ఆ కృష్ణుడికి మీసాలు ఎలా వచ్చాయో ?

Sharing is Caring...

మనం సినిమాల్లో శ్రీకృష్ణుడిని మీసాలు లేనట్టే  చూసాం. కృష్ణుడి పాత్ర పోషించిన ఎన్టీఆర్, శోభన్ బాబు,కాంతారావు, తదితర నటులు కూడా మీసాలు పెట్టుకున్న దాఖలాలు లేవు.  చిత్రకారులు కూడా ఎక్కడా కృష్ణుడికి మీసాలు ఉన్నట్టు బొమ్మలు గీయ లేదు. ఎక్కడయినా ఉన్నా ఒకటి ఆరా మాత్రమే. దీన్ని బట్టి కృష్ణుడికి మీసాలు లేనట్టే భావిస్తాం.

కానీ కొన్ని ఆలయాల్లో మీసాల కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద తమిళనాడులో ఒకచోట , ఆంధ్రాలో, తెలంగాణలో మీసాల కృష్ణుళ్ళు దర్శనమిస్తారు.  వీటిలో తెలంగాణా మీసాల కృష్ణుడు చాలా పాపులర్.  మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్‌లో ఈ మీసాల కృష్ణుడు కొలువు దీరాడు.

ఆ స్వామి అక్కడ కొలువు తీరడం వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి ప్రచారంలో ఉన్నది. ఇది 200 ఏళ్ళ కిందటి మాట. దుబ్బాక సంస్థానాన్ని పాలించే దొరల వల్ల వేధింపులకు గురైన ఆ గ్రామస్తులు కప్పం కట్టకూడదని నిర్ణయించుకున్నారు. నిలువు నామాలు కలిగిన వేణుగోపాలస్వామి ఆలయాన్ని కట్టి, ఆ పేరు చెప్పి కప్పానికి ఎగనామం పెట్టాలనుకున్నారు.

ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కాశీ నుంచి విగ్రహం తెప్పిద్దామనుకున్నారు. అయితే ఆర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో నిరాదరణకు గురైన ఆలయం నుంచి ఒక విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠిద్దామన్న నిర్ణయానికి వచ్చారు.  అన్ని గ్రామాలు గాలించడం మొదలు పెట్టారు. 

రామ్‌గోపాల్‌పేట గ్రామంలో అలాంటి విగ్రహం కనిపించింది. వెంటనే దాన్ని తీసుకొచ్చారు. విగ్రహ ప్రతిష్ట కు సన్నాహాలు చేస్తుండగా  రామ్‌గోపాల్‌పేట గ్రామస్తులు విగ్రహాన్ని వెతుకుతూ వస్తున్నారని సమాచారం అందింది. దీంతో కొన్నాళ్ళు విగ్రహాన్ని చెరువులో దాచిపెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్ఠకు ఉపక్రమించారు.

విగ్రహాన్ని రామ్‌గోపాల్‌పేట ప్రజలు గుర్తు పట్టకుండా… తలపై ఉన్న కొప్పును తొలగించి కిరీటం పెట్టారు. విగ్రహానికి వెండి మీసాలను చేర్చారు. దీంతో కృష్ణుడి రూపు రేఖలు మారిపోయాయి. ఆవిధంగా మీసాల కృష్ణుడు ఆ ఆలయంలో కొలువుదీరాడు.పక్క ఊరి ప్రజలు వచ్చి మన విగ్రహం కాదులే అని వెళ్లిపోయారు. నాటి నుంచి ఈనాటి వరకు మీసాల కృష్ణుడు అదే రూపంలో పూజలందుకుంటున్నాడు.

ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే  ఉంటుంది. ఇది సుమారు 200 ఏళ్ళ నుంచి వెలుగుతూనే ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.గర్భాలయంలో కొలువైన దైవాన్ని ఈ దీపారాధన వెలుగులోనే దర్శించాలని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి దీపారాధన కొన్ని దేవాలయాల్లో ‘అఖండ దీపం’గా కనిపిస్తూ వుంటుంది.

ఈ అఖండ దీపాన్నే ‘నందాదీపం’ అని కూడా పిలుస్తుంటారు. ఈ దీపం వల్ల  ఆ గ్రామం పాడిపంటలు, సిరిసంపదలతో విలసిల్లతుందని వారి నమ్మకం. వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే స్వామికి ముడుపులు కడతారు.

ఎలాంటి వివాదమైనా ఈ వేణుగోపాలుని ఆలయం మెట్లు ఎక్కితే ఇట్టే పరిష్కారం అవుతుందని  … స్వామి సన్నిధిలో అబద్ధం ఆడినవారికి శిక్ష తప్పదని భక్తులు నమ్ముతారు. అందుకే అక్కడకొచ్చి అబద్దాలు చెప్పారని అంటారు. హైదరాబాద్ కు 128 కి.మీ… మెదక్‌కు 55 కి.మీ. దూరంలో చెల్లాపూర్‌ గ్రామం ఉంది.  రోడ్డు మార్గం ద్వారా సులభం గా చేరుకోవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!