తాలిబన్ vs ఐసిస్ !

Sharing is Caring...

Enmity……………………………………….

తాలిబన్లకు పక్కలో బల్లెం లా మారింది ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్. ఇది మరో ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్. ఈ గ్రూప్ ను ఎదుర్కోవడం తాలిబన్లకు సాధ్యమయ్యే పనికాదు. ఆఫ్గాన్లో ఐసిస్ ప్రతినిధిగా ఐసిస్ ఖోరాసాన్ గ్రూప్ ఏర్పడింది. ఐసిస్ 2016 లో ఈ గ్రూప్ ను ఏర్పాటు చేసినట్టు ప్రకటన చేసిన వెంటనే ఆ గ్రూప్ పై తాలిబన్లు యుద్ధం ప్రకటించారు.

అప్పటి నుంచి రెండు గ్రూపుల మధ్య వైరం కొనసాగుతోంది. ఐసిస్ అంటే  (The Islamic State in Iraq and al-Sham (ISIS) ఇటీవల కాలంలో కేవలం ఇస్లామిక్ స్టేట్ (IS ) అని కూడా పిలుస్తున్నారు. ప్రపంచంలోనే భారీ నిధులున్నతీవ్రవాద సంస్థ ఐసిస్ ఒక్కటే అంటారు.  ఆఫ్ఘన్ లో షరియా ఆధారిత పాలన ప్రభుత్వ స్థాపనకు ఏర్పడిందే తాలిబన్ గ్రూప్. విదేశీ ప్రభుత్వాల నియంత్రణ నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని తాలిబన్లు అంటుంటారు.

కానీ ఐసిస్ లక్ష్యం అంతకంటే పెద్దది. మధ్యప్రాచ్యం దక్షిణాసియాలోని  ముస్లిం దేశాలను కలుపుకొని ఖలీపత్ ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు చేయటమే ఐసిస్ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే రెండు గ్రూపులకు భేదాభిప్రాయాలున్నాయి.

తాలిబన్ పాకిస్థాన్ చేతిలో కీలుబొమ్మని … ఆఫ్ఘన్లో  ఆధిపత్యం కోసం పాక్ సృష్టించిన గ్రూపని ఐసిస్ -కే విమర్శిస్తోంది. తాలిబన్లు నిజంగా పాక్ చేతిలో బొమ్మలు కాకపోతే వెంటనే తమతో చేతులు కలిపి షరియా అమలుకు కలిసి రావాలని ఐసిస్-కే  డిమాండ్ చేసింది. తాలిబన్లు ఈ ఆరోపణను .. డిమాండ్ ను తోసిపుచ్చారు.

ఆఫ్ఘన్ లో జీహాద్ కు తాము సరిపోతామని సమాంతరంగా మరో గ్రూప్ అవసరంలేదని ఐసిస్ -కే  తమ కార్యకలాపాలను నిలిపివేసి  ఆఫ్ఘన్ నుంచి వైదొలగాలని తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.ఈ ధిక్కార ధోరణిని ఐసిస్  సహించలేకపోతోంది.

తాలిబన్ల పై జాలి చూపొద్దని  ఐసిస్ కే ను ఐసిస్ ఆదేశించింది. మొత్తం ఖలీఫత్‌కు ఒకరే ఖలీఫా/అమిర్‌ ఉంటారని దానికి విరుద్ధంగా తాలిబన్లు సొంతంగా అమిర్‌ను ప్రకటించుకోవడం ఏమిటని ఐసిస్‌–కే గతంలోనే నిలదీసింది. రెండో ఖలీఫాను తుదముట్టించాలని 2015 లోనే పిలుపిచ్చింది.

అప్పటి నుంచి రెండు గ్రూపుల మధ్య అప్రకటిత యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతుల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐసిస్ ఆఫ్ఘన్ లో సుదీర్ఘ పోరాటానికి  సన్నాహాలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

తాలిబన్లు తమ ఆధిపత్యాన్ని అంగీకరించనిదే ఐసిస్ ఒప్పుకోదు. మౌనంగా ఉండబోదు. తాత్కాలికంగా ఐసిస్ కొంచెం వెనక్కి తగ్గినా భవిష్యత్తు లో సమస్యలు సృష్టిస్తుంది. ఇక ఐసిస్ నుంచి పలు గ్రూపులు ఏర్పడ్డాయి. అయితే ఐసిస్ ఒక్కటే బలమైన గ్రూప్ అని అంటారు.

————KNM   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!