Manimahesh yatra……..
పంచ కైలాస పర్వతాలలో మణిమహేష్ కైలాస పర్వతం ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో, సముద్ర మట్టానికి సుమారు 4,080 మీటర్ల (13,390 అడుగులు) ఎత్తులో ఉంది. ఈ పర్వతం పక్కనే మణిమహేష్ సరస్సు ఉంది. ఈ సరస్సును అత్యంత పవిత్రమైన సరస్సుగా భావిస్తారు.
హిమాలయాలలోని పిర్ పంజాల్ శ్రేణిలో ఉన్న ఈ సరస్సును ‘దాల్ సరస్సు’ అని కూడా పిలుస్తారు.ఈ ప్రాంతాన్ని శివుని నివాసంగా భక్తులు భావిస్తారు. టిబెట్‌లోని కైలాస మానస సరోవరం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం ఇదే.ప్రతి సంవత్సరం ఆగస్టు/సెప్టెంబర్ నెలల్లో (శ్రీకృష్ణ జన్మాష్టమి నుండి రాధాష్టమి వరకు) అధికారికంగా మణిమహేష్ యాత్ర జరుగుతుంది.
యాత్రికులు హడ్సర్ (Hadsar) నుండి సుమారు 13-14 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ చేస్తూ సరస్సును చేరుకుంటారు.మణిమహేష్ కైలాస శిఖరంపై తెల్లవారుజామున సూర్యకిరణాలు పడినప్పుడు అది ఒక ప్రకాశవంతమైన మణిలా మెరుస్తుంది. అందుకే దీనికి ‘మణిమహేష్’ అనే పేరు వచ్చింది.
మణిమహేష్ సరస్సు పవిత్ర జలాల్లో స్నానం చేస్తే పాపాలు నశించి, ఆత్మ శుద్ధి జరుగుతుందని,తదుపరి కైలాష శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల ప్రగాఢ నమ్మకం. యాత్ర సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.
ఇక మణిమహేష్ కైలాస శిఖరాన్ని ఇప్పటికీ ఎవరూ అధిరోహించని శిఖరంగా చెబుతారు. మణిమహేష్ యాత్రకు వెళ్లాలనుకుంటే విమాన మార్గం అయితే సమీప విమానాశ్రయం కాంగ్రా (గగ్గల్), ఇది భర్మౌర్ నుండి సుమారు 180-190 కి.మీ దూరంలో ఉంది. రైలు మార్గం అయితే సమీప రైల్వే స్టేషన్ పఠాన్‌కోట్. ఇక్కడి నుండి భర్మౌర్‌కు బస్సులు లేదా టాక్సీలు దొరుకుతాయి (సుమారు 180 కి.మీ).
రోడ్డు మార్గం అయితే పఠాన్‌కోట్ → చంబా → భర్మౌర్ (60 కి.మీ) → హడ్సర్ (13 కి.మీ). హడ్సర్ వరకు వాహనాలు వెళ్తాయి.అసలైన యాత్ర హడ్సర్ నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండి సరస్సు వరకు సుమారు 13-14 కిలోమీటర్ల కఠినమైన నడక ఉంటుంది.హడ్సర్ నుండి ధంచో వరకు 6-7 కి.మీ నడవాలి .. టెంట్లలో రాత్రికి బస చేయాలి.
మరుసటి రోజు ధంచో నుండి మణిమహేష్ సరస్సు వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే సరస్సులో స్నానం ఆచరించి ..శిఖర దర్శనం చేసుకోవాలి. యాత్ర సమయంలో భక్తుల కోసం భోజన ఏర్పాట్లు ఉంటాయి. నడవలేని వారి కోసం భర్మౌర్ నుండి గౌరీ కుండ్ వరకు హెలికాప్టర్ సౌకర్యం ఉంటుంది.వెళ్ళేటపుడు ఎత్తైన ప్రాంతం కావడంతో, మంచినీరు, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ వెంట ఉంచుకోవడం మంచిది.
ఇక తిరుగు ప్రయాణం మణిమహేష్ సరస్సు → గౌరీ కుండ్ → ధంచో → హడ్సర్ వరకు సాగుతుంది. సాధారణంగా దిగడానికి 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. హడ్సర్ చేరుకున్నాక, అక్కడ అందుబాటులో ఉండే షేర్డ్ టాక్సీలు లేదా బస్సుల ద్వారా భర్మౌర్ చేరుకోవచ్చు.భర్మౌర్ లో బడ్జెట్ హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు అందుబాటులో ఉన్నాయి.
2026లో ఈ యాత్ర ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 వరకు జరుగుతుందని భావిస్తున్నారు.అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి.హడ్సర్ బేస్ క్యాంప్ వద్ద వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని యాత్రకు అనుమతించరు.ఆరోగ్యంగా ఉన్నవారు .. నడక బాగా అలవాటు ఉన్నవారు వెళ్ళడం మంచిది.


