Fantastic characters……………..
అక్షయ్ ఖన్నా విలనిజం గురించి చెప్పాలంటే… అది ఒక ‘సైలెంట్ సునామీ’ లాంటిది. బాలీవుడ్లో విలన్ అంటే కేకలు వేయడం, భయంకరంగా నవ్వడం అనే పాత పద్ధతిని పక్కన పెట్టి, కేవలం తన కళ్ళలోని తీక్షణతతో, గంభీరమైన నడకతో, సూటిగా గుచ్చుకునే డైలాగ్ డెలివరీతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడం అక్షయ్ ఖన్నా ప్రత్యేకత.
కొన్ని సినిమాల్లో చూస్తే, ఆయన విలన్ లా కాకుండా ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాన్ లా కనిపిస్తూనే, లోపల అత్యంత క్రూరమైన ప్లాన్లు వేసే వ్యక్తిలా కనిపిస్తారు. ఆయన చేసే పాత్రలు పెద్దగా హడావుడి చేయవు. అక్షయ్ ఖన్నా తన ముఖంలో పలికించే చిన్న చిన్న హావభావాలు ఎదుటివారిని భయపెట్టడానికి సరిపోతాయి.
ఆయన పోషించే ప్రతినాయక పాత్రలు కేవలం శారీరక బలం మీద కాకుండా, తెలివితేటలతో హీరోను ముప్పుతిప్పలు పెడతాయి. అందుకే ఆయన విలన్ గా నటిస్తే ఆ సినిమాకు ఒక హుందాతనం వస్తుంది.దర్శక,రచయితలు ఆయన నటనా శైలిని గమనించే విభిన్న పాత్రలను రూపొందిస్తున్నారు.ఆ పాత్రల ద్వారా ఆయనలోని నటుడిని గరిష్టంగా వాడుకుంటున్నారు.
అక్షయ్ ఖన్నామొదటి ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో నటుడిగా ఎక్కువ గౌరవాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన గంభీరమైన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను, కీలకమైన సహాయ పాత్రలను ఎంచుకుంటున్నారు.
శ్రీదేవితో కలిసి నటించిన ‘మామ్’ చిత్రంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటనలో ఆయన చూపిన పరిణతికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.’ఇత్తెఫాక్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటన సినిమాకు హైలైట్‌గా నిలిచింది.’సెక్షన్ 375′ సినిమాలో లాయర్‌గా ఆయన చూపిన వాదనా పటిమ, నటన ప్రేక్షకులను కట్టిపడేశాయి.
ఇది ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక మాస్టర్ క్లాస్ పెర్ఫార్మెన్స్ గా నిలిచిపోయింది. ‘దృశ్యం 2′ లో ఐజి తరుణ్ అహ్లావత్ పాత్రలో అజయ్ దేవగన్ లాంటి నటుడికి ధీటుగా నటించి సినిమా విజయానికి ప్రధాన కారకులయ్యారు.
అక్షయ్ ఖన్నా ఇప్పుడు కమర్షియల్ సక్సెస్ కంటే “పవర్ ఫుల్ పర్ఫార్మర్”గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన డేట్స్ కోసం పెద్ద దర్శకులు పోటీ పడుతున్నారు.ఆయన సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్‌కు నిదర్శనం.ఇక ‘ధురంధర్’ లో అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ పాత్ర ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది.
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పాత్ర పెద్దగా అరిచి కేకలు వేయదు. కేవలం తన కళ్ళతో, బాడీ లాంగ్వేజ్‌తోనే ఎదుటివారిని భయపెట్టే గంభీరతను ఆయన ప్రదర్శించారు. ఇది ఆయన మార్కు ‘అండర్‌స్టేటెడ్ యాక్టింగ్’కు పరాకాష్ట.
రెహమాన్ కేవలం ఒక నేరగాడు మాత్రమే కాదు, ఒక గొప్ప వ్యూహకర్త. జాతీయ భద్రతకు సవాలు విసిరే స్థాయి ప్లాన్లను అమలు చేసే తెలివైన ప్రతినాయకుడి పాత్రలో అక్షయ్ ఖన్నా అద్భుతంగా ఒదిగిపోయారు. సాధారణంగా విలన్ పాత్రలు రఫ్ గా ఉంటాయి. కానీ, ఇందులో అక్షయ్ పాత్ర చాలా స్టైలిష్‌గా, క్లాస్‌గా ఉంటూనే తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది.
ఇది ఆయన పాత సినిమా ‘రేస్’లోని పాత్రను గుర్తుకు తెస్తుంది, కానీ ఇక్కడ ఇంకా పదునైన నటనను కనబరిచారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్, సంజయ్ దత్ వంటి పెద్ద నటులు ఉన్నప్పటికీ, అక్షయ్ ఖన్నా తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో సీన్ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటారు .. అక్షయ్ ఖన్నా కెరీర్లో ‘సెక్షన్ 375’ తర్వాత నటుడిగా ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పాత్ర ఇదే.
ఇక ‘చావా’లో అక్షయ్ ఖన్నా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా పవర్ ఫుల్ పాత్రను పోషించారు. అక్షయ్ ఖన్నా తన నటనలో ఒక రకమైన ‘సైలెంట్ ఇంటెన్సిటీ’ని ప్రదర్శించారు. ఔరంగజేబు క్రూరత్వాన్ని చూపించడానికి ఆయన గట్టిగా అరిచే ప్రయత్నం చేయకుండా, తన కళ్ళతోనే భయంకరమైన హావభావాలను పలికించారు.
ఈ పాత్ర కోసం అక్షయ్ ఖన్నా పూర్తి స్థాయిలో మేకోవర్ అయ్యారు. బూడిద రంగు జుట్టు, గడ్డం, కళ్లకు కాటుకతో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. వయసు మళ్లిన ఔరంగజేబు పాత్రలో ఆయన రూపం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
కేవలం యుద్ధ వీరుడిగానే కాకుండా, తన గర్వాన్ని దెబ్బతీసిన శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్)ను ఎదుర్కోవడానికి ఎత్తుగడలు వేసే తెలివైన చక్రవర్తిగా ఆయన అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గాను జాగ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ (2025) లో ‘జ్యూరీ మెన్షన్ ఉత్తమ నటుడు’ అవార్డును అందుకున్నారు.
ప్రస్తుతం అక్షయ్ ఖన్నా పోషిస్తున్న ‘శుక్రాచార్య’ పాత్ర ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌లోనే అత్యంత శక్తివంతమైన పాత్రగా నిలవబోతోంది. పురాణాల ప్రకారం శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. ఆయన చెడ్డవాడు కాకపోయినా, దేవతలకు వ్యతిరేకంగా తన శిష్యులైన అసురుల కోసం నిలబడతాడు.
సినిమాలో కూడా అక్షయ్ పాత్ర కేవలం విలన్‌గా కాకుండా, తనకంటూ ఒక బలమైన సిద్ధాంతం ఉన్న గొప్ప వ్యూహకర్తగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా లుక్ కోసం అంతర్జాతీయ స్థాయి మేకప్ ఆర్టిస్టులు పని చేస్తున్నారు.ఆయన కళ్లలో ఉండే ఆ తీక్షణత అసుర గురువు పాత్రకు కావాల్సిన గాంభీర్యాన్ని చేకూర్చింది.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది.ఈ పాత్ర అక్షయ్ ఖన్నాను సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుందనడంలో సందేహం లేదు.
అక్షయ్ ఖన్నా వ్యక్తిగత విషయాలకొస్తే మార్చి 28, 1975న జన్మించారు. వచ్చే నెల మార్చి 28న ఆయన 51వ వసంతంలోకి అడుగుపెడతారు. ఆయన తండ్రి దివంగత లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా. ఆయన బాలీవుడ్లో ఒకప్పుడు సూపర్ స్టార్‌గా వెలిగారు. అక్షయ్ ఖన్నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆయన ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతారు.. అక్షయ్ ఖన్నా తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు.

