీజేపీ “జై శ్రీరామ్” నినాదాలు  హిందూ ఓట్ల ఏకీకరణ (Polarization) ఆయన విజయానికి దోహదపడ్డాయి. నందిగ్రామ్, పరిసర తూర్పు మిడ్నాపూర్ ప్రాంతాల్లో అధికారి కుటుంబానికి దశాబ్దాలుగా బలమైన పట్టు ఉంది. ఇది బీజేపీకి అదనపు బలాన్ని ఇచ్చింది. స్థానిక తృణమూల్ నాయకులపై ఉన్న అవినీతి ఆరోపణలు,  అసంతృప్తి ఓటింగ్ పై ప్రభావం చూపాయి.

మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకోవాలంటే 1970లలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు..జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానంలో కమ్యూనిస్ట్ దిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి, దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు.

1998 లో కాంగ్రెస్‌తో విభేదించి ‘అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్’ (TMC) పార్టీని స్థాపించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి  మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలలో రైల్వే, బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 34 ఏళ్ల కమ్యూనిస్ట్ పాలనను అంతం చేసి, పశ్చిమ బెంగాల్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నుండి ఎదురైన సవాలును తట్టుకుని, వరుసగా మూడవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మమతా బెనర్జీ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 2021 నందిగ్రామ్ ఎన్నికతో పాటు 1989 లో కూడా ఓటమిని చవిచూశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జాదవ్‌పూర్ నియోజకవర్గం నుండి సిపిఐ(ఎం) అభ్యర్థి మాలిని భట్టాచార్య చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు.ఈ రెండు సందర్భాలు మినహా, ఆమె పోటీ చేసిన మిగిలిన అన్ని లోక్‌సభ (1991 నుండి 2009 వరకు వరుసగా) అసెంబ్లీ ఎన్నికల్లో (2011 నుండి ఇప్పటివరకు) విజయం సాధిస్తూనే వచ్చారు.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!