ఏముంది ఆయన ఆత్మకథ లో ?

Sharing is Caring...

‘Four Stars of Destiny’ Book ……………

ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ఆత్మకథ “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ” (Four Stars of Destiny) పుస్తకంపై ఫిబ్రవరి రెండో తేదీన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లోక్‌సభలోమాట్లాడారు. విడుదలకు అనుమతి ఇవ్వకుండా కేంద్రం అడ్డుపడుతోందని విమర్శలు గుప్పించారు. 

రాహుల్ ప్రసంగాన్ని మొదట్లోనే బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఆ పుస్త‌కాన్ని తాము ఆప‌లేద‌ని రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా ప్ర‌క‌టించ‌గానే ఈరోజు 3-2-26 న ఆ పుస్త‌కం విడుద‌ల అయింది. ఈ పుస్తకం గత ఏడాదిన్నర కాలంగా కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) సమీక్షలో ఉంది.

సైనిక రహస్యాలు లేదా సున్నితమైన అంశాలు ఏవైనా ఉన్నాయేమో పరిశీలించడానికి సాధారణంగా ఉన్నతాధికారుల పుస్తకాలను సమీక్షించడం ఒక పద్ధతి.అయితే సుదీర్ఘ కాలంగా క్లియరెన్స్ లభించకపోవడంతో విడుదల ఆలస్యమైంది. ఈ పుస్తకాన్ని ప్రభుత్వం అధికారికంగా నిషేధించలేదు, కానీ సమీక్ష పేరుతో ఆలస్యం చేసింది.

ఈ పుస్తకంలో 2020లో చైనాతో జరిగిన గాల్వాన్ ఘర్షణల సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ‘అగ్నిపథ్’ స్కీమ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయని అంటారు. ఇక ఈ పుస్తకం రాసిన వ్యక్తి సామాన్యులు కాదు.

జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే (రిటైర్డ్) భారత సైన్యానికి చెందిన అత్యంత గౌరవనీయులైన అధికారులలో ఒకరు. ఆయన డిసెంబర్ 31, 2019 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు  28వ భారత సైన్యాధిపతిగా సేవలు అందించారు.జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం, డిసెంబర్ 2021 నుండి ఏప్రిల్ 2022 వరకు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) తాత్కాలిక ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

42 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంకలోని భారత శాంతి పరిరక్షక దళంలో (IPKF) కూడా పనిచేశారు. ఆయన పదవీ కాలంలోనే చైనాతో గాల్వాన్ లోయ ఘర్షణలు (2020) జరిగాయి. ఆ సమయంలో సరిహద్దుల్లో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఏప్రిల్ 22, 1960న మహారాష్ట్రలోని పుణేలో జన్మించారు.పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) పూర్వ విద్యార్థి. ఆయన డిఫెన్స్ స్టడీస్‌లో పీహెచ్‌డీ (PhD) కూడా పొందారు.ఆయన 1980లో సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ (Sikh Light Infantry) 7వ బెటాలియన్‌లో నియమితులయ్యారు. భారత ప్రభుత్వం ఆయనను అనేక విశిష్ట సేవా పతకాలతో గౌరవించింది.

సైనిక అధికారులు (సర్వీసులో ఉన్నవారు లేదా పదవీ విరమణ చేసినవారు) పుస్తకాలు రాయడానికి, ప్రచురించడానికి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి తప్పనిసరి. దీనికి సంబంధించి ప్రధానంగా రెండు చట్టాలు/నిబంధనలు అమలులో ఉన్నాయి.

1. 1954 నాటి ఆర్మీ రూల్స్ (సెక్షన్ 21)….. భారత సైన్యంలో పనిచేస్తున్న అధికారులు లేదా సిబ్బంది ఏదైనా పుస్తకం, వ్యాసం లేదా లేఖను ప్రచురించాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా రాజకీయ సంబంధిత విషయాలపై రాయకూడదు.సైనిక కార్యకలాపాలు లేదా అధికారిక సమాచారంతో కూడిన అంశాలను ప్రచురించడానికి ముందస్తు అనుమతి అవసరం.

2. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (1923)…….ఇది కేవలం సైనికులకే కాకుండా అందరికీ వర్తిస్తుంది. దీని ప్రకారం దేశ భద్రతకు భంగం కలిగించే రహస్య కోడ్లు, ప్లాన్లు లేదా అధికారిక పత్రాలను బహిర్గతం చేయడం నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 3 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

3. రిటైర్డ్ అధికారులకు నిబంధనలు (CCS Conduct Rules)… పదవీ విరమణ చేసిన అధికారులకు కూడా కొన్ని షరతులు ఉంటాయి.

పెన్షన్ నిబంధనలు…. 2021లో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ప్రకారం, ఇంటెలిజెన్స్ లేదా భద్రతా సంబంధిత సంస్థలలో పనిచేసిన రిటైర్డ్ అధికారులు తమ సంస్థకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా ప్రచురించాలంటే ముందస్తు అనుమతి (NOC) తీసుకోవాలి. పుస్తకంలో ప్రభుత్వం తీసుకున్న విధానాలను విమర్శించకూడదని, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే అంశాలు ఉండకూడదని నిబంధనలు ఉన్నాయి.

జనరల్ ఎం.ఎం. నరవణే పుస్తకం “ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ”  విడుదల ఆలస్యం కావడానికి కారణం ఇదే. అయితే ఏడాదికి పైగా క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో వివాదం అయింది.  ఇపుడు ఆ పుస్తకం అమెజాన్ లో లభ్యమవుతుంది.ఇందులో ఏమి ఆయన రాసారో ? కొద్దీ రోజులు గడిస్తే గానీ తెలియదు.   

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!