పంచకోశి యాత్ర ప్రాధాన్యత ఏమిటంటే?

Sharing is Caring...

A long holy walk………….

పంచకోశి యాత్ర……..వారణాసి చుట్టూ జరిగే అత్యంత పవిత్రమైన యాత్ర ఇది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్ వద్ద గంగా స్నానంతో ప్రారంభమవుతుంది. తిరిగి మణికర్ణిక ఘాట్ వద్దే ముగుస్తుంది. యాత్రలో భక్తులు 88.5 కిలోమీటర్ల దూరం నడవాలి. యాత్రను సాధారణంగా 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ప్రతి రోజూ రాత్రి వేళ ఒక నిర్దిష్ట క్షేత్రంలో బస చేస్తారు. 

కర్దమేశ్వర్ (కందవా)… మొదటి రోజు బస. ఇక్కడ పురాతన శివాలయం ఉంది. భీమచండి.రెండో రోజు బస. ఇక్కడ భీమచండీ దేవి ఆలయం ఉంటుంది. రామేశ్వర్… మూడో రోజు బస. వరుణ నది ఒడ్డున ఉంటుంది. శివపూర్.. నాలుగో రోజు బస. ఇక్కడ పాండవుల పేరిట పంచ లింగాలు ఉంటాయి. కపిలధార ..ఐదో రోజు బస. ఇక్కడ పితృ తర్పణాలు కూడా వదులుతారు.

ఈ యాత్ర చేయడం వల్ల కోటి యజ్ఞాలు చేసిన పుణ్యం దక్కుతుందని, మనిషి చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ యాత్రను ఏ రోజైనా చేయవచ్చు, కానీ అధిక మాసంలో చేయడం అత్యంత ఫలప్రదంగా భావిస్తారు. అలాగే శివరాత్రి, కార్తీక మాసాల్లో కూడా భక్తులు ఎక్కువగా చేస్తారు. చాలామంది భక్తులు ఈ యాత్ర ను  పాదరక్షలు లేకుండానే చేస్తుంటారు.

కాశీ పంచకోశి యాత్ర మార్గంలో బస, ఆహార ఏర్పాట్లు సాధారణంగానే ఉంటాయి. నైట్ స్టే చేసే చోట సాధారణ గదులు, లేదా హాల్స్అందుబాటులో ఉంటాయి. చాలా చోట్ల చిన్నహోటళ్లు, దాబాలు ఉంటాయి. యాత్ర నియమం ప్రకారం చాలా మంది భక్తులు ‘స్వయంపాకం’ (తమ ఆహారాన్ని తామే వండుకోవడం)తయారు చేసుకుంటారు. ధర్మశాలల వద్ద కట్టెల పొయ్యిలు, పాత్రలు అందుబాటులో ఉంటాయి. మీరు వండు కోలేకపోతే, మార్గమధ్యంలో లభించే సాత్విక ఆహారం తీసుకోవచ్చు.

అధిక మాసం లేదా పర్వదినాల్లో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉచిత భోజనం,తాగునీరు అందిస్తాయి. వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తాయి. ఒకప్పటితో పోలిస్తే పంచకోశి యాత్ర రోడ్డు ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. భక్తులు నడవడానికి వీలుగా రోడ్డు పక్కన కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లు, విశ్రాంతి తీసుకోవడానికి నీడ నిచ్చే చెట్లు, బెంచీలు ఉంటాయి.

సాధారణ రోజుల్లో ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. కానీ అధిక మాసం లేదా శివరాత్రి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ వల్ల రోడ్లు కిక్కిరిసిపోతాయి.. కారు లేదా ఆటోలో ఈ యాత్రను ఒక్క రోజులోనే పూర్తి చేయవచ్చు. 

పంచకోశి యాత్ర కచ్చితంగా గిరి ప్రదక్షిణ వంటిదే. అయితే ఇక్కడ కొండ (గిరి) చుట్టూ కాకుండా, సాక్షాత్తు కాశీ క్షేత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. మానవ శరీరం ఐదు పొరలతో (పంచ కోశాలతో) నిర్మితమైంది. ఈ యాత్ర చేయడం ద్వారా ఆ ఐదు పొరలను శుద్ధి చేసుకుని, పరమాత్మను చేరుకోవచ్చని భక్తుల నమ్మకం.

ఆ అయిదు పొరలు ..ఒకటి అన్నమయ కోశం: భౌతిక శరీరం, రెండు ప్రాణమయ కోశం: శక్తి శరీరం, మూడు మనోమయ కోశం: మనస్సు, నాలుగు విజ్ఞానమయ కోశం: జ్ఞానం/బుద్ధి,అయిదు ఆనందమయ కోశం: ఆత్మ స్థితి.. ఒక్కో క్షేత్రాన్ని సందర్శిస్తూ ఒక్కో పారను శుద్ధి చేసుకోవడమే ఈ యాత్ర పరమార్ధం.  

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!