తర్జని కథల పోటీలో ఎంపికైన సస్పెన్స్ స్టోరీ!

Sharing is Caring...

ఆ విషయం భర్త గోపాల్‌ వర్మకి చెబుదామనుకుంది షర్మిల. అయితే, విషయం నిర్ధారించుకోకుండా ముందుగా  చెప్పి అతడిని అనవసరంగా భయపెట్టడం ఎందుకని ఊరుకుంది. వర్మ ఉద్యోగరీత్యా బోపాల్‌లో వుంటున్నాడు. ఏడాది కిందట అతడికి ముంబయి నుండి అక్కడకు ట్రాన్స్‌ఫరయ్యింది. అలా ట్రాన్స్‌ఫర్‌ అయినచోటకల్లా ఫ్యామిలీని మారుస్తూపోతే పిల్లాడి చదువు దెబ్బతింటుందని షర్మిల పోరుపెడితే తనవాళ్లను ముంబయిలోనే విడిచిపెట్టి అతడక్కడ ఒంటరిగా వుంటున్నాడు. పండుగలకు ఫంక్షన్లకీ వచ్చిపోతుంటాడు.

షర్మిల, ఇక్కడ తన పిన్నమ్మ నిర్మలను తోడు తీసుకుని గీతానగర్‌లో వున్న తన సొంతింట్లో వుంటోంది. శివారు ప్రాంతం కావడం. పైగా అక్కడో ఇల్లు ఇక్కడో ఇల్లు అన్నట్లు దూరం దూరంగా ఇళ్లు వుండడం వల్ల రాత్రుళ్లు కాస్త భయంగానే వుంటుందక్కడ. ఈమధ్యకాలంలో నిద్రపట్టక మధ్యలో లేచి అప్పుడప్పుడు బాల్కనీలోకొచ్చి పచార్లు చేస్తూ ఉండగా ఎవరో ఆ ఇంటి ప్రహరీ గోడ వెనుక అనుమానాస్పదంగా తచ్చాడుతున్నట్లు గమనించింది షర్మిల.

రోడ్డుమీద పోయేవాళ్లు ఎవరో.. ఎవరో.. అనుకుని మొదట్లో పట్టించుకోలేదు. కానీ అతడలా నాలుగైదుసార్లు కంటబడేసరికి ఏదో అనుమానం రేగింది ఆమెలో. ఓ రోజు రాత్రి గార్డెన్‌లో ఏదో అలికిడి అయినట్లయితే లేచి కిటికీలోంచి చూసింది. ఎవరో గోడదూకి పోవడాన్ని ఆమె స్పష్టం గా చూసింది.‘‘ఎవరది..’’ అని కేక వేద్దామనుకుంది. కానీ గొంతు పెగలలేదు. ‘‘ఎవరా ఆగంతకుడు..’’ అని అనుకుంది. ఆ తర్వాతి రోజు పడుకోకుండా పదకొండు గంటలవేళ బాల్కనీలోకొచ్చి అక్కడ చీకటిలో చాటుగా వుండి అతడికోసం ఎదురుచూసింది.

రెండ్రోజులు అతడు కనిపించలేదు. అటు తర్వాత మరొకరోజు గార్డెన్‌లో ఏదో చప్పుడైంది. షర్మిల లేచి చూడగా గోడవతల ఎవరో మనిషి చీకట్లోకి జారిపోతూ కన్పించాడు. అప్పట్నుంచి భయం పట్టుకుందామెకు. ‘‘ఎవరతడు.. ఇలా ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు?’’ అని ఆలోచనలో పడిందామె . ఊరుకుంటే ఉపద్రవమేదో వచ్చి పడేలా వుందని చెప్పి ఆ రోజు ఉదయం త్వరగా ఇంట్లో పని ముగించుకుని తన దూరపు చుట్టం, వరసకు మావయ్య అయ్యే ఫణిభూషణరావు దగ్గరకి వెళ్లింది. అతనో రిటైర్డ్‌ పోలీసాఫీసరు. అతనికి విషయం చెప్పింది. అతడంతా  సావధానంగా విన్నాడు.

 ‘‘ఈ విషయం వర్మకు చెప్పలేదు.. చెప్పమంటారా..’’ అని అనడిగింది షర్మిల.‘‘వద్దు.. నేను చూసుకుంటాను.. నువ్వేం భయపడకు..’’ అని చెప్పి ఆమెను వెళ్లిరమ్మన్నాడు ఆయన.

                                                            ***      ***      ***

సమయం పన్నెండు కావొస్తోంది. సిటీ నిద్రలోకి జారుకుంది. చీకటి వ్యవహారాలు చక్కబెట్టేవాళ్లకు అది తెల్లవారే సమయం. వాళ్ళు అప్పుడు లేచి తయారై వారి వారి పనుల్లోకి పోతారు. అలాంటి సమయంలో షర్మిల ఇంటి గార్డెన్‌లోకి ఆగంతకుడు అడుగుపెట్టాడు. మెల్లగా సిటౌట్‌ వైపు వెళ్లాడు. కిందనుండి సిటౌట్‌పైకి పాకిన సన్నజాజి పాదువద్ద కాసేపు నిలబడి అటూ ఇటూ చూశాడు. ఇంటి వెనుకకు వెళ్లి డ్రాయింగ్‌ రూమ్‌ కిటికీ అద్దానికి చెవులు ఆనించాడు.

ఏ శబ్దమూ చెవినబడకపోయేసరికి లోపల ఎవరూ లేరని నిర్ధారణకొచ్చి మెయిన్‌డోర్‌ వద్దకు వెళ్లాడు. చెప్పుల స్టాండువైపు టార్చ్‌లైట్‌ వేసి చూశాడు. ఆ స్టాండు పక్కగా కిందన ఓ కొత్త చెప్పుల జత అతడి కంటబడింది. అంతక్రితం సారి వచ్చినపుడెప్పుడూ ఆ చెప్పులను చూడకపోవడంతో వాటివంక మార్చి మార్చి చూశాడు. ఉద్రేకం ఉప్పొంగింది. జేబులోని ఆయుధాన్ని ఓసారి తడిమి చూసుకుని పళ్లు కొరుక్కుంటూ పక్క గదికి పోయాడు.  

అది బెడ్‌రూమ్‌. ఆ రూమ్‌ కిటికీ అద్దానికి చెవి ఆన్చాడు. లోన ఫ్యాన్‌ శబ్దం తప్ప మరే శబ్దమూ చెవినబడలేదు. కిటికీ రెక్కలు లాగడానికి ప్రయత్నించాడు. రెండు రెక్కలు రాలేదు. సరిగ్గా వేయలేదేమో మూడో రెక్క వచ్చింది. దాన్ని మెల్లగా అవతలికి నెట్టి లోనికి తొంగి చూసాడు. బెడ్‌లైటు వెలుగు గదంతా పరుచుకుని వుంది. బెడ్‌పై పిల్లాడు ఒక్కడే పడుకుని వున్నాడు. పక్కన షర్మిల లేదు. ఆగంతకుడి కళ్లు పెద్దవయ్యాయి. మెదడు నరాల్లో ఏదో సంచలనం!

కిటికీ ఊచల లోపలికంటా తన తల దూర్చి తొంగి చూడటానికి ప్రయత్నించాడు. ఆ గదిలో ఇంకెవరూ కనిపించలేదు. అసహనంగా కదిలి ఆ పక్క గదికి వెళ్లాడు. అక్కడ ఒక కిటికీ అద్దం పగిలి ఉంటుంది. ఆ అద్దపు కన్నంలోంచి లోనికి చూసాడు. లోపల షర్మిల పిన్నమ్మ నిర్మల ఒక్కతే గుర్రుపెట్టి నిద్రపోతూ కనిపించింది.  ఆగంతకుడిలో అలజడి ఎక్కువైపోయింది. కాలుగాలిన పిల్లిలా మెట్లెక్కి మేడ మీదకు వెళ్లాడు.

మేడపైన ఓ గదిలో బెడ్‌ బల్బు వెలుగుతూ వుంది. లోపల ఏం జరిగిపోతోందా అన్నట్లు అద్దాల్లోంచి చూడ్డానికి ఆత్రంగా ప్రయత్నించాడు. మసగ్గా వుండి ఏదీ స్పష్టంగా కనిపించలేదు. డోర్‌ దగ్గరకు వెళ్లి ఎలా తాళం తియ్యడమా అని ఆలోచిస్తూ డోర్‌ హ్యాండిల్‌పై చెయ్యి వేసి యధాలాపంగా తిప్పాడు. తాళం వేసి లేకపోవడంతో అది తెరుచుకుంది. కిర్రుమనకుండా తెరిచి లోనికి అడుగుపెట్టాడు.

ఆ సమయంలో బయట ఎవరో చప్పుడు కాకుండా తలుపు వేసి గడియపెట్టారు. ఉన్నట్టుండి లోపల లైట్లు వెలిగాయి. ఒక్కసారిగా వెలుగు కళ్లల్లోపడేసరికి ఆగంతకుడు కళ్లకు చేతులు అడ్డంపెట్టుకున్నాడు. క్షణకాలం తర్వాత చేతులు అడ్డం తీసి చూసేసరికి ఎదురుగా పోలీసులు! అవాక్కయిపోయాడు. ముఖానికి నల్లని మాస్క్‌ ధరించి వున్న అతగాడిని చూసి భయపడుతూ షర్మిల ఓ మూల వణుకుతూ నిల్చుండిపోయింది.

పోలీసులు వెళ్లి అతడి జబ్బలు విరిచి పట్టుకుని ముఖానికున్న మాస్క్‌ను తొలగించారు.షర్మిలకు కరెంట్‌ షాక్‌ కొట్టినంత పనయ్యింది. దిగ్భ్రమ చెందింది. ఆగంతకుడివైపు గుడ్లప్పగించి చూస్తూ ‘‘గోపాల్‌ వర్మా! మీరా?!!..’’ అని వణుకుతున్న గొంతుతో అడిగింది.’ఇక్కడ.. మీరు.. ఇలా.. ఇదంతా ఏవిటండీ.. అయితే ఈ ఇంటి చుట్టూ రాత్రుళ్లు చీకట్లో తిరుగుతోంది మీరేనా.. ఎందుకండీ..’’ అంటూ తలపట్టుకుందామె.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!