Are there souls?…….
దెయ్యాలు,ఆత్మలను నమ్మే వారు కొందరు..అంతా ట్రాష్ అని కొట్టేసేవారు ఇంకొందరు. ఈ చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి.ఈ సినిమా ఆత్మలున్నాయని చెబుతోంది. హర్రర్ థ్రిల్లర్ జానర్ లో తీశారు ఈ ‘ఈషా’ (Eesha) సినిమాను. అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పేరుకే హారర్ సినిమా కానీ భయపడి పోయేంత గొప్పగా ఏమీ లేదు.
కాకపోతే BGM మాత్రం అదరగొట్టేసాడు మ్యూజిక్ డైరెక్టర్. ఆ స్థాయిలో సినిమాలో భయానక సన్నివేశాలు లేవు. కథపై దర్శకుడు ఇంకాస్తా కసరత్తు చేసి మంచి సన్నివేశాలను పేర్చుకుని ఉంటే సినిమా అదిరిపోయేది.
కథ ఏమిటంటే ?
నలుగురు స్నేహితులు నయన (హెబ్బా పటేల్),అపర్ణ (సిరి హనుమంతు), కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుండి ఆత్మలు, దెయ్యాలు లేవని నమ్ముతూ, నకిలీ బాబాల బండారాలు బయట పెడుతుంటారు. ఆ క్రమంలో డాక్టర్ ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) అనే బాబా వద్దకు వెళతారు.
ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో భాగంగా బాబా సవాలును స్వీకరించి ఆ నలుగురు పురాతన భవనంలోకి వెళ్తారు. అక్కడ వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులు ఏమిటి? ఆ ప్రయాణంలో జరిగిన ఒక యాక్సిడెంట్ వారి జీవితాలను ఎలా మార్చింది? అనేదే మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్
హెబ్బా పటేల్ బాగానే చేసింది. మైమ్ మధు పుణ్యవతి ఆత్మ ఆవహించిన గిరిజన వ్యక్తిగా భయపెట్టేలా నటించాడు. అతనికి మేకప్ బాగా కుదిరింది. కాలభైరవ పాత్రధారి కూడా బాగా చేశారు.మిగిలిన నటులు కూడా పాత్రల పరిధిలో చక్కగా చేశారు. పృథ్వీరాజ్ బాబా పాత్రకు బాగానే సూట్ అయ్యారు.
ఆర్‌ఆర్ ధ్రువన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) కొన్ని హారర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. సినిమా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని హారర్ సీన్లు క్లైమాక్స్ ట్విస్ట్ హారర్ ప్రియులను ఆకట్టుకుంటాయి.రచయిత, దర్శకుడు శ్రీనివాస్ మన్నేఆత్మల విషయంలో కొంత స్టడీ చేసినట్టున్నారు.. డైలాగులు బాగా రాశారు.
మనుషులు లాగానే కొన్ని స్థలాలు శాపగ్రస్తమై ఉంటాయి.తర్వాత అవే ఆత్మలకు నిలయంగా మారతాయి. మన అనుభవానికి రానంతవరకు ఏదైనా మూఢనమ్మకమే.అనుభవానికొచ్చిన మరుక్షణం అదే నమ్మకం అవుతుంది. అభిప్రాయాలు కాలంతో ప్రయాణించి అవి నిజాలు గానో, అబద్ధాలు గానో నిరూపితమవుతాయి. వంటి డైలాగ్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.
సినిమా ప్రారంభ దృశ్యాలు, పాదముద్రలు చూపే సీన్, గబ్బిలాలు దాడి చేసే సన్నివేశాలు ,ఎవరో రాత్రిళ్ళు ఏడిచే సీన్, కుక్కలు వెంటపడే సీన్, పాత భవనంలో కొన్ని సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్
సినిమా మొదటి భాగం నెమ్మదిగా సాగుతుంది. కథలో డెప్త్ తక్కువ. కథను తెరకెక్కించడంలో దర్శకుడు మరింత కసరత్తు చేసి ఉండాల్సింది. భయానక సన్నివేశాలు ఒకటో రెండో తప్ప మిగతా సీన్స్ ను ప్రేక్షకులు ఊహించేలా ఉన్నాయి. కొన్ని సీన్లు లాజిక్ కి అందవు.
ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథలో ట్విస్టులు లేవు.ఆదిదేవ్ ఎందుకు బాబా గా మారారు ?ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏమిటి అనేది వివరించలేకపోయారు.పుణ్యవతి ఎపిసోడ్ అసంపూర్తిగా ఉంది. ఆ పాత్ర క్రియేషన్ లో లోపాలున్నాయి.
హారర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, వాటిని వినూత్నంగా మలుచుకోలేక పోయారు.సినిమా చాలా భయంకరంగా ఉంటుందని ప్రమోట్ చేశారు. కానీ తెరపై ఆ స్థాయి భయం కనిపించదు. సంతోష్ కెమెరా పనితనం బాగుంది.

