‘లింగ భైరవి దేవి’ ప్రత్యేకత ఏమిటంటే ?

Sharing is Caring...

Goddess Linga Bhairavi devi …………………

శివుడు లింగరూపంలో ఉండటం సహజం..కానీ అమ్మవారు లింగ రూపంలో ఉండటం చాలా అరుదు.. లింగ రూపంలో భైరవి దేవి ప్రత్యేకంగా దర్శనమిస్తారు. భైరవి భైరవుడి సతీమణి. శివుడి మరో రూపమే భైరవుడు. కోయంబత్తూరు దగ్గర వెల్లియంగిరి పర్వతాల పాదాల వద్ద ఉన్న ఇషా యోగా కేంద్రం ప్రధాన ఆలయం లో  లింగ భైరవి దేవి ని దర్శించుకోవచ్చు.

లింగ భైరవి విశ్వంలోని సృజనాత్మక శక్తికి ప్రతీకగా నిలుస్తుంది, ఈ రూపంలో స్త్రీ శక్తిని  అత్యున్నత శక్తిగా చూడవచ్చు. సద్గురు జగ్గీ వాసుదేవ్  ప్రాణప్రతిష్ఠ అనే పురాతన  శ క్తివంతమైన ప్రక్రియ ద్వారా లింగ భైరవి దేవిని ప్రతిష్టించారు. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, జీవంతో, ప్రబలమైన శక్తితో నిండిన ఒక దివ్య స్వరూపం అని భక్తులు చెబుతారు.

దేవి ఒకేసారి తీక్షణమైన, ఉగ్రమైన శక్తి స్వరూపంగా, భక్తులను పోషించే, సంరక్షించే దయగల తల్లి స్వరూపంగా ఉంటుంది. ఈ ద్వంద్వ స్వభావం భక్తులకు భయాన్ని పోగొట్టి, రక్షణను అందిస్తుంది. ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలను మహిళలైన ‘భైరాగిణి మాస్’ ఉపాసకులు నిర్వహిస్తుంటారు.

లింగ భైరవి దేవిని పూజించడం వల్ల భక్తులకు శారీరక, భౌతిక శ్రేయస్సుతో పాటు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఎదుగుదల …. స్థిరత్వం లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ ఆలయం జీవితాన్ని సుసంపన్నం చేసే ఎన్నో విశిష్టమైన ఆచారాలకు … పూజా విధానాలకు కేంద్రంగా ఉందని చెబుతారు. 

లింగ భైరవి దేవి ఆలయాలు ఢిల్లీ లో, హైదరాబాద్‌లో, సేలంలో ఉన్నాయి .. వీటిని ఇషా ఫౌండేషన్  స్థాపించింది. అలాగే అమెరికాలో ఇషా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైనెన్స్ వద్ద ఒక ఆలయం .. నేపాల్లో  ఒక ఆలయం ఉంది.

పురాణాలలో “భైరవి” దేవి ప్రస్తావన ఉంది.. భైరవి దేవి పది మహావిద్యలలో (హిందూ మాతృదేవత అవతారాలు) ఒకరిగా వర్ణించబడింది.పురాణాల ప్రకారం, ఆమె శివుని  భయంకరమైన రూపమైన భైరవుడి సహచరి. ఈ భైరవినే లింగ భైరవిగా మార్చిప్రతిష్టించారని చెబుతున్నారు.

“లింగం” రూపంలో స్త్రీ దేవతను ప్రతిష్టించడం అనేది ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక ఆధునిక ప్రతిష్ఠాపన (consecration) 2010 లో జరిగింది. ఒక ప్రత్యేకమైన..శక్తివంతమైన స్త్రీలింగ శక్తి రూపంగా సృష్టించబడింది.. ఈ దేవి ప్రస్తావన సాంప్రదాయ గ్రంథాలలో నేరుగా కనిపించదు అంటున్నారు.

నవరాత్రి సమయాల్లో లింగ భైరవి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లింగ భైౖరవి దేవికి నిత్యం పూజలు చేసి, అమ్మవారిని భక్తి శ్రద్దలతో కొలుస్తారు. లింగ భైరవి దేవి దర్శనం అందరికీ ఉచితమే.ఇషా యోగా సెంటర్‌ను సందర్శించడానికి లేదా ధ్యానలింగం, లింగ భైరవిని దర్శించుకోవడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.

అయితే, ప్రత్యేక అభిషేకాలు లేదా పూజలలో పాల్గొనడానికి, యంత్రాలను స్వీకరించడానికి రుసుములు ఉంటాయి. కానీ సాధారణ దర్శనం మాత్రం అందరికీ ఉచితమే. కోయంబత్తూర్ నగరం నుండి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. కార్ లేదా బస్సుల ద్వారా అక్కడికి చేరుకోవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!